ఉద్యోగాన్ని వద్దనుకొని.. రికార్డులు మూటగట్టుకొని..


Wed,February 20, 2019 03:22 AM

ఏదీ పుట్టుకతో రాదు.. రావాలంటే నేర్చుకోవాలి.. కఠోరంగా కష్టపడాలి సాధించాలంటే తపించాలి.. పరితపించాలి దీపక్ ఈ విషయంలో విజయవంతమయ్యాడు ఉద్యోగాన్ని వదులుకొని.. ఉన్నతమైన ఆశయం కోసం పోరాడుతున్నాడు. రికార్డులు నెలకొల్పుతూ తెలంగాణ తేజంగా నిలుస్తున్నాడు.
karate
ఆరేండ్లప్పుడే కరాటేలో ఓనమాలు దిద్దాడు. పన్నెండేండ్ల ప్రాయంలో కుంగ్‌ఫూలో పట్టు సాధించాడు. పేదరికం అడ్డొచ్చింది. లెక్కచేయలేదు. కష్టాలపై గట్టి కిక్కులు ఇచ్చాడు. వెతలకు ఓర్చుకుని పంచ్‌లు విసిరి సాధన చేశాడు. కరాటే కిడ్ నుంచి తైక్వాండో ఇంటర్‌నేషనల్ చాంపియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడ పోటీ ఉంటే అక్కడకు వెళ్లి ప్రత్యర్ధులకు చుక్కలు చూపించి మెడల్స్ సాధిస్తున్నాడు. ఇప్పుడతనికి 23 ఏండ్లు. మరోవైపు గిన్నిస్ రికార్డుల కోసం వేటాడుతున్నాడు. తైక్వాండో పుట్టినిల్లు ఉత్తరకొరియాలో ఇటీవల జరిగిన చాంపియన్ షిప్‌లో సత్తాచాటాడు. ఉత్తర కొరియాకు వెళ్లిన యంగెస్ట్ ఇండియన్‌గా, మొదటి హైదరాబాదీ తైక్వాండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.


భారతదేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదువలేదు. మారుమూల గ్రామాల నుంచి పేదరికాన్ని ఎదుర్కొని క్రీడల్లో తమ అనూహ్య ప్రతిభ కనబరుస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తారు. సరైన గుర్తింపు లేక కష్టాలు పడుతుంటారు. కనీస వసతులు లేక సొంతంగా సాధన చేసి విజయాల బాట పడుతుంటారు. అలాంటి వారిలో సాయి దీపక్ కూడా ఉన్నాడు. మూడు గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టి మరో గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్నాడు.


karate2

గూగుల్‌లో ఉద్యోగం వద్దని..

స్పోర్ట్స్ కేటగిరీలో హైదరాబాద్‌లోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ఎంబీఏలో చేరాడు దీపక్. చైర్మన్ గోపాల్ రెడ్డి దీపక్‌ను ప్రోత్సహించాడు. తైక్వాండో శిక్షణకు, చదువుకు అతను ప్రోత్సహించారు. ఎంబీఏ పూర్తయిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా గూగుల్ కంపెనీలో జాబ్‌కి ఎంపికయ్యాడు. వచ్చిన ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు. ఎందుకంటే దీపక్ లక్ష్యం వేరు. రానున్న ఒలింపిక్స్‌లో తైక్వాండోలో గోల్డ్ మెడల్ కన్నా గూగుల్ ఉద్యోగం పెద్దదేం కాదనుకున్నాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన దీపక్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, టీచర్స్, కోచ్‌ల సహకారంతో శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వం సాయమందిస్తే మరిన్ని విజయాలు తన ఖాతాలోకి వస్తాయని అంటున్నాడు.


రెండో తరగతిలోనే మొదలు..

రెండో తరగతి చదువుతున్నప్పుడు కరాటే పాఠాలు నేర్చుకున్నాడు దీపక్. వయసు పెరుగుతున్న కొద్దీ సాహస కళలపై మరింత ఆసక్తిని పెంచుకున్నాడు. 2012లో మొదటిసారి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. అక్కడ ప్రారంభమైన పతకాల వేట నేటికి సాగుతూనే ఉన్నది. పాఠశాల విద్య అనంతరం కొన్ని రోజులు విరామం తీసుకున్నాడు. సరైన శిక్షణనిచ్చే గురువు లేకపోవడంతో కొంత ఇబ్బందిపడ్డాడు. అర్ధంకాని పరిస్థితుల్లో ఖాళీగా ఉండలేక కుంగ్‌ఫూను అభ్యసించాడు. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ గురించి దీపక్ ఓ వార్త చూసి, తను కూడా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తను నేర్చుకున్న కరాటే, కుంగ్‌ఫూలకు ఒలింపిక్స్‌లో గుర్తింపు లేదని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అయినా వెనుకడుగు వేయలేదు. ఒలింపిక్స్‌లో తైక్వాండోకు గుర్తింపు ఉందని ఆలస్యంగా తెలుసుకొని సమయం వృథా చేయకుండా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్రముఖ కోచ్ మొయినొద్దీన్ వద్ద తైక్వాండో నేర్చుకున్నాడు. ప్రస్తుతం మొయినొద్దీన్, తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డిల దగ్గర దీపక్ తైక్వాండో శిక్షణ కొనసాగుతున్నది.

1007
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles