మోడీ మాట వింటే మహర్దశ!


Sat,February 16, 2019 01:37 AM

అందుబాటు గృహాలకు ఎక్కడ్లేని గిరాకీ
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
డెవలపర్లు ఇండ్ల ధరల్ని తగ్గించాలి
- ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్
అనుమతుల ఆలస్యం రాష్ట్రాలదే బాధ్యత
- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
modi
న్యూఢిల్లీలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన క్రెడాయ్ యూత్‌కాన్ 2019 సదస్సు విజయవంతమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తున్న తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు సూచనల్ని చేశారు. దేశీయ నిర్మాణ సంస్థలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల్ని చేపట్టాలని, వాటికే పెద్దపీట వేయాలని కోరారు. ఈ కట్టడాల్ని నిర్మించేవారికి అద్భుతమైన మార్కెట్ ఎదురు చూస్తోందని తెలిపారు. పైగా, వీటిని నిర్మించేవారికి జీఎస్టీలోనూ ప్రోత్సాహం ఉందని, పన్ను రాయితీల్ని కల్పిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము కింద ఇల్లు తీసుకుంటే, ఏడాదికి రెండున్నర లక్షలకు పైగా సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. అయినప్పటికీ, మన దేశంలో అధిక శాతం మంది కేవలం లగ్జరీ గృహాల మీదే దృష్టి సారిస్తుండటం విచారించదగ్గ విషయమన్నారు. అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించే నిర్మాణ రంగంలో జవాబుదారీతనం కొరవడిందని అభిప్రాయపడ్డారు. కేవలం కొందరు చేసే తప్పుడు పనుల వల్ల నిర్మాణ రంగమంతా దారుణంగా దెబ్బతింటుందన్నారు.

భారతదేశంలో ఎనభై శాతానికిపైగా మధ్యతరగతి ప్రజానీకం అందుబాటు గృహాల్ని కావాలని కోరుకుంటున్నది. అయినప్పటికీ, అధిక శాతం మంది డెవలపర్లు లగ్జరీ గృహాల్ని నిర్మించడం మీదే దృష్టి సారిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సేషాను అడిగితే, ఆయన ఇలా సమాధానమిచ్చారు. మార్కెట్‌లో గిరాకీని బట్టి డెవలపర్లు ఇండ్లను కడతారే తప్ప కావాలని ఎవరూ లగ్జరీ గృహాలనే నిర్మించరని వివరించారు. అందుబాటు గృహాల్ని ఒకవేళ నిర్మించినా.. వాటిని కొనేవారెవరూ అని ప్రశ్నించారు.

బ్యాంకులు బిల్డర్లతో చర్చించాలి..

కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. బిల్డర్లందరూ తమ ఇండ్ల ధరల్ని తగ్గించాలని సూచించారు. అప్పుడే, నిధుల లభ్యత పెరుగుతుందని వివరించారు. దీంతో ప్రాజెక్టుల్లో కదలికలు ఏర్పడతాయన్నారు. మరో రెండు వారాల్లోపు బ్యాంకులు బిల్డర్లను సంప్రదిస్తే.. రియల్ ఎస్టేట్ రంగం సమస్యలు అర్థమవుతాయని తెలిపారు. జీఎస్టీని వీలైనంత మేరకు తగ్గించడానికి కృషి చేస్తున్నామని.. నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటామని వివరించారు. దీంతో, డెవలపర్లంతా హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీని తగ్గిస్తే.. మార్కెట్‌కు పూర్వవైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
modi-Team

రాష్ట్రాలదే ఆ బాధ్యత..

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యమైతే.. ఆ బాధ్యత స్థానిక ప్రభుత్వానిదేనని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఇందుకు ఆయా స్థానిక సంస్థలే బాధ్యత వహించాలని సూచించారు. రెరాలో సకాలంలో ఇండ్లను కొనుగోలుదారులకు అందించకపోతే, బిల్డర్లదే బాధ్యత అనే విషయం తెలిసిందే. ఇదే రీతిలో స్థానిక సంస్థలు వ్యవహరించాలన్నారు. డెవలపర్లు స్వీయనియంత్రణను పాటించాలని కోరారు. సకాలంలో ఇండ్లను కొనుగోలుదారులకు అందించడం చాలా కీలకమైన వ్యవహారమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు అనుమతిని సకాలంలో అందించడం అతిముఖ్యమైన విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేసే రియల్ రంగం అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు. పెరుగుతున్న భూముల ధరల వల్ల రియల్ ప్రాజెక్టుల్ని నిర్మించడం అసాధ్యంగా మారుతుందన్నారు.

జాతీయ స్థాయిలో జరిగిన క్రెడాయ్ యూత్‌కాన్ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో డెవలపర్లు పాల్గొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, నిజామాబాద్ వంటి నగరాలకు చెందిన బిల్డర్లు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈసారి క్రెడాయ్ యూత్‌కాన్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి నిలిచారు. క్రెడాయ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చెరుకు రామచంద్రారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ కోశాధికారి ఇంధ్రసేనారెడ్డి, మారం సతీష్, పాండురంగారెడ్డి, ఎం. శ్రీకాంత్, అజయ్ కుమార్ తదతరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

యువ డెవలపర్లకు దిక్సూచీ
క్రెడాయ్ యూత్‌కాన్ - 19 సదస్సు భారత యువ డెవలపర్లకు దిక్సూచీగా పని చేస్తుంది. నిర్మాణ రంగం ప్రతిష్ఠను పెంచేందుకు ఇలాంటి సదస్సులు చక్కగా పనికొస్తాయి. అందుకే, మేం జాతీయ స్థాయిలో ఏటా సదస్సుల్ని నిర్వహిస్తున్నాం. వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు అవసరమయ్యే మెలకువలపై యువ డెవలపర్లు అవగాహన పెరుగుతుంది. నిర్మాణాల్లో వినియోగించే ఆధునిక పరిజ్ఞానాలు పరిచయం అవుతాయి.
- జక్సేషా, అధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles