కడుపునొప్పికి కారణమేంటి?


Mon,January 21, 2019 12:04 AM

నా వయసు 35 సంవత్సరాలు. నాది కూర్చుని పనిచేసే ఉద్యోగం. ఈ మధ్య నా కడుపులో బాగా నొప్పి లేస్తున్నది. ఏదో పిసికినట్లు.. తిప్పి మెలేసినట్లు అనిపిస్తున్నది. ఒక్కోసారి ఆ బాధ భరించలేకపోతున్నాను. పొట్ట అయితే ఉబ్బినట్టు నిండుగా మారిపోతుంది. ఇలా జరిగిన ప్రతీసారి గ్యాస్‌కు సంబంధించిన టాబ్లెట్ వేసుకోవడంతో నయమయ్యేది. కానీ ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నా కూడా అలాగే ఉంటుంది. నాది గ్యాస్ సమస్యేనా? లేక ఇంకేదైనానా? అల్సర్ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయా? తిన్నది కూడా త్వరగా జీర్ణం కావడం లేదు. కాబట్టి జీర్ణాశయం పాడైందేమో అనిపిస్తున్నది. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలపండి.
- ఆర్. ఆదిత్య, మిర్యాలగూడ

Councelling
డియర్ ఆదిత్య.. మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉందనిపిస్తున్నది. మల్టీ డిసీజ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉన్నవారికి ఇలాంటివి ఎదురవుతుంటాయి. గ్యాస్ట్రిటైటిస్ కూడా అయుండొచ్చు. చాలామందికి హెలికో బాక్టీరియమ్ ఫైల్‌వే (హెచ్‌పీ) ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో నొప్పి వస్తుంటుంది. కొందరికి బ్రాంకెటైటిస్ వల్లగానీ.. పిత్తాశయంలో రాళ్ల వల్లగానీ ఇలా జరుగుతుంది. మీరు ఆల్కహాల్ తీసుకుంటారో లేదో తెలియజేయలేదు. ఒకవేళ మీకు కచ్చితంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మాత్రం ఎంత మోతాదులో తీసుకుంటున్నారో గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందిలో అధికమోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్లే క్రానిక్ బ్రాంకియాటిస్ట్ వస్తుంది. దీనివల్లనే జీర్ణ సమస్య.. గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. వీటిలో మీకున్న సమస్య ఏదీ అని నిర్ధారించుకోవడానికి మాత్రం తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్‌షుగర్, సీబీపీ పరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరమ్ అమైలేజ్, సీరమ్ లైపేజ్, ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష, ఎండోస్కోపీ వంటివి చేయించుకోవాలి. ఒకవేళ కడుపులో అల్సర్ ఉంటే మాత్రం 14 రోజులు క్రమం తప్పకుండా యాంటి బయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాంకెటైటిస్ సమస్యనా అని నిర్ధారించుకోవడానికి ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకోవాలి. దీనిలో భాగంగా లైపేజ్ ఎంజైమ్‌లో బయటి నుంచి ఇస్తారు. పిత్తాశయంలో రాళ్లున్నట్లు నిర్ధారణ అయితే లాప్రోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ సమస్య ఉంటే మాత్రం పూర్తిగా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇవన్నీ చేస్తూనే మంచి జీవనశైలి ఏర్పరచుకోవాలి. ప్రతీరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.


డాక్టర్ రమేష్ కుమార్
గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి
ఉస్మానియా హాస్పిటల్, హైదరాబాద్

1124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles