కుష్టుకు ముగింపు కష్టమేమీ కాదు!


Tue,January 22, 2019 01:38 AM

కుష్టువ్యాధి పేరు చెప్తేనే కొందరు భయపడుతారు. ఆ రోగులు కనిపిస్తే చీదరించుకుంటారు. అన్ని వ్యాధుల మాదిరిగానే కుష్టువ్యాధి కూడా ఒకటి. భయపెట్టేదే. కానీ నయం కానిది మాత్రం కాదు. వ్యాధిపట్ల అవగాహన.. పాజిటివ్ దృక్పథం ఉంటే కుష్టురహిత సమాజం నిర్మించవచ్చు. జనవరి 27వ తేదీన లెప్రసీ డే సందర్భంగా కుష్టువ్యాధి.. దాని లక్షణాలు.. నివారణ వంటి విషయాలు తెలుసుకుందాం.
Skin_Exam_Doctor
కుష్టు గురించి ఈ వ్యాధి గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. అయినా కొందరికి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల దానిని పూర్తిస్థాయిలో నివారించలేకపోతున్నాం. సరైన అవగాహన ఉంటే కుష్టువ్యాధి రహిత సమాజాన్ని నిర్మించొచ్చు అనే విషయం తెలసుకోవాలి. 2020లో అంతం చేయాలి: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో కుష్టువ్యాధి తగ్గుముఖం పట్టినా పూర్తిస్థాయిలో నివారణ కావడం లేదు. ఇది సాధ్యమయ్యే పనే కాబట్టి కుష్టురహిత దేశం దిశగా భారత్ అడుగులు వేయాలి. ఈ మేరకు 2016వ సంవత్సరంలో గ్లోబల్ లెప్రసీ స్ట్రాటజీ ఆవిష్కరించారు. 2020 నాటికి లెప్రసీ లేని దేశంగా భారత్‌ను చూడాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ కార్యక్రమ ఆవిష్కరణకు ముందు 3000000 మంది ఆరోగ్య కార్యకర్తల సహకారంతో డబ్ల్యూహెచ్‌ఓ దేశవ్యాప్తంగా 19 రాష్ర్టాల్లోని 149 జిల్లాల్లో 320 మిలియన్ల మందిపై స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. 2020 నాటికి లెప్రసీని అంతం చేయాలని పిలుపునిచ్చింది.
కుష్టు లక్షణాలు: శరీరంపై పాలిపోయిన తెల్లని, లేదా రాగి రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలపై ఎలాంటి స్పర్శ ఉండకుండా నూనె పూసినట్లు మెరుస్తుంటాయి. మోచేతి, మోకాళ్ల బాహ్యనరాలు కొందరిలో ఉబ్బి ఉండవచ్చు. వ్యాధి తీవ్రమైతే మాత్రం అంగవైకల్యం ఏర్పడుతుంది. కుష్టులో పాసీబాసిల్లరీ, మల్టీ బాసిల్లరీ అనే రెండు రకాలు ఉంటాయి. పాసీబాసిల్లరీలో శరీరంపై దద్దులు, రాగి వర్ణపు మచ్చలతో అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉంటుంది. అయితే వీరికి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. మల్టీబాసిల్లరీలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైద్యం కూడా అదే స్థాయిలో జరగాల్సి ఉంటుంది.


పట్టణ్ర పాంతాల్లో అధికం: మారుతున్న జీవన విధానాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా కుష్టువ్యాధి గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా సోకుతుందనేది ఒక అంచనా. పట్టణాల్లోనే అక్షరాస్యతా శాతం అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధుల పట్ల పట్టణవాసులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. కానీ కుష్టువంటి తీవ్రమైన వ్యాధుల గురించి పట్టణవాసుల్లో అవగాహన లేకపోవడంతో ఇది రోజురోజుకూ విజృంభిస్తున్నది. దాదాపు అంతం అయిందనుకున్న కుష్టు ఇప్పుడు మళ్లీ విజృంభించడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించి కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నది ఆరోగ్యశాఖ. ఎలాంటి మచ్చలు ఉన్నా వారికి ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే వారి వివరాలు సేకరించి చికిత్సలు ప్రారంభిస్తున్నారు. గాంధీ వంటి ఆసుపత్రిలో ప్రతీవారం ప్రత్యేకంగా కుష్టువ్యాధులకు ఓపీ పెట్టారు. దీనికి సంబంధించిన అన్ని పరీక్షలు చేస్తారు.
female_recieving
నిర్లక్ష్యం చేస్తే: కుష్టు నయం కాదని ఇదివరకు అందరూ భావించేవారు. ఈ వ్యాధికి చికిత్స ఉందనే విషయం తెలుసుకోవాలి. ప్రారంభ దశలో కుష్టువ్యాధికి సంబంధించిన ఎలాంటి లక్షణాలూ బయటపడవు. ఒక్కోసారి 20 సంవత్సరాల తర్వాత కూడా బయటపడుతుంది. కాబట్టి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఒకవేళ దానిని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదురుతుంది. వ్యాధి ముదిరితే ఏజ్ ఓల్డ్ సోషల్ స్టిగ్మా లేదా లెప్రసీ స్టిగ్మా అంటారు. ఈ స్టిగ్మా కారణంగానే బాధితులు తొలిదశలోనే స్వయంగా చికిత్సకు జంకుతుంటారు. ఒకవేళ వ్యాధి ముదిరితే నాడీ, శ్వాస, చర్మ సంబంధిత అనేక సమస్యలు తోడవుతాయి. కంటిచూపు మందగిస్తుంది. శరీరం నొప్పిని తెలుసుకునే సామర్థ్యం కోల్పోతుంది. కాబట్టి కుష్టువ్యాధి లక్షణాలు కనిపించినా.. వ్యాధి నిర్ధారణ అయినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

చికిత్సా విధానం

వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నెలలు, పన్నెండు నెలలు చికిత్స ఉంటుంది. ఒకటి నుంచి ఐదు మచ్చల లోపు ఉంటే పీబీ కేసుగా పరిగణించి ఆరు నెలల చికిత్స, ఆరు కంటే ఎక్కువ మచ్చలుంటే, నరాలు ఉబ్బి ఉంటే ఎంబీ కేసుగా గుర్తించి పన్నెండు నెలలు చికిత్స అందిస్తారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ చికిత్స ఉచితంగా అందిస్తారు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు సంబంధిత సిబ్బంది మందులు అందజేస్తారు. పూర్తిస్థాయిలో మందులను వాడినట్లయితే దీని నుంచి బయటపడొచ్చు. రక్త స్మెయిర్ పరీక్ష ద్వారాఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
leprae

వ్యాధి కారకాలు

కుష్టు అంటువ్యాధి కాదు. సాధారణంగా తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు వెంటనే కనిపించవు. వ్యాధి సోకిన తర్వాత దాదాపు 3-15 సంవత్సరాలకు దీని దుష్పరిణామాలు బయటపడుతాయి. మైకో బాక్టీరియం లెప్రే సూక్ష్మక్రిమి ద్వారా ఇది వస్తుంది. ఇది ఆఫ్రికన్ కోతుల నుంచి మనుషులకు సంక్రమించి మన దేశంలోకి వ్యాపించిందని అంటారు. చలి ప్రాంతాల్లో.. నదీతీర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స ద్వారా వందశాతం నయం చేయొచ్చు.


-డాక్టర్ కే భూమేష్ కుమార్
సివిల్ అసిస్టెంట్ సర్జన్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ గాంధీ హాస్పిటల్, హైదరాబాద్

842
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles