పరీక్షలు మనకా మనసుకా


Tue,February 19, 2019 01:41 AM

Psychio-Exams
పరీక్షలు వస్తున్నాయి అనగానే ఇటు పిల్లల్లో.. అటు పేరెంట్స్‌లో టెన్షన్ మొదలువుతుంది. కానీ ఎందుకు ఈ టెన్షన్? కారణం ఏంటి? టెన్షన్‌కు గురి కాకుండా పరీక్షలు రాయలేమా? మంచి ఫలితాలు సాధించలేమా? వంటి విషయాల్లో పిల్లలకన్నా పేరెంట్స్ అవగాహన కలిగి ఉండాలి.


పిల్లలు రాసే పరీక్షల గురించి ఫ్యామిలీ అంతా ఒత్తిడికి గురికావడం ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఇది పూర్తిగా భావోద్వేగాల సమతుల్యత లోపం వల్ల కలుగుతుంది. ఫలితాల విషయంలో వెనకబడతారా? అనే ఆందోళనతో పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇది పిల్లలపై మరింత ఒత్తిడి పెంచుతుంది. ఈ ఒత్తిడిని అధిగమిస్తేనే మంచి ఫలితాలు సాధించవచ్చు అనేది పిల్లలు.. పెద్దలు ఇద్దరు తెలుసుకోవాలి.


భయం వీడాలి: పరీక్ష అనగానే విద్యార్థుల ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తుంటాయి. మంచి మార్కులు సాధించగలనా? తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చగలుగుతానా? సరైనా సమాధానాలు రాయగలుగుతానా? ఆశించిన మార్కులు రాకపోతే పరిస్తితి ఏంటి? బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయుల వద్ద అప్పుడు తన పరిస్థితి ఏంటి? వంటి ఆందోళనలు వారి మెదళ్లలో మెదులుతుంటాయి. ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలను పక్కన పెట్టి పరీక్షలు రాయాలి. పరీక్షల భయం తగ్గించుకోవడం విద్యార్థుల చేతిలోనే ఉంది.


ప్రణాళిక: ఏ రోజు ఏం చదవాలి? ఎంతమేరకు చదవాలి? అని నిర్దేశించుకోవాలి. విద్యా సంవత్సరం మొదటినుంచి బాగా చదివేవాళ్లు కొందరుంటారు. పరీక్షలు మొదలయ్యే సమయానికి చదవడం ప్రారంభించేవాళ్లు ఇంకొందరుంటారు. దీనితోనే టెన్షన్ అంతా. ఇదే మెదడు పనితీరును డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ముందుగానే ప్రణాళిక ఉంటే పరీక్ష సమయానికి నిశ్చిం తగా ఉండవచ్చు.


సమయపాలన: దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ సమయానికి చేయాల్సింది ఆ సమయానికే చేయాలి. రాత్రంతా మేలుకొని చదివితే ప్రయోజనం ఉం డదు. ఉదయం 4.30 నుంచి 6 గంటల సమయం లో మెదడు చురుకుగా పనిచేసే అవకాశం ఎక్కువ.


ఆత్మ విశ్వాసం: పరీక్షల్లో సిలబస్ అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఏ ప్రశ్నలు వస్తాయో అని భయపడుతూ వెళితే చదివింది గుర్తుకు రాదు. పరీక్షకు వెళ్లేటప్పుడు ఆత్మ విశ్వాసంతో వెళ్లాలి. మనలో ఉన్న సామార్ధ్యాలను.. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా మనసును దృఢపరచుకోవాలి.


భయం వద్దు: పరిస్థితులను మనకు మనంగా సృష్టించుకొని ఎలా భయపడతామో దానికి ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫియర్. కాబట్టి మానసికంగా దృడంగా ఉండాలి. కొంతమంది విద్యార్థలు తోటివారితో పోల్చుకుని కృంగిపోతారు. అలా చేయవద్దు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి.


ఆరోగ్యకరంగా నిద్ర: విద్యార్థులు పరీక్ష రేపు ఉందనగా రాత్రంతా మెలకువతో ఉండి మరీ చదవడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఒత్తిడికి గురవుతారు. నిద్రకు కచ్చితంగా 6 గంటల సమయాన్ని కేటాయించాలి.


ఒత్తిడి ఎందుకు?: విద్యార్థులు పరీక్ష మొదలయ్యే సమయానికి కూడా పరీక్షా కేంద్రానికి చేరలేక ఒత్తిడికి లోనవుతారు. పరీక్షా సమయానికంటే 45 నిమిషాలు ముందుగానే చేరుకోవడం వల్ల రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. పరీక్షా హాలులో అడుగు పెట్టగానేఏ ప్రశ్నలు వస్తాయో, నేను చదివినవి వస్తాయో లేదో అనే అనవసరమైన ఆందోళన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కష్టపడి చదివినదంతా మరిచిపోయే ప్రమాదం ఉంది.


లక్ష్యం

ప్రిపరేషన్ కంటే ముందే ఓ లక్ష్యం ఏర్పాటుచేసుకోవాలి. దీనివల్ల చదవాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది. ఫలానా సబ్జెక్ట్‌లో ఎన్ని చాప్టర్‌లు పూర్తి చేస్తాను అని ముందుగానే అనుకోవడం వల్ల ఆసక్తి అంతకంతకూ పెరుగుతుంది. ఒక్కొక్కటి పూర్తిచేసుకుంటూ త్వరగా కంప్లీట్ చేయాలనే పట్టుదల పెరుగుతుంది. చదువుతూ ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.

Dr.-Srinivas-Reddy
డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి
సైకాలజిస్ట్

250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles