రియల్ ఎస్టేట్‌లో సంచలనం కృతిజైన్


Mon,February 18, 2019 01:38 AM

పూణెలో నిర్మాణరంగంలో ఎంతో పేరుగాంచిన కుమార్ బిల్డర్స్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇప్పుడు ఆమె వయసు కేవలం 32 ఏళ్లు. 17 ఏండ్ల వయసులోనే ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఎవరూ సాధించలేని విధంగా చిన్న వయసులోనే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నారు. పదిహేనేళ్లుగా కుమార్ బిల్డర్స్‌ను నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. చిన్న వయసులో అతి తక్కువ సమయంలోనే తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఆమెకు టాప్ మేనేజ్‌మెంట్ కన్సార్టియమ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. కుమార్ బిల్డర్స్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టి రియల్‌ఎస్టేట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న కృతిజైన్ సక్సెస్‌మంత్ర.
Kruti-Jain
కృతి తండ్రి లలిత్ కుమార్ జైన్ వ్యాపారవేత్త. ఎనిమిదేండ్ల వయసులోనే తండ్రితోపాటు మీటింగ్సుకు హాజరయ్యేదామె. తన పదమూడేళ్ల వయసులో వేసవి సెలవుల్లో తండ్రితో సమయం గడిపేందుకు ఆయన వెంట ఆఫీసుకు, కన్‌స్ట్రక్షన్ సైట్లకు వెళ్లేది. ఆ బిజీలైఫ్ నుంచి తండ్రిని కొంత బయటపడేసి బయట గడిపేలా చేద్దామనుకున్న కృతికి.. తన వెకేషన్ పక్కన పెట్టి వ్యాపార పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. పదోతరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే పదిహేనేళ్ల వయసులో కృతిజైన్ అధికారికంగా వ్యాపారంలో ప్రవేశించారు. కుటుంబ వ్యాపారమైనా వెంటనే బాధ్యతలివ్వలేదు తండ్రి. రెండేళ్ల పాటు 23 విభాగాల్లో ఆమె సాధారణ ఉద్యోగిగా పనిచేసింది. విధుల్లో భాగంగా ఎంతోమందికి జవాబుదారీగా వ్యవహరించారు. కంపెనీలో ప్రస్తుతం ఆమెకు రిపోర్టు చేస్తున్న వారందరికీ తొలినాళ్లలో కృతి జవాబుదారీగా ఉండేవారంటే ఆమె ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు తండ్రి అనేక లక్ష్యాలు నిర్దేశించారు. సంబంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యతను కట్టబెట్టారు.


17 ఏండ్లకే ప్రమోషన్

అలా 17 ఏండ్లున్నప్పుడే కుమార్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. నగరంలోని అతి చిన్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా ఆమె ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో కృతి బీబీఎ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలు కూడా పూర్తిచేసింది. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించిన కృతి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేది. వ్యాపారంపై ఎంతో శ్రద్ధ, ఆసక్తి కనబరిచేది. సకల సౌకర్యాలతో పుట్టినా తనకేదీ ఆయాచితంగా రాలేదంటారామె. ఈ ప్రయాణంలోని ప్రతీ అడుగు వెనకా ఎంతో శ్రమ దాగి ఉందని చెబుతుంది. బాస్ కూతురు అన్న హోదా నిజానికి తన మీద మరింత ఒత్తిడి పెంచిందని, తాను మరింతగా కష్టపడి పనిచేయాల్సి వచ్చిందని అంటారామె.


అయితే సిల్వర్‌స్పూన్‌తో పుట్టటమన్నది తనకు ఒక విషయంలో మాత్రం లాభించిందని అంగీకరిస్తారామె. నిర్మాణరంగంలో అత్యంత ప్రజ్ఞావంతులు, పేరుపొందిన వారితో తనకు చిన్నవయసులోనే పరిచయాలు ఏర్పడ్డాయని తెలిపారు. తండ్రి విస్తృత వ్యాపార పరిధి వల్ల నిర్మాణ రంగంలోని ఉత్తమమైన పద్ధతులు మొదలు.. వాస్తు, వెంటిలేషన్ వంటి అనేక సందేహాలకు చిన్న చిన్న ఫోన్ కాల్స్‌తో సమాధానాలు దొరికాయన్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఎంతో నేర్చుకోగలిగానన్నారు. పదిహేనేళ్లుగా కుమార్ బిల్డర్స్‌ను నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టింది కృతి.


Kruti-Jain3

చిన్నవయస్సులోనే

నిర్మాణ రంగానికి సంబంధించి లలిత్ కుమార్ జైన్ అనేక మీటింగుల్లో పాల్గొంటుండేవారు. ఆ మీటింగ్ నుంచి ఆయన్ను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో కృతిజైన్ తండ్రి కంప్యూటర్ సీటును ఆక్రమించుకుని పెయింటింగ్ వేస్తూ కూర్చునేవారు. అలా ఆమె మీటింగ్ విశేషాలు వింటుండేవారు. అంతేకాకుండా ఆ చర్చల్లో పాల్గొంటూ అవి అర్థం చేసుకోవటానికి నోట్స్ కూడా రాసుకునేవారు. అలా ఒకసారి కృతిజైన్ లీగల్ కౌన్సెలింగ్ మీటింగ్‌లో కూర్చున్నారు. సొలిసిటర్ న్యాయపరమైన విషయాలు వివరిస్తున్నారు. తర్వాత రోజు జరిగే మీటింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతలో హఠాత్తుగా కృతి వారంతా చర్చించకుండా మర్చిపోయిన ఓ అంశం గురించి ప్రస్తావించారు.


అంతే.. అక్కడ ఐదు సెకన్ల పాటు నిశ్శబ్ద వాతావరణం.. తర్వాత మీటింగ్‌లో ఉన్న వాళ్లందరూ ఆమెను చూస్తూ నవ్వారు. ఆమె దాని గురించి చాలాసేపు మాట్లాడారు. మీటింగ్‌లో చర్చిస్తున్న అన్ని అంశాలపైనా తనకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయని వారితో చెప్పారు. సొలిసిటర్ ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోలుతో తాను ఆర్కిటెక్చర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదిలిపెట్టి లాయర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆనాటి విషయాలను నవ్వుతూ చెబుతారు కృతి.


అన్నీ తండ్రే

నిర్మాణ రంగంలోని అనుభవాలనే కాదు.. తనకు స్ఫూర్తినిచ్చిన వారి గురించి, తన స్నేహితుల గురించీ ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనకు స్ఫూర్తి తన తండ్రేనని ఆమె ఎంతో ఉద్వేగంగా చెప్పారు. ఎన్నో తరాలుగా కృతి కుటుంబం వ్యాపార రంగంలోనే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే కృతి రక్తంలోనే వ్యాపారం ఉందన్నమాట. తన తండ్రి గురించి కృతి ఎంతో గర్వంగా చెప్తారు. ఆయన్ను తనకో మార్గదర్శకుడిగా, గురువుగా, ఎంతో అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తారు కృతి. పెద్ద కలలు కనేలా తండ్రి ఆమెను ప్రోత్సహిస్తారు. కాలత్రవ, జహా హదిద్ వంటి కట్టడాల నుంచి స్ఫూర్తి పొందాలని,లలిత్ జైన్ కుమార్తెకు సూచిస్తారు. భారత్‌లో అంత అనుకూలంగా లేని సమయంలో కూడా ఆయన పారామెట్రిక్ భవనాల గురించి ఆలోచించేవారని కృతి తెలిపారు. చాలా చిన్న వయసులోనే కృతి జైన్‌కు వ్యాపార రంగంలో ఆసక్తి కలిగేలా.. ఓ లక్ష్యం రూపొందించుకునేలా ఆయన కృషిచేశారు. డిన్నర్ సమయంలో ఆయన కొత్త వ్యాపార భాగస్వామ్యాల గురించి, భూ ఒప్పందాల గురించి చర్చించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.


Kruti-Jain2

క్రమశిక్షణ తప్పలేదు

వ్యాపారంలో శిక్షణ పొందుతూనే బిబిఎ ఎల్‌ఎల్బీ డిగ్రీ పూర్తిచేసిన కృతికి ఆటల్లోనూ ప్రావీణ్య ముంది. 11 యేండ్ల వయసులో ఆమె జాతీయస్థాయిలో హాకీ ఆడారు. 13 యేండ్ల వయసులో తండ్రితో కలిసి వెకేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న కృతి ఎప్పుడూ బిజీగా ఉండే తండ్రిని దొరక బుచ్చుకునేందుకు, ఆయన వెంట ఆఫీసుకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఉదయం 7.30 సమయానికే బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర రెడీగా కూర్చునేవారు. 15 ఏళ్ల టీనేజీ వయసులో స్నేహితులు సాధారణ కార్యక్రమాల్లో మునిగి ఉన్న సమయంలో కృతి మాత్రం కష్టమైన వర్క్ ట్రైనింగ్ షెడ్యూల్‌లో మునిగి తేలారు. 17 యేండ్ల వయసుకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా కృతి ఎన్నడూ క్రమశిక్షణ తప్పలేదు. ముందురోజు రాత్రి ఎన్ని పనులతో ఎంత ఆలస్యంగా నిద్రపోయామన్నదానితో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకే ఆమె తన పని ప్రారంభిస్తారు.


ఫ్రెండ్స్ సహకరించారు

చిన్నవయసులోనే వ్యాపారరంగంలోకి వచ్చిన కృతికి క్రమశిక్షణ ఎక్కువ. దీనివల్ల మీరు కాలేజ్ డేస్‌ను కోల్పోయాననిపించలేదా అంటే... నేనెప్పుడూ అలా భావించలేదు. నా ఫ్రెండ్స్ నాకెంతో సహకరించారు. అంతేకాదు నావల్ల మా ఫ్రెండ్స్ ఇంకొందరు వ్యాపారంవైపు వచ్చారు అని ఆమె చెప్పింది. చిన్న వయసులోనే వ్యాపారంలోకి ప్రవేశించటం వల్ల గానీ.. కష్టపడి పనిచేయటం వల్ల కానీ.. ఏదో కోల్పోయినట్టుగా స్నేహితులను చూసి నిజంగా తానెప్పుడూ భావించలేదంటారు కృతి. తన స్నేహితుల్లో కొందరు వ్యాపారం గురించి ఆలోచించేలా చేయగలగటంపై సంతోషంగా ఉందంటారు ఆమె. తన స్నేహితుల్లో అన్ని వయసుల వారూ ఉన్నారంటారు కృతి. 13 యేండ్ల వయసువారూ, 70 యేండ్ల వయసు వారూ తనకు స్నేహితులే అని తెలిపారు. తన స్నేహితుల జాబితాలో తల్లిదండ్రులు కూడా చేరిపోయారని ఆమె చెబుతారు.

1271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles