మహిళలకు పార్ట్‌టైం ఉద్యోగాలిస్తామంటున్న సైరీ చాహల్


Mon,January 21, 2019 12:11 AM

మహిళాశక్తిని తక్కువ అంచనా వేయొద్దంటారు సైరీ. జిప్ కార్ వ్యవ స్థాపకుడు రాబిన్ చేజ్‌ను కోట్ చేస్తూ ప్రపంచంలోని తొలి కార్ షేరింగ్ ఐడియా ఓ మహిళదే అని గుర్తు చేశారామె. వ్యాపార రంగంలో మహిళల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని, వారి దృక్పథం బిజినెస్ ను మించిపోయిందని చెప్తున్నారు. అయితే మధ్యవయస్సు వచ్చేసరికి ఎదుగుతున్న పిల్లలు, వారి చదువు సంధ్యలు, ఆర్థిక వ్యవహారాలతో ఉద్యోగాలు మానేస్తున్నారు. ఎవరి పనులకు వారెళ్లాక ఉండే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పార్ట్‌టైమ్ జాబ్ వెతికి పెడుతామంటున్న షీరోస్ డాట్ ఇన్ సీఈవో సైరీ చాహల్ సక్సెస్‌మంత్ర.
maxresdefault
మహిళలు సాధికారత వైపు ఎంతవేగంగా అడుగులు వేస్తున్నా- మగవారితో పోల్చుకుంటే ఉద్యోగం చేసే మగువల సంఖ్య తక్కువే. ఒకవేళ రిటైర్ అయ్యేదాకా చేద్దామని అనుకున్నా కొన్ని కొన్ని సందర్భాలు వారితో ఉద్యోగం మానేలా చేస్తాయి. ముఖ్యంగా మిడిల్ ఏజ్ వచ్చేసరికి - ఉద్యోగం కంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయడమనేది వారికి చివరి ఆప్షన్ గా మారి పోతుంది. అయినా కొంతమంది పార్ ్టటైం జాబ్స్ వైపు, ఇంటినుంచే చేసే ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికోసమే తామున్నామని చెబుతున్నారు సైరీ చాహల్.


మహిళల కోసమే..

ఇంటి దగ్గరే ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునేవారికోసమే షీరోస్ డాట్ ఇన్ పనిచేస్తుందని సైరీ అంటున్నారు. 2014లో మొదలైంది షీరోస్ డాట్ ఇన్ వెబ్‌సైట్. ఇంటిదగ్గరే ఉండే మహిళలను ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకుని వారికి సంబంధించిన ఉద్యోగం వెతికిపెట్టడం. వారు పనిచేసే సమయంలో ఏమైనా సందేహాలుంటే క్లారిఫై చేస్తూ ఈ వెబ్‌సైట్ చేస్తున్నది. దీనికోసం ఒక ప్రత్యేక టీం కూడా ఉంటుంది. పర్సనల్ లైఫ్‌ను, వృత్తిపరమైన జీవితాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దుకోగలను అనే నమ్మకం ఉన్న మహిళలందరికీ మా షీరోస్ డాట్ ఇన్ మంచి ప్లాట్ ఫాం అంటారు సైరీ చాహల్.

మళ్లీ నేర్పించి!..

పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే మహిళలకు వచ్చే మరో సమస్య ఎంటంటే వారు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండడం మూలంగా వారు గతంలో తాము చేసిన పనిని మరిచిపోతారు. ఒకసారి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత చాలామంది మహిళలు మళ్లీ మొదటికి వస్తున్నారు. అంతకుముందున్న స్కిల్స్ వారిలో కనిపించవు. నేర్చుకున్న విషయాలను కూడా మరిచిపోతుంటారు. ఇదే పెద్ద సమస్యగా మారిందంటారు సైరీ. అయితే, ఈ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు షీరోస్ సమ్మిట్ పేరుతో దేశంలోని వివిధ నగరాల్లో సదస్సులు నిర్వహించారు. వారికి తమ స్కిల్స్‌ను తిరిగి నేర్పించి ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం చేస్తున్నామని ఆమె తెలిపారు.

maxresdefault1

లక్షలాది మందికి ఉపాధి

దేశంలో షీరోస్‌కు 12 వందలకు పైగా విభాగాలున్నాయి. ఈ కమ్యూనిటీలో మహిళలు పార్ట్ టైంగానే ఎన్నో పెద్ద కంపెనీల ప్రాజెక్టుల్ని చేసిపెట్టారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పటి వరకూ పది వేల మందికి పైగా మహిళలు కమ్యూనిటీలో ఫుల్‌టైమ్ సభ్యులుగా చేరారు. అందులో ఇంటి నుంచే పనిచేసే ఫ్రీలాన్సార్స్, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. షీరోస్ కేవలం ఉద్యోగం వెతికిపెట్టడం మాత్రమే కాదు, సభ్యులతో సమావేశాలు, జాబ్‌మేళాలు, ప్రత్యేక శిక్షణ తరగతులు వంటి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. షీరోస్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 3 లక్షల మందికి పైగా పార్ట్‌టైం ఉద్యోగాలు వెతికి పెట్టింది.

ఎంతో ప్రాచుర్యం

షీరోస్ చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకున్న మహిళలెందరో షీరోస్ కమ్యూనిటీలో చేరుతున్నారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా షీరోస్‌కు ఎంతో ప్రాచుర్యం లభించింది. అయితే షీరోస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్ లో 17 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తున్నారు. వారిలో కేవలం 5 శాతం మాత్రమే పై స్థాయికి చేరగలుగుతున్నారు. ఈ విషయంలో మన దేశం ప్రపంచంలో 113వ స్థానంలో ఉంది. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు- శక్తిసామర్థ్ధ్యాలు ఉన్నప్పటికీ ఉన్నత పదవులకు వారు ఎంతదూరంగా ఉంటున్నారో. దాదాపు 48 శాతం మంది మహిళా ఉద్యోగులు ప్రమోషన్ అందుకోకుండా జాబ్ వదిలేస్తున్నారు. కనీసం మధ్యస్థాయి పదోన్నతి కూడా పొందకుండా ఉద్యోగానికి గుడ్ బై కొడుతున్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడానికి ఇది కూడా ముఖ్యకారణం అంటున్నారామె.

కంపెనీలతో ఒప్పందాలు

షీరోస్ సుమారు 1000కి పైగా కంపెనీలతో భాగస్వా మ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. తమ సంస్థకు కావాల్సిన ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను కంపెనీల వారు షీరోస్‌కు ఇస్తున్నారు. ఉదాహరణకు క్లియర్‌టాక్స్ అనే వెబ్‌సైట్ తమ కస్టమర్లకు అవసరమైన సాయం అందించడానికి సీఏ చదివిన మహిళలతో ఒప్పందం చేసుకుంటున్నది. ఇదే దారిలో హనీవెల్ వంటి ఎన్నో కంపెనీలున్నాయి. షీరోస్ బృందంలో మెజారిటీ భాగం మహిళలే అయినప్పటికీ మగవారు కూడా ఉంటారు. వారంతా ఎక్కడెక్కడో ఉన్నా ఒక టీంగానే పనిచేస్తారు.

maxresdefault2
వ్యాపార విభాగంలోనే కాక టెక్నాలజీలోనూ పట్టు సాధించాలని మహిళలకు సూచిస్తున్నారు సైరీ. పారిశ్రామిక రంగంలో నెగ్గుకు రావడం మహిళలకు కష్టం అన్నది ఒకప్పటి మాట. ఆధునిక కాలంలో పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటున్నారు షిరోస్ సీఈఓ సైరీ చాహల్. అవకాశాలను అందిపుచ్చుకొని ముందడుగేస్తే జయించడానికి అతివల కోసం చాలానే ఉందని చెప్తున్నారు.

1176
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles