గుండెపోటును గుర్తించేదెలా?


Sat,January 19, 2019 01:59 AM

నా వయసు 21 సంవత్సరాలు. నేను మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నా. రెండు నెలల క్రితం మా నాన్న గుండెపోటుతో మరణించారు. మా తాత కూడా ఇలాగే గుండెపోటు వల్లే చనిపోయారు. ఇద్దరూ ఒకే కారణంతో మరణించడం వల్ల నాకు భయం కలుగుతున్నది. హార్ట్‌ఎటాక్, బీపీ, షుగర్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా వస్తుంటాయంటారు కదా? ఇది నిజమేనా? భవిష్యత్‌లో నాకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టేనా? ఒకవేళ ఉంటే దీనిని ఎలా గుర్తించాలి? అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుపగలరు?
- పి. శ్రీలక్ష్మీ, నిజామాబాద్

Councelling
శ్రీలక్ష్మీగారూ.. మీరు మీ సందేహాన్ని తెలియజేయడానికి మీరు అప్రమత్తమవడం అభినందనీయం. కానీ అనవసర భయాందోళనలు మాత్రం ఆపేయండి. గుండెపోటుకు ఈ భయాందోళనలూ కారణమనే విషయం గ్రహించాలి. ఇక విషయానికి వస్తే గుండెపోటుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో వంశపారంపర్యం, జన్యుపరమైన సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ ఇవి మాత్రమే కారణం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. సరైన ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పరచుకోవడం వల్ల మీ గుండెకు సంపూర్ణ రక్షణ ఇవ్వవచ్చు. సాధారణంగా గుండెకు రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో కొవ్వు తదితర పదార్థాలు పేరుకుపోయి రక్తసరఫరా మార్గం క్రమేపీ మూసుకుపోతుంది. దీనివల్ల రక్త సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరానికి ఆక్సీజన్‌తో కూడిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలం అవుతుంది. రక్తంలో ఎల్‌డీఎల్, హైబ్లడ్ ప్రెజర్, పరిమితికి మించిన చక్కెర శాతం లాంటివి హానికరమైన కొవ్వు పదార్థాలు. ఇవి ప్రమాదకర స్థాయికి చేరితే గుండెపోటు వస్తుంది. కూర్చున్నచోటే ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, పొగతాగడం, మద్యం అలవాటు, జంక్‌ఫుడ్ తినడం, మానసిక ఒత్తిడి లాంటి అలవాట్ల వల్ల రక్తనాళాలు మూసుకుపోయి గుండెకు ప్రమాదం జరుగుతుంది. గుండెపోటును ఎలా గుర్తించాలి అన్నారు కదా? పైన తెలిపిన అలవాట్లు మీకు ఉన్నట్లయితే గుండెపోటును ముందస్తుగా గ్రహించవచ్చు. దురలవాట్లకు దూరంగా ఉంటూ డాక్టర్ సూచనలను బట్టి తగిన వ్యవధిలో బీపీ, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే ఎప్పటికప్పుడు మీ గుండె పనితీరును తెలుసుకోవచ్చు.


డాక్టర్ వరదా రాజశేఖర్
సీనియర్ ఇంట్రవెన్షనల్
కార్డియాలజిస్ట్

923
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles