విషక్రిముల విశ్వరూపం


Tue,January 22, 2019 01:13 AM

space
భూమిమీద విషక్రిముల (వైరస్‌లు) విచ్చలవిడి విహారం సూక్ష్మజీవులనే మించిపోతున్నాయి. వేరే జీవుల్లోని జీవకణాలను ఆశ్రయించుకొని ఉంటూ, ఒక కణం నుంచి మరొక కణానికి, అదే పనిగా, అసంఖ్యాకంగా, అంతకంతకూ వ్యాప్తి చెందుతూ, చివరకు తనకు ఆతిథ్యమిచ్చిన జీవినే నాశనం చేసేదాకా నిద్రపోని అతిసూక్ష్మ విషపు జీవులివి. పూర్తిస్థాయి జీవుల పరిధిలోకి కూడా రాని ఈ భీకరక్రిముల విశ్వరూపం ఇంతా అంతా కాదు. తాజాగా వెలుగుచూసిన కొన్ని అంశాలు వాటి మహమ్మారితనాన్ని మరింత చాటుతున్నాయి.


వైరస్ (విషక్రిమి) పేరు చెబితేనే మనలోని జీవకణాలు గజ్జున వణుకుతాయి. మనుషులతోపాటు భూమిమీది సమస్త వృక్షజంతు జాతులన్నీ (సూక్ష్మక్రిములు సైతం) వీటి మూలంగానే అనారోగ్యాల బారిన పడుతూ, కొన్ని చికిత్సలకు సైతం అందకుండా ఆఖరకు గత్యంతరం లేని స్థితిలో ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నాయి. రైనో (జలుబు) నుంచి హెచ్‌ఐవి (ఎయిడ్స్) వరకు మానవాళిని పట్టి పీడిస్తున్న సమస్త వ్యాధులకు దాదాపు ఇవే కారణం. వీటి పుట్టుక, నిర్మాణం, వ్యాప్తి వంటి విషయాలలో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తి స్థాయి అవగాహన ఏర్పడలేదు. మనిషితోపాటు జంతువుల మెదళ్ల నాడీకణాలు సైతం ఒక పురాతన విషక్రిమి సంబంధ సంక్రమణాన్ని (వైరల్ ఇన్‌ఫెక్షన్) కలిగి ఉన్నాయన్న సంగతిని సెల్ పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఒక పరిశోధన వెల్లడించింది. మన మస్తిష్కాలలో ఆలోచనా విధానం ఎలా జరుతుంటుందన్న దానికి ఇది మూలాధారంగా ఉన్నట్టు పరిశోధకులు అంటున్నారు. నాలుగు కాళ్ల జంతువుల్లోనూ ఆర్క్ (Arc) గా పిలిచే ఒక జన్యుసంకేతం ఉందని, ఇదీ ఓ ప్రాచీన వైరస్ తాలూకు అవశేషమేనని వారు అంటున్నారు. మరోవైపు వైరస్‌లకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక మిస్టరీకి 2018లో సమాధానం లభించింది. భూమిమీద అసాధారణ దూరతీరాలకు, ఎత్తుపల్లాలకు అతీతంగా విషక్రిములు జన్యుపరంగా ఒక దానికొకటి పోలి ఉంటున్నాయి. దీనికి కారణం అవి వాతావరణంలోని వాయు విద్యుత్తుపై ప్రయాణించడమేనని వారు నిర్ధారించారు.


మల్టీడిసిప్లినరీ జర్నల్ ఆఫ్ మైక్రోబయల్ ఎకాలొజీలో ప్రచురితమైన ఓ పరిశోధనా పత్రం ఇందులోని మర్మాన్ని విప్పింది. వాతావరణంలోని మట్టి లేదా నీటి రేణువులపై గెంతుతూ, ఎంతో ఎత్తు వరకు వుండే భూమి కిందిపొర ట్రోపొస్పియర్ (ఉపరితలం నుంచి 6-10 కి.మీ. ఎత్తున) వరకు కూడా అవి ప్రయాణించగలవని, అదే స్థాయిలో కిందికి జారి పడగలవనీ వారు ఇందులో నివేదించారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 8,200 నుంచి 9,800 అడుగుల ఎత్తున కూడా వీటిని కనుగొనగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక, ఉపరితలంపైనైతే, ఏకంగా ఒక చదరపు మీటరు ప్రదేశంలోనే రోజుకు కొన్ని వందల మిలియన్ల వైరస్‌లను గుర్తించగలమని వారు తెలిపారు. ఆర్క్ జన్యువుపై మరింత లోతైన పరిశోధనలు జరిగితే తప్ప మన మెదడు నాడీకణాలపై అవి చూపుతున్న దుష్ప్రభావాలు తెలిసి రావని వారు అన్నారు.

సాధారణ పరిమాణంలోని వైరస్‌లకు రెండింతలు పెద్దగా వుండే భారీ వైరస్‌లలో అయితే సంక్లిష్ట జన్యువులుంటాయని శాస్త్రవేత్తల మరొక అధ్యయనం వెల్లడించింది. కిందటేడాది జూన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ పరిశోధనలో పెద్ద వైరస్‌లను పండోరావైరస్‌లుగా పిలుస్తున్నారు. వాటిలో కొత్త రకమైన అనాథ జన్యువులను (orphan genes) కనుగొన్నట్టు వారు తెలిపారు. ఈ విషక్రిముల వల్ల నిరంతరం కొత్త జన్యువులు, మాంసకృత్తులు పుట్టుకొస్తున్నాయని, ఇది ఎందుకు జరుగుతున్నదీ తెలియడం లేదని వారు అంటున్నారు.


రోగాల బారిన పడుతున్న మనుషులు ఔషధాలకు బాగా అలవాటు (drug addiction) పడుతున్నారు. మానవుల ఆలోచనా విధానం ఈ రకంగా మారడం వెనుక కూడా సుదీర్ఘ కాలం కిందటి వైరల్ ఇన్‌ఫెక్షనే కారణమై ఉంటుందని 2018 సెప్టెంబర్‌లో జరిగిన వేరొక పరిశోధన వెల్లడించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ఔషధాలకు అదే పనిగా అలవాటు పడుతున్న వారిలో హెచ్‌కె2గా పిలిచే వైరస్ సర్వసాధారణంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ఈ మందుల అలవాట్లు లేని వారిలో ఈ విషక్రిమి తాలూకు జన్యుజాడలు అసలుకే లేవు. ఈ వైరస్ అవశేషాలు కేవలం 5-10 శాతం మంది ప్రజలలోనే ఉండడాన్నిబట్టి ఇది ఈమధ్య కాలంలోనే సోకినట్టుగా తెలుస్తున్నదని, కాకపోతే ఇది బహుశా సుమారు 2,50,000 సంవత్సరాల కిందటిది అయి వుంటుందని పై పరిశోధకులు అంటున్నారు.

space1

చిక్కవు, దొరకవు!

ఇప్పటికైతే సుమారు 5,000 వైరస్‌లను కనుగొనగా, వెలుగులోకి రానివి ఇంకెన్నో. వైరస్‌ల ఉనికిని తొలిసారిగా 1872లో కనుగొన్నా 2018 నాటికి కూడా వాటిని గురించిన కొత్త విషయాలను శాస్త్రవేత్తలు ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు. వీటికి సొంతంగా, తమంతట తాముగా వృద్ధి చెందే శక్తి ఉండదు. బదులుగా, ప్రొటీన్ పూతను పట్టుకొని ఉండే జన్యుపదార్థంతో, సాధారణంగానైతే డిఎన్‌ఎ (DNA) లేదా దీని అనుబంధమైన ఆర్‌ఎన్‌ఎ (RNA) లతోనే ఇది ఉద్భవిస్తుంది. తమలోని జన్యుసంకేతాల్ని తాము ఆతిథ్యం తీసుకొన్ని జన్యువుల్లోకి చొప్పించి, వాటితో కలిసిపోయే కుయు(శ)క్తి ఈ విషక్రిములకు ఉంటుంది. కాబట్టే, అనేక జీవకణాలలో వీటిని కనుగొనడం పరిశోధకులకు కష్టమవుతున్నది. ఇక, ఇవి భూమిపై ఎలా ఆవిర్భవించాయన్నదీ నిర్దిష్టంగా తెలియదు. పురాజీవ పరిశోధనలకూ వైరస్‌లు అందడం లేదు. ఎందుకంటే, ఇవి శిలాజాలుగానూ ఏర్పడవు కనుక. తమలోని జన్యుయుక్తుల్ని విషక్రిములు ఎలా, ఎందుకు ప్రదర్శిస్తాయి? అన్నదీ శాస్త్రవేత్తలకు ఇంకా అంతుబట్టని రహస్యంగానే ఉంది.


- దోర్బల బాలశేఖరశర్మ

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles