టూత్ సెన్సర్


Mon,February 11, 2019 11:14 PM

Aadhunka-Pokada
ఆహారంలోని చక్కెర, ఉప్పు, మద్యం వంటి వాటిని గుర్తించే ఒక చిన్న టూత్ సెన్సర్ పరికరాన్ని పరిశోధకులు ఇటీవల అభివృద్ధి పరిచారు. క్రీడాకారులతోపాటు పేషెంట్లకు సైతం ఉపయోగపడేలా లాలాజలంలోని లాక్టేట్ లెవల్స్ గుర్తింపు వంటి సంక్లిష్టమైన పనులు కూడా మున్ముందు దీనితో సాధ్యం కావచ్చునని వారు అంటున్నారు.


చక్కెర, మద్యం (ఆల్కహాల్) వంటివి శ్రుతి మించకుండా ఎప్పటికప్పుడు మనల్ని జాగరూక పరిచేలా వాటి లెవల్స్‌ను తెలియజేసే ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని (టూత్ సెన్సర్) మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల రూపొందించారు. 2x2 మిల్లీమీటర్ల కొలతతో అత్యంత సరళతరమైన ఈ సెన్సర్‌ను మన నోటి ముందు పన్నుపై అమర్చుకుంటే సరి. దీనిలో మూడు పొరలుంటై. రెండు బాహ్యపొరలు స్వర్ణ వలయాలను కలిగి ఉండగా, మిగిలిన లోపలి పొర జీవ ప్రతిస్పందన గుణ పదార్థంతో తయారైంది. ప్రధానంగా ఇదే గ్లూకోజ్, లవణం, ఆల్కహాల్‌లను గుర్తిస్తుంది. ఈ పదార్థానికి చెందిన విద్యుత్ గుణాలను ఒక విభిన్న రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల రూపంలో మొబైల్, ట్యాబ్‌లెట్స్‌కు చేరవేస్తుంది. ఈ టూత్ సెన్సర్ ప్రస్తుత మూలనమూనా పైన పేర్కొన్న ఆహార పదార్థాలనే గుర్తిస్తుందని, రానున్న కాలంలో లాలాజలంలోని లాక్టేట్ (జీవ రసాయన పదార్థం) లెవెల్స్ వంటి మరిన్ని సంక్లిష్ట పనులనూ నిర్వర్తిస్తుందని పై విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటి సెన్సర్ల వినియోగం వల్ల చాలామంది అతితిండి బారిన పడకుండా వుండవచ్చునని వారన్నారు. దీనిని ముందు పన్నుకు వెనుకవైపు కూడా ధరించవచ్చునని వారు అంటున్నారు.

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles