9వ ర్యాంక్‌తో.. గేట్ బద్దలు కొట్టింది!


Thu,March 21, 2019 02:39 AM

సాధించాలనే పట్టుదల ఉంటే సరిపోదు. దానికి కసి తోడవ్వాలి. అవి రెండూ ఉంటే సరిపోదు.. లక్ష్యాన్ని చేరుకునేందుకు సరైన ప్రణాళిక కూడా అవసరం. అప్పుడే ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్నదైపోతుంది. అందుకు ఉదాహరణే రంగ చందన. ఇంజినీరింగ్ విద్యార్థుల భవితవ్యాన్ని మార్చే గేట్ జాతీయ స్థాయి పరీక్షలో.. 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందుతున్నది.ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. తానే సొంతంగా మెటీరియల్ తయారుచేసుకుంది. రోజులో ఏడు గంటలు చదువుకునేలా తన టైంటేబుల్ సిద్ధం చేసుకుంది.
Ranga-Chandana1
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్).. ఇది ఇంజినీరింగ్ తలరాతను మార్చే పరీక్ష. ఎంతో మంది విద్యార్థులు ఈ జీవిత పరీక్షను ఎదుర్కొనేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు.. గండం గట్టేక్కినట్టే అనుకుంటారు. పట్టుదల, కసితో పాటు.. పక్కా ప్రణాళికతో చదివితేనే గేట్ సాధించగలరని నిరూపించింది చందన. ఈ గ్రామీణ విద్యా కుసుమం.. ఎలాంటి కోచింగ్‌లకు వెళ్లకుండానే మొదటి ప్రయత్నంలోనే గేట్ 361 ర్యాంక్ సాధించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 5లక్షల వేతనంతో ఉద్యోగం కూడా సంపాదించింది. అయినా.. ఏదో వెలితి. తానేంటో నిరూపించుకోవాలనే తపనతో ఉద్యోగాన్ని వదులుకుంది చందన. ఈ ఏడాది గేట్ పరీక్ష రాసి.. జాతీయ స్థాయిలో 9వ ర్యాంక్ సాధించి దేశం చూపు తనవైపు తిప్పుకొనేలా చేసింది. ఈ సారి కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. తానే సొంతంగా మెటీరియల్ తయారుచేసుకుంది. రోజులో ఏడు గంటలు చదువుకునేలా తన టైంటేబుల్ సిద్ధం చేసుకుంది. ప్రతీది నోట్స్ రూపంలో రాసుకుంది. గతంలో వచ్చిన ప్రశ్నల విధానాన్ని అధ్యయనం చేసింది. ఇలా స్వతహాగా ఇష్టంతో కష్టపడి మంచి ర్యాంక్ సాధించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన రంగ జనార్దన్ గౌడ్, మామణి సంతానం చందన. ఈమె అన్నయ్య బాలచందర్ గౌడ్ ముంబైలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. తండ్రి జనార్దన్ గౌడ్ గతంతో సర్వే ఆఫ్ ఇండియాలో 15 యేండ్లపాటు ఉద్యోగం చేశారు. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్యోగం చేసి.. దేశం తరఫున సత్కారాన్ని కూడా అందుకున్నారు. తర్వాత సివిల్స్ రాసి ఏఈ ఉద్యోగం పొందారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Ranga-Chandana
తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఈ ఏడాది గేట్‌లో 100 మార్కులకు గాను 80.33 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంక్‌లో నిలిచింది. చిన్నప్పటి నుంచి చదువుల్లో టాప్. ఉప్పల్‌లోని సెయింట్ జేవియర్ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసింది. నాగ్‌పూర్‌లోని ఐఐటీలో మెటలర్జీ (ఎంటీ) విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. తండ్రి ప్రోత్సాహంతో పాటు తల్లి పెంపకంలో చదువుపట్ల ఆసక్తిని కనబర్చి మంచి ఫలితాలను సాధిస్తున్న చందనను పలువురు అభినందిస్తున్నారు.

694
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles