ఇంటిలో మట్టి అందాలు


Sun,February 10, 2019 01:09 AM

మట్టి.. జీవకోటికి ప్రాణాధారం. ఆ మట్టినే నమ్ముకొని జీవకళకు ప్రాణం పోస్తుంది సంగీత. ఈ తరహా కొత్త కళతో ఇంటికి కొత్త అందాలను తీసుకొస్తున్నది. మట్టినే నమ్ముకొని తన జీవితాన్ని సింగిడి చేసుకుంది. మట్టిని బొమ్మలుగా మలిచి ప్రాణం పోస్తూ.. కొత్త లోకానికి తానే సృష్టికర్తగా మారింది. మనసుకు ప్రశాంతతను కలిగించే పెయింటింగ్స్, నిత్య నూతనంగా కనిపించే మట్టి బొమ్మలతో మీ ఇంటిని కూడా సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నది సంగీత. ఈ కొత్త ఆర్ట్ విశేషాలు మీకోసం..
Sangeetha
మీకు ఇంటి పరిసరాలపై అవగాహన ఉందా? ఇంట్లో ఎక్కడ ఎలాంటి వస్తువు ఉంటే బాగుంటుందో మీకు తెలుసా? అందమైన బొమ్మలతో.. మనసును హత్తుకొనే పెయింటింగ్స్‌తో మీ ఇంటిని సుందరంగా తీర్చుదిద్దుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఎప్పటికీ నిలిచిపోయే కొత్త అందాలను మీకు పరిచయం చేస్తున్నాం. అదే.. క్లే ఆర్ట్. ఇది పూర్తిగా పర్యావరణహితం. మట్టితో తయారు చేసిన అద్భుతాలతో మీ ఇంటిని కొత్తగా అలంకరించుకోవచ్చు. ఎందుకంటే ఈ బొమ్మలు ఎప్పటికీ పాడవ్వవు. మట్టితో తయారు చేసిన ఈ పువ్వులు ఎప్పటికీ వాడిపోవు. అదే ఈ కొత్త కళ ప్రత్యేకత.


Sangeetha5

క్లే ఆర్ట్ గొప్పతనం ఏమిటంటే..?

క్లే ఆర్ట్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో థాయ్, పోర్సలిన్, ఎకో, ఎయిర్‌డ్రై, ఎన్జీక్లే, సిరమిక్ క్లే, పేపర్ మిక్స్ క్లే వంటివి ప్రసిద్ధి చెందినవి. వీటితో అచ్చంగా పూలని పోలిన, క్యారికేచర్ తరహా బొమ్మలు, వస్తువులు, శిల్పాలు తయారు చెయ్యవచ్చు. మట్టితోనే ఎన్నో రకాల్లో విభిన్నంగా బొమ్మలు తయారు చేస్తుంటారు క్లే ఆర్టిస్టులు. ఈ తరహా మట్టితో చేసిన బొమ్మలు, వస్తువులు, పూలు ఎప్పటికీ పాడవవు. నిత్యం అందం, తాజాదనంతో ఉంటాయి. నీటిలో తడిసినా, ఎండకు ఎండినా, చేయిజారి పడిపోయినా పగిలిపోవు. అదే ఈ క్లే ఆర్ట్ ప్రత్యేకత. తక్కువ బరువు కలిగిన మట్టితో తయారు చేయడం వల్ల ఇవి ఎప్పటికీ చాలా సహజంగానే కనిపిస్తాయి. వాటిపై దుమ్ము, ధూళి పడినా శుభ్రంగా కడగొచ్చు, తుడుచుకోవచ్చు. పగిలిపోతుందనే భయం అక్కర్లేదు. అయితే వీటిని చేసేటప్పుడే నెర్రెలు రాకుండా చూసుకుంటే చాలు.


Sangeetha4

అందాన్నిచ్చే బొమ్మలు!

మట్టితో తయారు చేసిన బొమ్మలు, పువ్వులు, శిల్పాలకు మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఇంట్లో షో కేస్‌లల్లో, డైనింగ్ టేబుల్స్‌పై, ఆఫీసులు, హోటల్స్, ఐటీ కారిడార్స్ వంటి వాటిల్లో అందం కోసం వాడుతున్నారు. అంతేకాకుండా.. పెండ్ల్లిళ్లు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలకు బహుమతులుగా కూడా ఈ తరహా బొమ్మలు, మొక్కలను ఇస్తున్నారు. ఒక్కో ఆర్ట్, దాని సైజు బట్టి రూ.500 నుంచి రూ. 5 వేల వరకూ ఉంటుంది. ఒక్క క్లే ఆర్ట్‌లోనే కాకుండా ఆయిల్ పెయింటింగ్స్‌లో కూడా సంగీతకు ప్రావీణ్యం ఉంది. వీటిల్లో కేరళ ఆర్ట్, మ్యూరల్ ఆర్ట్ వంటి ఆయిల్ పెయింటింగ్స్‌లో చక్కగా బొమ్మలు గీస్తారు. వాటిని గోడ అందానికి ఉపయోగించవచ్చు. పెయింటింగ్ సైజును బట్టి ధరలు ఉంటాయి.


Sangeetha3

చిన్నప్పుడే మట్టిపై మమకారం

హైదరాబాద్‌కు చెందిన సంగిశెట్టి సంగీతకు మట్టితో ఆడుకోవడం చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. అప్పుడే మట్టితో బొమ్మలు, వినాయక విగ్రహాలు, తయారు చేసేది. క్రమంగా మట్టిపై మమకారం పెరిగింది. పెండ్లి అయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక తన చిన్ననాటి కళకు పదును పెట్టింది. గురువు ఎవ్వరూ లేకుండానే సొంత ఆలోచనలతో బొమ్మలు చెయ్యడం ప్రారంభించింది. డిగ్రీ వరకూ చదువుకున్న సంగీత క్లే ఆర్ట్‌ను గురించి తెలుసుకొని కొన్ని వర్క్‌షాపులకు వెళ్లేది. అక్కడ.. బొమ్మలకు ఎలాంటి మట్టిని వాడతారు? ఎన్ని రకాలు ఉన్నాయి? అవి ఎక్కడ దొరుకుతాయి? ఎలాంటి బొమ్మకు ఎంత కలర్ మిక్స్ చెయ్యాలి? మనకు అందుబాటులో ఉన్న మట్టితో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు? అనేవి క్షుణ్ణంగా తెలుసుకుంది. మన దేశంలో అందుబాటులోని మట్టిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేయించుకుంటుంది. పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకొని అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్ వేస్తుంది. అంతేకాకుండా డూడుల్ బగ్స్ పేరుతో క్లే ఆర్ట్‌లో విద్యార్థులకు, గృహిణులకు శిక్షణ ఇస్తుంది. పెండ్లికి సంబంధించిన పూల జడలు, రాఖీలు, వాచ్‌లు, ఇయర్ రింగ్స్, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు, గాజులు, కీచైన్స్, చిన్నచిన్న బొమ్మలు వంటివి నేర్పుతుంది. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా క్లే ఆర్ట్‌లో శిక్షణ ఇచ్చింది.
-డప్పు రవి
జి.భాస్కర్


Sangeetha2

ఇష్టమే వృత్తిగా మారింది!

బొమ్మలు చెయ్యడం ఇష్టం. దానినే వృత్తిగా ఎంచుకున్న. క్లే ఆర్ట్‌లో చాలా ముఖ్యమైంది కలర్ మిక్సింగ్. ఏదైనా మొక్కను తయారు చెయ్యాలనుకుంటే.. మొక్క, కాండం, ఆకులు, పువ్వుల రంగులు వంటివి ఎంపిక చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆయిల్ కలర్‌ను మిక్స్ చేయాలి. పెండ్లి పూల జడలు మోడ్రన్‌గా అల్లడంపై శిక్షణ ఇస్తున్నా. భవిష్యత్‌లో కస్టమర్లు కోరిన విధంగా బొమ్మలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. ఆర్డర్స్ పెరిగితే ఆన్‌లైన్‌లో విక్రయిస్తా. ఈ కళను నేర్చుకోవాలనుకునే వారు, మట్టి బొమ్మలు, ఆయిల్ పెయింటింగ్స్ కావాలనుకునే వారు 9030629744
నంబర్‌ను సంప్రదించవచ్చు.
- సంగిశెట్టి సంగీత,
క్లే ఆర్టిస్ట్

1866
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles