అంధులు చిత్రాలను గుర్తించేలా..


Tue,February 19, 2019 12:30 AM

అంధులు చదువు కోవడానికి బ్రెయిలీ లిపి ఉంది. కానీ ఆ లిపి కొన్ని సబ్జెక్టులను నేర్చుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నది. పాఠ్యాంశాల్లోని బొమ్మలను గుర్తించే వీలు లేదు. దీనికి పరిష్కార మార్గం చూపాలని, బ్రెయిలీలో మరింత టెక్నాలజీని వాడి విద్యార్థుల కష్టాలను పరిష్కరించేందుకు ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తున్నది.
iit-delhi-tactile-diagrams
చదువుకునే అంధ విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెయిజ్డ్ లైన్స్ అనే స్వచ్ఛంద సంస్థ, ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థులు కలిసి అంధ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నాలుగేండ్ల పాటు పరిశోధన చేసి, నూతన విధానాన్ని ఆవిష్కరించారు. మరింత సులువుగా అంధులకు పాఠాలు చెప్పే విధానాన్ని కనుగొన్నారు. స్పర్శ ద్వారా త్రీడీ ప్రింటింగ్‌తో గణిత శాస్త్రం, రేఖా చిత్రాలు, భూగోళ శాస్ర్తాలు చదువుకునేందుకు వీలుగా వినూత్న పద్ధతిని ప్రవేశ పెట్టారు. క్లిష్టమైన రేఖాగణితం, సైన్సు వంటి సబ్జెక్టులను బొమ్మల స్పర్శ ద్వారా కొత్తగా పాఠాలు నేర్పుతున్నారు. విజ్ఞాన శాస్త్ర సంబంధింత అంశాలను అర్థం చేసుకునేలా పొలి వినైల్ క్లోరైడ్(పివిసి) పేపర్ పై బొమ్మలను ముద్రిస్తారు. చేతులతో తడుముకుంటూ అంధ విద్యార్థులు వాటిని గుర్తిస్తారు. అంధులు బ్రెయిలీ లిపితో పుస్తకాల్లో ఉండే అక్షరాలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు.


బొమ్మలను గుర్తించే వీలు ఆ లిపిలో లేకపోవడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా మరొక పద్ధతిని ప్రవేశ పెట్టాల్సి వచ్చిందని పరిశోధకుల్లో ఒకరైన పుల్కిత్ సప్ర చెబుతున్నారు. దేశ చిత్ర పటాలు, సామాన్య శాస్త్రంలో ఉండే బొమ్మలు, గణితంలో ఉండే గ్రాఫ్స్ వంటి వాటిని సులువుగా అర్థం చేసుకునేందుకు ఈ నూతన విధానం ఎంతో ఉపయోగపడుతున్నది. భవిష్యత్‌లో మరింతగా అంధ విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు మరిన్ని పుస్తకాలను రూపొందించి వారిలో విజ్ఞానకాంతులు నింపే ప్రయత్నం చేస్తామని పరిశోధక బృందం అంటున్నది. ఈ త్రీడి ప్రింటింగ్‌తో 6 నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను రూపొందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంస్థ ముందుకు వచ్చింది.

296
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles