అధిక బరువును తగ్గించే..బేరియాట్రిక్ సర్జరీ


Tue,January 22, 2019 01:35 AM

అధిక బరువు.. అన్ని వయసుల వారినీ వేధిస్తున్న సమస్య ఇది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్ పాటించినా సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించని పరిస్థితులు. ఏదైనా చికిత్స చేసుకుంటే బావుంటుంది అనుకుంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే కడుపు మాడ్చుకొని తంటాలు పడుతుంటారు. ఇవన్ని ఇబ్బందుల కన్నా బేరియాట్రిక్ సర్జరీ ఉత్తమం. బేరియాట్రిక్ సర్జరీ అనేది తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీర బరువును తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స. అధిక శరీర బరువును నియంత్రించేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది.
Bariatric-Surgery
బేరియాట్రిక్ సర్జరీ: ఊబకాయం వల్ల తలెత్తుతున్న సమస్యల కారణంగా ఇండియాలో ప్రతీయేటా 30-40 లక్షల మంది మరణిస్తున్నారు. అధిక బరువు తెచ్చిపెడుతున్న ఈ ప్రమాదాల గురించి సాధారణ ప్రజలలో అవగాహన, చైతన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది. జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించటం.. లేక ఆహారం చేరకుండా నియంత్రించటం.. లేదా ఆహారం జీర్ణాశయం నేరుగా చిన్న పేగులోకి వెళ్లేట్లు చేస్తారు.


ఎందుకు?: అదుపు తప్పిన శరీర బరువు వివిధ అవయవాలపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. వయసు ప్రమాణాన్ని తగ్గిస్తుంది. మితిమీరిన శరీర బరువు వల్ల టైప్-2 డయాబెటిస్, గుండెవ్యాధులు, నిద్రలో శ్వాస సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్నిరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో బరువు తగ్గడమే సకల సమస్యలకు పరిష్కారంగా భావిస్తున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేని వారికి బేరియాట్రిక్ చక్కని ఉపశమనంగా చెప్పొచ్చు. దీనిద్వారా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

సర్జరీ ఎన్ని రకాలు?: ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు చికిత్స నాలుగు విధాలుగా చేస్తారు. అవి.. లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రిక్ స్లీవ్ రీసెక్షన్ (ఎల్‌జీఎస్‌ఆర్), రౌక్స్-ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్, లాప్రోస్కోపిక్ అడ్జెస్టబుల్ గ్యాస్ట్రిక్ బాండింగ్ (ఎల్‌ఏజీబీ), డుయోడినల్ స్విచ్. వీటిలో దేనికదే ప్రత్యేకమైనది. వ్యక్తి ఎదుర్కొంటున్న బరువు సమస్య ఎలా ఉంది? జీవనశైలి ఎలా ఉంది? అనేవి పరిశీలించి వాటికి సరిపడే సర్జరీని వైద్యులు సిఫార్సు చేస్తారు. కాబట్టి సమస్యకు పరిష్కారం ఫలానాది అని మనకు మనం డిసైడ్ అవడం కాకుండా డాక్టర్ నిర్ధారణ మేరకే చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

ఎల్‌జీఎస్‌ఆర్: జీర్ణాశయం ప్రధాన వంపు నుంచి కొంత భాగాన్ని కోయడం ద్వారా పొట్ట పరిమాణాన్ని 20-30% తగ్గిస్తారు. ఈ ఆపరేషన్ తరువాత జీర్ణాశయం అరటి పండు ఆకారంలో ఉండే ఓ గొట్టం లాగా కనిపిస్తుంది. అంటే అడ్జెస్టబుల్ గ్యాస్ట్రిక్ బాండింగ్‌కి భిన్నంగా పొట్టసైజును శాశ్వతంగా తగ్గించేస్తుంది అన్నమాట.

రౌక్స్- ఎన్- వై గ్యాస్ట్రిక్ బైపాస్: గ్యాస్ట్రిక్ బైపాస్‌లో జీర్ణాశయం పరిమాణాన్ని తగ్గించటంతోపాటు ఆహారం 3-5 అడుగుల మేరకు పేగును వదిలి ముందుకు వెళ్లేట్లు చేస్తారు. ఈ శస్త్రచికిత్స తరువాత గతంలో మాదిరి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోలేరు.

ఎల్‌ఏజీబీ: ఈ శస్త్రచికిత్సలో జీర్ణాశయం పైభాగాన సర్జన్ ఓ చిన్న సిలికాన్ బాండ్ వేస్తారు. దీంతో పొట్ట పరిమాణం తగ్గి కొద్దిమొత్తంలో ఆహారం తీసుకోగానే నిండిపోతుంది. బాండ్ వల్ల ఆ వ్యక్తి తినే ఆహారం పరిమాణం తక్కువగా ఉండగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది.

డుయోడినల్ స్విచ్: దీనినే బైలోపాంక్రియాటిక్ డైవర్షన్ విత్ డుయోడినల్ స్విచ్ అని కూడా అంటున్నారు. మిగతా బేరియాట్రిక్ సర్జరీలన్నింటికంటే ఇది చాలా క్లిష్టమైంది. దీనిలో భాగంగా రెండు ఆపరేషన్లు చేస్తారు. మొదటిది గాస్ట్రిక్ స్లీవ్ సర్జరీలా ఉంటుంది. రెండోది.. ఆహారం చిన్నపేవులోని చాలా భాగాన్ని దాటేసి నేరుగా వెళ్లేట్లు చేస్తుంది.
shutterstock
ఎవరు చేయించుకోవాలి?: బేరియాట్రిక్ సర్జరీలు ఎవరంటే వాళ్లు చేయించుకోవద్దు. వ్యక్తి శరీరం సర్జరీకి అనుకూలంగా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాతే దీనిని చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తి పొడవు, శరీరపు బరువు ఆధారంగా లెక్కించే బీఎంఐను బట్టి ఊబకాయాన్ని.. దాని తీవ్రతను అంచనా వేస్తారు. బీఎంఐ 25 కి.గ్రా/ఎం2 నుంచి 30కి.గ్రా /ఎం2 వరకు ఉంటే అధిక బరువుగా పేర్కొంటారు. అది 30కి.గ్రా /ఎం2 దాటితే ఊబకాయంగా పరిగణిస్తారు. 35- 40కి.గ్రా/ ఎం2కు చేరుకొని వ్యాయామం, ఆహారనియమాలు పాటించినా ప్రయోజనం కనిపించని, టైప్-2 డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, నిద్రలో శ్వాస సమస్యలను ఎదుర్కొంటున్న వారు నిస్సంకోచంగా బేరియాట్రిక్ చేయించుకోవచ్చు.

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?: ఈ సర్జరీ ద్వారా ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. అయితే బేరియేట్రిక్ సర్జరీ చేయించుకున్న సెలబ్రిటీలు ఇటీవల ఎక్కుమంది చనిపోయారు. దీంతో చాలామందికి ఆందోళనలు పెరిగాయి. కానీ బేరియాట్రిక్ సర్జరీలు సురక్షితం. ఇతర సర్జరీలకు సంబంధించి పాటించాల్సిన జాగ్రత్తలే వీటికి వర్తిస్తాయి. శస్త్రచికిత్స తరువాత శరీరంపైన గాటుపెట్టిన చోట ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఇందుకుగాను డాక్టరు సిఫార్సుచేసిన ఆంటీబయోటిక్స్ తప్పనిసరిగా వాడాలి. సర్జరీ తరువాత శారీరక శ్రమ ప్రారంభం గూర్చి డాక్టరు సలహా తీసుకొని పాటించాలి. బేరియాట్రిక్ సర్జరీ వల్ల బరువు తగ్గటంతో అంతకుముందు లావుగా ఉన్నప్పడు సాగి ఉన్న చర్మం వేలాడే అవకాశం ఉంది. దానిని సరిచేయటానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. తిండి విషయంలో.. పోషకాహారాన్ని ఎంచుకోవాలి. బాగా నమిలి నెమ్మదిగా తినాలి. మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవాలి.


ప్రయోజనాలేంటి?

-6-7 నెలల్లో శరీర బరువు గణనీ యంగా తగ్గుతుంది.
-టైప్-2 మధుమేహం, రక్తపోటు అదుపులోకి వస్తాయి.
-రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
-తుంటి, మోకాలు కీళ్లనొప్పి తగ్గుతుంది.
-నిద్రలేమి సమస్యలు పరిష్కారం అవుతాయి.
-ఒంటి నొప్పులు తగ్గి జీవన నాణ్యత మెరుగుపడుతుంది.
-గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
-లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-సంతానలేమి సమస్యలు పరిష్కారం అవుతాయి.
-మానసిక కృంగుబాటు దూరమవుతుంది.


-డాక్టర్ ఎం మణిశేఖరన్ బేరియాట్రిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్

573
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles