అనగనగా.. ఓ దీపాకిరణ్!


Tue,March 19, 2019 04:17 AM

deepakiran2
కథలు చెప్పాలంటే తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మలు ఉండాలి.. న్యూక్లియర్ ఫ్యామిలీల వల్ల వాళ్లు ఊళ్లకే పరిమితమవుతున్నారు. మరి అనగనగా.. అంటూ ఆ కథలు చెప్పే వాళ్లే లేకపోతే.. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించేది ఎవరు? అందుకే నేనున్నానంటూ స్టోరీ టెల్లింగ్‌ని వృత్తిగా చేసుకుందీమె. స్టోరీ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి.. భారతదేశంలోని పలు స్కూళ్లలో శిక్షణా కార్యక్రమాలు కూడా చేపడుతున్నది. నాలుగు భాషల్లో కథలు చెబుతూ అందరి చేత మెప్పు పొందుతున్నది. ఆస్ట్రియా, గ్రీస్, స్కాట్‌లాండ్, ఇరాన్‌లలో.. స్టోరీ టెల్లింగ్ ఉత్సవాలకు వెళ్లిన తొలి భారతీయురాలుగా ప్రసిద్ధి గాంచింది. ఆమే దీపాకిరణ్.. కళ్లకు కట్టినట్లు కథలు చెప్పే కళఆమెకు ఎలా అబ్బిందో తెలుసుకోండి.పిల్లలు.. ఉదయాన్నే లేచి రెడీ అయి స్కూల్‌కి వెళ్లడం. బడిలో పాఠాలు విని ఇంటికొచ్చి హోమ్ వర్క్ పూర్తి చేయడం వారి రొటీన్ షెడ్యూల్. గోరుముద్దలు తింటూ అమ్మమ్మ చెప్పే ముచ్చట్లు వింటుంటే తెలియకుండా తినేస్తుంటారు. తాతయ్య చెప్పే కథలు వింటుంటే కలల్లోకి విహరిస్తూ నిద్రలోకి జారుకోవడం.. ఇవన్నీ ఒకప్పటి మాట. కాలం మారింది. కాలంతో పాటు కథలూ మారాయి. అమ్మమ్మ, తాతయ్య ఊళ్లో ఉంటే, పిల్లలు మాత్రం నగరాల్లో ఉంటున్నారు. ఆనాటి కథలు లేవు. ఊహాలూ అలాగే ఉండిపోతున్నాయి. టీవీలు, కంప్యూటర్‌లకు అత్తుకుపోయి పిల్లల్లో సృజనాత్మక, ఊహాత్మక శక్తి అనేవే కనుమరుగవుతున్నాయి. కథలు కావాలంటే.. ట్యాబ్స్, ఆటలాడాలంటే స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమవుతున్నారు పిల్లలు. అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే కథలకు, ప్రకృతికి దూరమైన పిల్లలను మళ్లీ తన కథలతో కళా ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు హైదరాబాద్‌కు చెందిన స్టోరీ టెల్లర్ దీపా కిరణ్.


అమ్మే స్ఫూర్తి..

దీపా కిరణ్ పుట్టింది కలకత్తా అయినా.. తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై, బెంగళూరు వంటి నగరాలు తిరిగారు. చివరికి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీంతో దీప విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. చిన్నప్పటి నుంచి దీపని ఏం అడిగినా సూటిగా చెప్పేది కాదు. కథల రూపంలో వివరించేది. ఇంట్లోవాళ్లు ఏదో తమాషాగా చేస్తుందిలే అనుకునేవారు. దీపా తండ్రి బాలసుబ్రహ్మణ్యన్ ఇంజినీర్. తల్లి భవాని గృహిణి. దీప తండ్రి ప్రతిరోజూ రాత్రి ఆమెకి కథలు చెప్పేవారట. ఆ కథలు ఆమెను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేవి. ఇక దీప వాళ్లమ్మకు కళలు, వివిధ సంస్కృతులంటే ఇష్టం. చాలా సెన్సిబుల్ వ్యక్తి. అవన్నీ దీపలోనూ ఉన్నాయి. కళలు నేర్చుకోవడంలో, వివిధ సంస్కృతులను వంటబట్టించుకోవడంలో అమ్మే నాకు స్ఫూర్తి అంటున్నది దీప.


సరదాగా మొదలై..

దీపా ఎన్‌సీసీలో యాక్టీవ్‌గా ఉండేది. ఎయిర్‌వింగ్ క్యాడర్‌లో ైగ్లెడర్ పైలట్. దాంతో ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లాలని అనుకున్నది. తల్లిదండ్రులు వద్దనడంతో న్యూట్రిషన్ అండ్ క్లినికల్ బైనమిక్స్‌లో డిగ్రీ చేసింది. తర్వాత హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది. గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ టీచింగ్ స్పెషలైజేషన్ చేసింది. తండ్రి ఇంటికి ఏవేవో పుస్తకాలు తెచ్చేవాడు. అవన్నీ పూర్తిగా చదివేది దీప. జాగ్రఫీ, హిస్టరీ, కథల పుస్తకాలు ఇలా దొరికినవన్నీ చదివేసేది. చిన్నప్పుడే భరతనాట్యం నేర్పించారు తల్లిదండ్రులు. ఆరవ తరగతి నుంచే భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియోలో యువవాణి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది దీప. వయోలిన్, ఉపన్యాసాలు ఇలా అనేకరంగాల్లో ప్రవేశమున్న దీప బోధనా రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నది. కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లిష్ బోధించేది. పిల్లల్ని ఆకట్టుకునేలా పాఠమెలా చెప్పాలో అక్కడే నేర్చుకున్నది. పాఠాన్ని పాఠంలా చెబితే ఎవరూ వినరు. మనసులోకి అసలు ఎక్కదు. అందుకే పాఠాన్ని మాటలు, పాటల్లోకి మార్చింది. అకడమిక్ సబెక్ట్‌లను స్టోరీ టెల్లింగ్‌లోకి అనువదిస్తూ సరికొత్త ప్రయోగం చేసింది. ఆమె ప్రయోగానికి మంచి ఫలితాలొచ్చాయి. పిల్లలు ఆమె క్లాసులో లీనమైపోవడమే కాదు ఆమెకు బాగా దగ్గరయ్యారు కూడా. అప్పట్నుంచి పాఠాన్ని కథల్లాగే చెప్పడం మొదలు పెట్టింది దీప.


స్టోరీ టెల్లర్ వరకు..

కథలు అందరూ చెబుతారు. కానీ ఎదుటివారిని కథలతో తమవైపు మళ్లించుకోవడమనేది అందరికీ సాధ్యం కాదు. అది కేవలం దీపా కిరణ్‌కే సాధ్యమైంది. తన గాత్రానికి సంగీతాన్ని జోడించింది. ఆమె కథలు వింటుంటే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అలా 2008లో మొదటిసారిగా మహారాష్ట్రలో స్టోరీ టెల్లింగ్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. 25 మంది పిల్లలు వచ్చారు. ఆ తర్వాత చాలా స్కూళ్లలో స్టోరీ టెల్లింగ్ క్యాంప్స్ నిర్వహించింది. టీవీ చూస్తే కేవలం సీన్ మాత్రమే గుర్తుంటుంది. అదే కథల వింటుంటే ఆయా పాత్రలను వాళ్లే ఊహించుకుంటారు. దాంతో ఊహాశక్తి పెరుగుతుంది. పిల్లలకు ఊహాశక్తి పెరుగాలంటే కథను మించిన కళ లేదంటున్నది దీపా. ఏదో కథ చెప్పాలి అన్నట్టు కాకుండా వారికి కోసమే కొంత సమయం కేటాయించాలి. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అప్పుడే వాళ్లతో ఇంటరాక్షన్ పెరుగుతుంది. పిల్లలకు నచ్చింది చేయనివ్వాలి. పెద్దల అభిప్రాయం పిల్లలపై రుద్దకూడదు. దీపా మాతృభాష అయిన తమిళంతో పాటు తెలుగు, కన్నడ, ఇంగ్లిష్ మాట్లాడుతుంది. నాలుగు భాషల్లోనూ కథలు చెబుతుంది.


పిల్లలకు మాత్రమే కాదు..

జానపదాల నుంచి ఇతిహాసాల వరకు అన్నీ విభాగాల్లో దీప కథలు చెప్పగలదు. పిల్లల వయసు బట్టి కథా తీరును ఎంచుకుంటుంది. పర్యావరణంపై అవగాహన పెంచుతున్నది. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకూ కథలు చెప్తున్నది. వాళ్లకు చెప్పేటప్పుడు పురాణాలు, జానపద గేయాలు ఎంచుకుంటుంది. దీప కథల్ని నాటకరూపంలో చెబుతుంటే పెద్దవాళ్లు కూడా పిల్లల్లా మారి ఆసక్తిగా వింటారు. అదే ఆమె చెప్పే కథల్లోని ప్రత్యేకత. టీచింగ్, వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్, సాఫ్ట్‌వేర్ కోడింగ్ వర్క్ పనిచేసిన దీప.. కథలు చెప్పడం మాత్రం ఆపలేదు.


టీచర్లకు ట్రైనింగ్ ఇస్తుంది..

పిల్లలకు పాఠాలను కథల రూపంలో చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ, ఇలా ఎంతమంది పిల్లలకని దీపా ఒక్కతే చెప్పగలదు. ఆమె ఒక్కదాని వల్ల ఇది సాధ్యం కాదు కదా. అందుకే 2011 నుంచి నేరుగా టీచర్లకే స్టోరీ టెల్లింగ్ ట్రైనింగ్ ఇస్తుంది దీప. కథలు ఎలా చెప్పాలో కూడా చెబుతుంది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వర్క్‌షాప్ ట్రైనింగ్‌లు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, డాక్టర్స్, కార్పొరేట్ ఫ్రొఫెషనల్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు దాదాపు 20,000 మంది టీచర్లకు స్టోరీ టెల్లింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు కొలంబియా, సింగపూర్, థాయ్‌లాండ్ ఇలా చాలా దేశాల నుంచి టీచర్లు ఈ ట్రైనింగ్‌లో పాల్గొంటారు. విదేశాల్లోని ప్రముఖ నగరాల్లో కథల రూపంలో పాఠాలు ఎలా చెప్పాలి? స్టోరీ టెల్లింగ్ వంటి వర్క్‌షాప్‌లలో పాల్గొంటున్నది. ప్రస్తుతం దీప స్టోరీ టెల్లింగ్ ఆధారిత బోధనా పద్ధతులను రూపొందించడం కోసం కృషి చేస్తున్నది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విదేశీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. పిల్లల కోసం ది రాయల్ మిస్టేక్ అనే పుస్తకాన్ని రాసి, ప్రచురించింది.

deepakiran21

యూట్యూబ్‌లో కథలు..

నాకు ఇద్దరు అబ్బాయిలు. కేంద్రీయ విద్యాలయంలో ఒకరు తొమ్మిది, ఇంకొకరు ఏడో తరగతి చదువుతున్నారు. వారే నా ప్రపంచం. 1989లో హైదరాబాద్‌లో స్థిరపడ్డాము. 2010లో హైదరాబాద్‌లోని చైతన్య స్కూల్‌లో ఫోక్‌టైల్ మీద మొదటి పబ్లిక్ పర్ఫామెన్స్ ఇచ్చాను. కొన్ని స్టోరీలు చదివితే బాగుంటుంది. మరికొన్ని చూస్తే బాగుంటుంది. కొన్ని స్టోరీలు వింటేనే అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరు వింటారు దానికి కొంచెం మసాలా యాడ్ చేయాలి. రామాయణం, మహాభారతం, దశావతారం, భక్త రామదాసు, మీరాభాయ్, కభీర్, తుకారాం, తెనాలి రామకృష్ణుడు, పెదరాశి పెద్దమ్మ కథల్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు వారి భాషల్లో కథ చెబుతాను. తబల, డోలక్ వాయిద్యాలతో నాట్యం చేస్తూ కథ చెబుతుంటే జనాలు వస్తూనే ఉంటారు. ప్రదర్శన తర్వాత చాలామంది బాగా చేశారని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒకరోజు ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు. మేడమ్ మా మమ్మీ చాలా రోజులు నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. నవ్వడం లేదు. ఈ రోజు మీరు చెప్పిన కథని మా మమ్మీకి చెప్పాను. చాలాసేపు నవ్వింది. చాలా థ్యాంక్స్ మేడమ్ అన్నాడు. అంతకన్నా అదృష్టం దొరుకుతుందా అనిపించింది. ఇలా అందరి దగ్గరికి వెళ్లి కథ చెప్పలేను. నా కథలే వేరే వ్యక్తుల ద్వారా అందరిలోకి వెళ్తాయి. యూట్యూబ్‌లో కొన్ని స్టోరీలను అప్‌లోడ్ చేశాను. రెగ్యులర్‌గా కొన్ని స్టోరీలను క్లౌడ్ సౌండ్‌లో పోస్ట్ చేస్తూ ఎక్కువ మందికి చేరేలా ప్రయత్నిస్తున్నా.


ఫాలో అవండి..

ఇన్‌స్టాగ్రామ్ : over2storyteller
ఫేస్‌బుక్: Deepa kiran
యూట్యూబ్: Deepa kiran story teller
సౌండ్‌క్లౌడ్: over2deepakiran
వెబ్‌సైట్ : WWW.deepakiran.in


- వనజ వనిపెంట కోనేటి వెంకట్

1288
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles