మూగజీవాల బంధువు!


Sat,March 23, 2019 01:17 AM

సమయం.. రాత్రి 11.30 గంటలు.. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఎక్కడో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. లిఫ్ట్ చేసింది.. నమస్తే మేడమ్.. నర్సంపేట రోడ్‌లో యాక్సిడెంట్ జరిగింది. బస్సు ఢీకొట్టడంతో ఆవు, దూడ అల్లాడిపోతున్నాయి. రక్తం బాగా కారుతుంది. త్వరగా రండి మేడమ్ అనే ఆర్తనాదాలు. క్షణం కూడా ఆలోచించలేదు సుమ. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని.. తండ్రిని వెంటబెట్టుకొని బైక్‌పై స్పాట్‌కు వెళ్లి ప్రథమ చికిత్స చేసింది. ఫోన్ చేసిన వ్యక్తి, తండ్రి సాయంతో ఆ జీవాలను ఇంటికి తీసుకెళ్లింది. ప్రత్యేకంగా తయారు చేయించిన స్టాండ్‌లో వాటిని ఉంచి.. ప్రభుత్వం అందిస్తున్న 1962 నంబర్‌కు కాల్ చేసింది. వారి సహాయంతో నెల రోజులపాటు వైద్యం చేయించింది. ఆవును, దూడను మామూలు స్థితికి తీసుకొచ్చి యజమానికి అప్పగించింది సుమ. మూగ జీవాలపై తనకున్న ప్రేమకు ఇదొక నిదర్శనం. ఆపదలో ఉన్న మూగ జీవాలకు అండగా నిలుస్తూ.. వాటికి బంధువు అయింది సుమ.
sumaa
ఈమెది మూగజీవ బంధం. జంతువులు బావిలో పడితే అల్లలాడిపోతుంది. వాటిని బయటికి తీసి సురక్షితంగా అడవిలో వదిలే వరకూ తల్లడిల్లిపోతుంది. అంతటి సున్నిత మనస్తత్వం కలదీ సుమ. ఒక్కమాటలో చెప్పాలంటే మూగ జీవాలకు ఆత్మబంధువు. తన పరిధిలో పశుపక్షాదులకు ఏ ప్రమాదం వచ్చినా.. నేనున్నాను అంటూ ముందుకొస్తుంది .. తండ్రి చూపిన బాటలో పయనిస్తూ.. సేవ చెయ్యడమే మార్గంగా ఎంచుకొని వందల జంతువులను ప్రమాదం నుంచి కాపాడింది.

జంతువుల కోసం ప్రత్యేక నెట్‌వర్క్ !

తన పరిధిలో మూగ జీవాలకు ఎక్కడ, ఎప్పుడు ప్రమాదం జరిగినా ముందుగా ఫోన్ వచ్చేది సుమకే. కాల్ వచ్చిన పది నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకుంటుంది.అది అర్ధరాత్రి అయినా.. అపరాత్రి అయినా.. వెళ్లి తీరాల్సిందే. ప్రమాదస్థలానికి వెళ్లి.. ఆపదలో ఉన్న జంతువులు, పక్షులకు చికిత్స అందించి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా తనకంటూ ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. అటవీ జంతువులను వేటాడి.. వాటి మాంసం విక్రయిస్తున్న ఎంతోమంది నేరగాళ్ల ఆటకట్టించింది. వారి వివరాలను అటవీ అధికారులకు అందించి.. అటవీ జంతువులకు ఆత్మబంధువుగా మారింది. ఇలా ఎన్నో జంతువులు, పశుపక్షాదులను కాపాడింది సుమ. అరుదైన గుడ్లగూబలు, విదేశీ పక్షులు, రామ చిలుకలు, నక్షత్ర తాబేళ్లు, వానరాలు, జింకలు, దుప్పులు, నక్కలు, పశువులు వంటివి సుమ కాపాడిన జాబితాలో ఉన్నాయి.

ఇంట్లోనే జంతువులకు ఆశ్రయం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నేనుసైతం స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపక, అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్ సుభాని, సలీమ దంపతుల కుమార్తె మహ్మద్ సుమ. ముస్లిం కుంటుంబానికి చెందిన సుమ.. చిన్నప్పటి నుంచే ఆపదలో ఉన్న జంతువులను కాపాడేది. మానవ మనుగడకు జీవవైవిధ్యం ఎంతో అవసరమని తండ్రి ద్వారా నమ్మిన సుమ.. నేటికీ అదే పాటిస్తున్నది. ప్రమాదంలో గాయపడిన పక్షులు, జంతువులకు తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తుంది సుమ కుటుంబం. తండ్రి సుభాని, తల్లి సలీమా వాటికి ఆహారం, నీరు అందించి సపర్యలు చేస్తుంటారు. వారి ఇంటి వెనుక ఖాళీ స్థలంలో వీటి కోసమే ప్రత్యేకంగా షెడ్‌లు ఉన్నాయి. పశువులు వంటి వాటికి ప్రత్యేకంగా కర్రలతో చేసిన స్టాండ్లు ఉన్నాయి. నడుములు, కాళ్లు విరిగిన జంతువులకు ఈ స్టాండ్లలో ఉంచి ప్రత్యేకంగా వైద్యం అందిస్తారు. అవి పూర్తిగా కోలుకునే వరకూ ఆశ్రయం కల్పించి.. అన్ని తామై చూసుకుంటారు. ఇలా 12 యేండ్ల నుంచి మూగజీవాల సేవ చేస్తున్నారు.

1962 సేవలపై విస్తృత ప్రచారం..


suma
మనుషులు గాయపడితే 108 వైద్య సేవలు ఉన్నట్లే.. జంతువులకు కూడా 1962 అత్యవసర సేవలు ఉన్నాయి. ఈ సేవల గురించి తెలియక ఎంతోమంది రైతులు తమ జీవాలను దూరం చేసుకుంటున్నారు. అనారోగ్యం పాలైన పశువులకు వైద్యం చేయించడం పేద రైతులకు తలకుమించిన భారంగా మారుతుంది. అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పశుపక్షాదుల కోసం 1962 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంచార పశు వైద్యశాల (అంబులెన్స్) గురించి విస్తృత ప్రచారం చేస్తున్నది సుమ. ఇందుకోసం మహబూబాబాద్ మండల పరిధిలోని 21 గ్రామాల్లో పాదయాత్ర చేపట్టింది. నిర్విరామంగా 183 కిలోమీటర్లు నడిచి 1962 సేవలను వినియోగించుకోవాలని కోరింది. ఏ మారుమూల గ్రామం నుంచైనా 1962 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే.. 30 నిమిషాల్లో సంచార పశు వైద్యశాల మీ ఇంటికి చేరుకొని, అనారోగ్యం బారిన పడిన పశువులకు ఇంటి వద్దనే ఉచితంగా వైద్యం అందిస్తుంది. ఈ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి కాబట్టి.. ప్రజలంతా వినియోగించుకోవాలని కోరుతుంది సుమ.

మూగజీవాల రక్షణ అందరిది


suma4
జంతువులు, పక్షులు ఆపదలో ఉన్నాయని తెలియగానే అక్కడికి వెళ్లి రక్షించడం నా అలవాటుగా మారింది. మూగ జీవాల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. ఈ సృష్టిలో జీవించే పేడ పురుగు కూడా.. ప్రకృతి పరిరక్షణకు తనవంతు సాయం చేస్తుంది. అలాంటి చిన్న పురుగులు అంతరిస్తే ఆ ప్రభావం మన మనుగడపై పడుతుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను పటిష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన ఇంకా మరిన్ని చట్టాలు తీసుకొస్తారని ఆశిస్తున్నాం.
- మహ్మద్ సుమ, నేను సైతం సభ్యురాలు

నక్క కోసం సాహసం!


suma3
అది మహబూబాబాద్ పట్టణ శివారులోని బేతోల్ గ్రామం. ఇక్కడి ప్రజలకు తాగునీటికి ప్రభుత్వం తవ్వించిన బావే ఆధారం. ఓ నక్క వచ్చి అందులో పడింది. దానిని బయటికి తీయడానికి స్థానికులు చాలా ప్రయత్నాలు చేశారు. అటవీ జంతువు కావడంతో కరుస్తుందేమోనని ఆ బావిలోకి దిగే సాహసం చెయ్యలేదు. అప్పటికే రెండో రోజు కావడంతో.. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సుమ చేస్తున్న సేవ తెలిసిన ఆ ఊరి మాజీ సర్పంచ్ ఆమెను సంప్రదించాడు. దీంతో బావిలో పడ్డ నక్క ప్రాణాలు కాపాడాలనే తపనతో సుమ హుటాహుటిన బేతోల్ గ్రామానికి చేరుకుంది. వెంటనే నడుముకు తాడుకట్టుకొని 42 అడుగుల లోతున్న బావిలోకి దిగింది. కానీ ఆ నక్క అప్పటికే చనిపోయింది. దీంతో నక్క కళేబరాన్ని బయటకు తీసి.. స్థానికులకు తాగునీటి సమస్య లేకుండా చేసింది. సుమ చేసిన మంచి పనిని బేతోల్ గ్రామస్తులంతా అభినందించారు.

...?కన్నెబోయిన రాజు

(మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి)
నాళ్ళం రఘుపతి

845
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles