సాఫ్ట్‌వేర్ టు విలేజ్


Mon,January 21, 2019 11:38 PM

ఊరును బాగుపరచడం లేదు అని ఎవరినో తిడితే ప్రయోజనం ఏంటి? మనమే రంగంలోకి దిగి ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నారు నాగంసాయి ప్రవళిక. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
Pravalika
ప్రవళిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సమాజం గురించి ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి. అందుకే కొంతకాలంగా ఉద్యోగాన్ని పక్కనపెట్టేసి మూగజీవుల పట్ల ప్రేమను పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. సమాజం గురించి వేరే ఎవర్నీ నిందించకుండా తానే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని కొర్రెముల నుంచి వార్డు సభ్యురాలిగా.. సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.


లా చదువుతూనే: బ్లూక్రాస్ సంస్థ ప్రతినిధి సినీ నటి అమలను ఆదర్శంగా తీసుకుని జంతు ప్రేమికురాలుగా మారారు ఆమె. జంతువులను వేధించేవాళ్లను గుర్తించి దాదాపు 150 పోలీస్‌స్టేషన్‌లలో 2000లకు పైగా కేసులు నమోదుచేయించారు. ఏడు సంవత్సరాలుగా జంతువుల హక్కులు, పర్యావరణ పరిరక్షణ కొరకు ఉద్యమిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ప్రవళిక భర్త హరి ప్రసుత్తం తెలుగు చిత్ర పరీశ్రమలో అసోసియేట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. కొర్రెముల పంచాయతీ పరిధిలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జంతు సంరక్షణ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే నగరంలోని పీఎంఆర్ లా కళాశాలలో లా కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నారు ప్రవళిక.


మేనక గాంధీ స్ఫూర్తితో: కేంద్ర మాజీ మంత్రి మేనక గాంధీ స్పూర్తీగా రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. జంతువుల రక్షణ, వాటి హక్కుల రక్షణ కోసం తాను నిరంతరం చేస్తున్న సేవలకు రాజకీయం తోడైతే ఈ రంగంలో మరింత సేవ చేయవచ్చనే లక్ష్యంతో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. ప్రజలను చైతన్య పరచడానికి వారి సమస్యలను పరిష్కరించడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. జంతు సంరక్షకురాలిగా ఎదగడానికి బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధి అమల, మాజీ మంత్రి మేనక గాంధీతో పలు మార్లు తర్ఫీదు పొందినట్లు తెలిపారు. జంతువుల హక్కులను కాపాడడానికి కావాల్సిన తర్ఫీదును వారి వద్ద నుండే నేర్చుకున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో జీరో బడ్జెట్‌తో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.


డబ్బు పంచను: డబ్బు ఇవ్వడం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని ఆమె అంటున్నారు. తాను ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వకుండా ప్రచారం చేస్తున్నానన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించినట్లయితే అదే మాదిరిగా సేవలు అందిస్తానని, సమస్య ఎంతటిదైనా ఉన్నతాధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్న నాయకుల వరకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఓటర్లకు విడమరిచి వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో లంచం, అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేయడానికి, తాను చేపట్టిన జంతు సంరక్షణ హక్కుల పరిరక్షణను మరింత పకడ్భందీగా నిర్వహించడానికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.


యువత ద్వారానే మార్పు

యువత రాజకీయాల్లోకి వచ్చి అవినీతి లేని, లంచగొండితనం లేని రాజకీయాలు చేయవచ్చని నిరూపించడానికే పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆమె తెలిపారు. యువతను ఆలోచింపజేయడం కూడా తన అభ్యర్థిత్వానికి ఒక కారణం అని పేర్కొన్నారు. సమాజంలో మార్పు సాధించడం ఒక్క యువత ద్వారానే సాధ్యం అని తాను బలంగా నమ్ముతున్నట్లు ప్రవళిక అంటున్నారు. అందుకే తనను సర్పంచ్‌గా గెలిపించాలని ఆమె కోరుతున్నారు.
-మేడబోయిన నర్సింహ
ఘట్‌కేసర్, నమస్తే తెలంగాణ

1157
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles