ఒక్కోసారి చిన్న విషయాలే ఆసక్తికరంగా మారుతాయి. చిన్న చిన్న పనులే ఆలోచింపజేస్తాయి. అలాంటిదే ఇంగ్లాండ్‌లో జరిగింది.

మనం అందరం షాపింగ్ మాల్స్‌కి వెళ్తుంటాం. అక్కడ కొన్ని బొమ్మలకు డ్రెస్సింగ్ చేసి విండోలో ఉంచుతారు. వాటిని అందంగా తయారు చేసి వినియోగదారులను ఆకర్షిస్తారు. ఎక్కడైనా సరే అలాంటి వివిధ రకాల బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇదే తరహాలో ఇంగ్లాండ్‌లోని ఓ పెండ్లి బట్టల దుకాణ నిర్వాహకులు.. ఒక బొమ్మను ఆసక్తికరంగా అలంకరించి ప్రదర్శించారు. పెండ్లి గౌన్‌తో డ్రెస్సింగ్ చేసి, వీల్ చైర్లో కూర్చోబెట్టారు. ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్న ఈ బొమ్మను అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. దివ్యాంగుల షాపింగ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇలా బొమ్మను రూపొందించినట్లు షాప్ యజమాని చెపుతున్నాడు. దీన్ని చూసిన ఒకావిడా ఫొటోతీసి ట్విట్టర్లో షేర్ చేయటంతో వేల రీ-ట్వీట్లు అవుతున్నాయి. దీంతో ఈ వీల్‌చైర్ మానక్వీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.