సాబుదానా.. చలువ ఖజానా!


Thu,March 14, 2019 12:32 AM

sabudhana
సాబుదానా.. సగ్గుబియ్యం.. సాగో.. రకరకాల పేర్లే కాదు.. రకరకాల సైజుల్లో కూడా.. ఈ సాబుదానాలు మనల్ని పలుకరిస్తుంటాయి.. ఈ ఎర్రటి ఎండల్లో.. చలువనిచ్చేవే ఈ సాబుదానాలు.. వీటితో కమ్మటి పాయసాలు.. కారపు ఉప్మాలు చేయడం చూశాం.. వాటితో పాటు.. తీరొక్క డిష్‌లతో.. మీ జిహ్వా చాపాల్యాన్ని మరింత పెంచేలా..రకరకాల వంటకాలను సిద్ధం చేశాం.. ఆ రుచుల ఖజానాను మీరూ ఒకసారి టేస్ట్ చేయండి..

సాబుదానా బొండా

SAGO-BONDA

కావాల్సినవి :

సాబుదానా : ఒక కప్పు, ఉల్లిగడ్డ : 1, పచ్చిమిర్చి : 3, ఆలుగడ్డలు : 2, ధనియాల పొడి : అర టీస్పూన్, జీలకర్ర పొడి : అర టీస్పూన్, ఆమ్‌చూర్ : అర టీస్పూన్, కారం : అర టీస్పూన్, శనగపిండి : 2 టేబుల్‌స్పూన్స్, పసుపు : పావు టీస్పూన్, ఓమా : అర టీస్పూన్, బేకింగ్ పౌడర్ : చిటికెడు, కొత్తిమీర : చిన్న కట్ట, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 :నాలుగు గంటల పాటు సాబుదానాని నానబెట్టాలి. మిగిలిన నీళ్లు వంపేసి వాటిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా చేయాలి.
స్టెప్ 2 :సాబుదానాలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఆలుగడ్డల పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఉంచాలి.
స్టెప్ 3 :మరో గిన్నెలో శనగపిండి, పసుపు, ఓమా, బేకింగ్ పౌడర్, ఉప్పు, నీళ్లు పోసి చిక్కటి పిండిలా కలపాలి.
స్టెప్ 4 :ముందు సాబుదానా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. దాన్ని శనిగ పిండి మిశ్రమంలో ముంచి పక్కన పెట్టాలి.
స్టెప్ 5 : కడాయిలో నూనె పోసి ఈ బొండాలను ఒక్కొక్కదాన్ని వేసి వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

సాబుదానా పుడ్డింగ్

SAGO-PUDDING

కావాల్సినవి :

సాబుదానా : ఒక కప్పు
తాటి బెల్లం : 2 టేబుల్‌స్పూన్స్
కొబ్బరి పాలు : పావు కప్పు
కోడిగుడ్డు : 1
నీళ్లు : 2 కప్పులు

తయారీ :

స్టెప్ 1 :ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో సాబుదానా వేసి ఉడికించాలి. అవి బాగా ఉడికే వరకు ఉంచి నీళ్లు తీసేసి అందులో చల్లని నీళ్లు పోయాలి.
స్టెప్ 2 : కాసేపు అలాగే ఉంచి ఆ నీళ్లనూ వంపేసి అలాగే ఉంచాలి. మరో గిన్నెలో తాటి బెల్లం వేసి నీళ్లు పోసి చిక్కటి పాకం చేయాలి.
స్టెప్ 3 : చిన్న గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా గిలక్కొట్టాలి. దీంట్లో సాబుదానా వేసి కలిపి సిలికాన్ మౌల్డ్‌ల్లో వేయాలి.
స్టెప్ 4 : వీటిని గంటపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి సిలికాన్ మౌల్డ్‌ల్లో నుంచి వేరు చేయాలి. పై నుంచి కొబ్బరి పాలు, పాకం పోసి చల్లగా సర్వ్ చేసి తింటుంటే ఆ టేస్టే వేరు.

సాబుదానా డిలైట్

SAGO-DELIGHT

కావాల్సినవి :

సాబుదానా : ఒక కప్పు
కొబ్బరి పాలు : ఒక కప్పు
చక్కెర : ఒక కప్పు
దానిమ్మ గింజలు : ఒక కప్పు
కోడిగుడ్డు : 1
వెనీలా ఎసెన్స్ : పావు టీస్పూన్
చాకోస్ : ఒక టేబుల్‌స్పూన్

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో నీళ్లు పోసి సాబుదానా వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు, సగం కప్పు చక్కెర వేసి మరి కాసేపు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి.
స్టెప్ 2 : ఈలోపు దానిమ్మ గింజలను మిక్సీ పట్టీ పేస్ట్‌లా చేయాలి. చిన్న గిన్నె పెట్టి ఈ పేస్ట్, కోడిగుడ్డు తెల్లసొన, చక్కెర, వెనీలా ఎసెన్స్ వేసి చిక్కటి మిశ్రమం అయ్యేవరకు కలుపుతుండాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఒక గ్లాసులో సాబుదానా మిశ్రమం వేయాలి. దానిపై దానిమ్మ గింజల మిశ్రమం, ఆ తర్వాత మళ్లీ సాబుదానా మిశ్రమం, ఆ పై చాకోస్ వేసి సర్వ్ చేయాలి.
స్టెప్ 4 : దీన్ని కావాలనుకుంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా కూడా ఆరగించొచ్చు. కావాలనుకున్న వాళ్లు అలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.


సాబుదానా మురుకుల్లు

SAGO-MURUKKU

కావాల్సినవి :

సాబుదానా పొడి : అర కప్పు, బియ్యం పిండి : ఒక కప్పు, కారం : ఒక టీస్పూన్, ఓమా : అర టీస్పూన్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 :ఒక గిన్నెలో సాబుదానా పొడి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ఓమా వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : ఇందులోనే రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి, కొన్ని నీళ్లు పోసి పిండిని మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి.
స్టెప్ 3 : కడాయి పెట్టి నూనె పోసి బాగా వేడి చేయాలి. మడుగుల పావు తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి.
స్టెప్ 4 : దీన్ని కడాయిలోనే ప్రెస్ చేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించాలి. కరకరలాడే మురుకులు రెడీ!

సాబుదానా ఇడ్లీ

Sago-Idli

కావాల్సినవి :

సాబుదానా : అర కప్పు, ఇడ్లీ రవ్వ : ఒక కప్పు, బటర్ మిల్క్ : ఒక కప్పు, నెయ్యి : 2 టీస్పూన్స్, ఆవాలు : పావు టీస్పూన్, జీలకర్ర : పావు టీస్పూన్, శనగపప్పు : అర టీస్పూన్, మినపపప్పు : అర టీస్పూన్, జీడిపప్పు : ఒక కప్పు, అల్లం : చిన్న ముక్క, పచ్చిమిర్చి : 2, కరివేపాకు : ఒక రెమ్మ, కొబ్బరి తురుము : ఒక టీస్పూన్, కుకింగ్ సోడా : పావు టీస్పూన్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో సాబుదానా, ఇడ్లీ రవ్వ, బటర్ మిల్క్, ఉప్పు రెండు గంటల పాటు నానబెట్టాలి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, శనగపపప్పు, మినపపప్పు, జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
స్టెప్ 3 : దీంట్లోనే కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టాలి.
స్టెప్ 4 : ఈ మిశ్రమాన్ని ఇడ్లీ రవ్వ మిశ్రమంలో వేసి, కుకింగ్ సోడా, కొన్ని నీళ్లు పోసి కలిపి మరో గంట పాటు నానబెట్టాలి.
స్టెప్ 5 : ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ ప్లేట్ తీసి నెయ్యి రాయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి ఆవిరి మీద మూడు నిమిషాలు పెద్ద మంట మీద, 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించాలి. ఏ చట్నీ లేకున్నా ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి.

1293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles