2019 ఏది బెస్ట్


Sat,January 19, 2019 01:46 AM

2019

- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు బంగారం


కొత్త ఏడాది ప్రారంభం అయి అప్పుడే దాదాపు మూడు వారాలు గడిచింది. గత ఏడాది హెచ్చుతగ్గుల ప్రభావం మార్కెట్‌ను ఇంకా వీడలేదు. ఇన్వెస్టర్లందరి మదిని తొలుస్తున్నది ఒకటే ప్రశ్న. కనీసం 2019లో నైనా ఒడిదుడుకులు తగ్గి స్థిరమైన రాబడులు చేతికందుతాయా? 2018 లో నిఫ్టీ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందనా కేవలం 3.5 శాతం రాబడిని మాత్రమే ఇచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా మదుపు చేసే మిడ్‌క్యాప్ ఇండెక్స్ 15.45 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 28.59 శాతం మేర నష్టాలను పంచింది.లార్జ్‌క్యాప్ షేర్లు ఒకవైపు వెళుతుంటే మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు మరో దారిలో వెళుతుండడంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లంతా పరోక్షంగా ఎస్‌ఐపీల ద్వారా మార్కెట్‌లో భారీగా మదుపు చేసి ఉన్నారు. లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు 2017తో పోల్చితే తక్కువ రాబడులే వచ్చినప్పటికీ నష్టాలను చవిచూడలేదు. అయితే స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు మాత్రం చేతులు కాల్చుకున్నారు.


2019లో దేశీయ స్టాక్‌మార్కెట్లను అంతర్జాతీయ అంశాలే అధికంగా ప్రభావితం చేయనున్నాయి. ఇటీవల బ్యారెల్ క్రూడాయిల్ 85 డాలర్లకు చేరుకున్న తర్వాత 60 డాలర్ల దిగువకు తగ్గడం దేశీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత సానుకూలమైన అంశం. చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో వీటి ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి పరోక్షంగా దోహదం చేయనున్నది. తత్ఫలితంగా వడ్డీ రేట్లు కూడా అదుపులో ఉంటాయి. ఈ రెండు అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా లాభాల బాటన పయనించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు ఈ ఏడాది మే నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కరెన్సీ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చునన్న అంచనాలు వెలువడుతున్నాయి. అగ్ర దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొనివున్నా కాల క్రమేణా దాని ప్రభావం వర్దమాన దేశాల మార్కెట్ల మీద తగ్గుతూ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాధారణ ఎన్నికల నేపథ్యంలో విధాన నిర్ణయాల జాప్యం కారణాలతో విదేశీ సంస్థాగత ఇండియాతో సహా వర్దమాన దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటే స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయి మారకం విలువపై కూడా ప్రభావం పడుతుంది.


వడ్డీరేట్ల సంగతి?

2018లో మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌బ్యాంక్ ఆ ధోరణిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తుందా? అని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గత ఏడాది మొత్తమ్మీద దాదాపు 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ తగ్గించింది. గతంలో 3.9 నుంచి 4.5 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ దాన్ని ఇటీవల పరపతి విధాన సమీక్షా సమావేశంలో 2.7 నుంచి 3.2 శాతానికి తగ్గించింది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 3.8 శాతం నుంచి 4.2 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేసింది. దీంతో వడ్డీ రేట్లు అదుపులోనే ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.


ఎస్‌ఐపీల్లో మదుపు కొనసాగించవచ్చా?

గత ఏడాది ప్రతి నెలా ఎస్‌ఐపీల ద్వారా పెట్టుబడులు పెరగుతూ వచ్చాయి. ఒక్క నవంబర్‌లోనే రూ. 8,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఎస్‌ఐపీల ద్వారా వచ్చాయి. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో మాత్రం సగటున 12 నుంచి 20 శాతం పైగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. 2017లో వచ్చిన అసాధారణ రాబడుల తర్వాత 2018 నిరాశ నిస్పృహలనే మిగిల్చింది. చిన్న ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోనూ, మ్యూచువల్ ఫండ్లలోనూ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. అయితే భారీ కరెక్షన్ తర్వాత ఈ షేర్లలో రికవరీ వచ్చే అవకాశాలున్నాయి. అనేక క్వాలిటీ మిడ్‌క్యాప్ షేర్లలో అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి నుంచి పతనం పరిమితంగా ఉన్నందున గత ఏడాది కాలంగా భారీగా నష్టపోయిన ఈ షేర్లలో వ్యాల్యూయేషన్లు కూడా చవగ్గా కనిపిస్తున్నాయని ఎడిల్‌వైజ్ అసెట్‌మేనేజ్‌మెంట్ కంపెనీ సీఈఓ రాధిక గుప్తా అభిప్రాయపడుతున్నారు.


ఓ హెచ్చరిక

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో రిస్క్‌లు అధికంగా ఉంటాయి. మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులకు ఇవి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ఈ ఒడిదుడుకులను అర్థం చేసుకుని తట్టుకోగల ఇన్వెస్టర్లు మాత్రమే మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో మదుపు చేయడానికి ఆలోచించాలి. ఒకవేళ రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేకపోతే లార్జ్‌క్యాప్ ఫండ్లకు ఎక్కువగా నిధులను కేటాయించుకోవాలి. లార్జ్‌క్యాప్ ఫండ్లలో ఉండే వ్యయాలను కూడా అధిగమించాలంటే ఇండెక్స్ ఫండ్ల వైపు దృష్టి సారించడం మేలు. ప్రస్తుతం వివిధ మ్యూచువల్ ఫండ్లు స్కీములు రాబడులను ఇండెక్స్ రాబడులతో పోల్చి చూస్తున్నందున, అలాగే లార్జ్‌క్యాప్ నిర్వచనం కూడా మారిపోయినందున ఇండెక్స్ ఫండ్లతో పోటీ రాబడులను ఇవ్వడం మార్కెట్ క్యాప్ ఆధారిత ఫండ్లకు సాధ్యం కాకపోవచ్చు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు సమీకరణాలకు అనుగుణంగా మార్కెట్లలో ఒడిదుడుకులు పెరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ఎస్‌ఐపీలను ఆపకుండా ఉంటేనే సగటున యూనిట్ల విలువ తక్కువ ధరలో ఎక్కువ యూనిట్లు జమ అవడానికి అవకాశం ఉంటుంది.


వడ్డీ రేట్ల తగ్గుదల ఓ అవకాశం?

క్రమం తప్పకుండా కచ్చితమైన రాబడులు రావాలనుకునే వారికి ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పథకాలు అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే తగ్గుతున్న వడ్డీ రేట్లు రాబడిని హామీ పథకాలను ఎంచుకోవాల్సి వుంటుంది. షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, లాంగ్‌టర్మ్ బాండ్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఒకవేళ క్యాపిటల్ భద్రంగా ఉండాలనుకునే వారు ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు వంటి సాధనాలు ఎలాగూ ఉన్నాయి.


పసిడి మెరుపులు మెరిసేనా?

ఈక్విటీ, బాండ్ ఇన్వెస్టర్లు వారి వారి కారణాలచేత ఆయా సాధనాల్లో మదుపు చేస్తుంటారు. అయితే ఈ ఏడాదిలో బంగారం ధరలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయనున్నాయి. గత మూ డు నాలుగేండ్లుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు 2019లో కూడా లబ్ది పొందనున్నారు. 2018లో బంగారలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు 8.5 శాతం మేర రాబడిని అందుకోగలిగారు. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది బంగారం ధరలు పెరిగాయి. అయితే గత కొన్నేండ్లు స్తబ్దుగా ఉన్న కారణంగా బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు వైదొలిగారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న వార్తలు, గ్లోబల్ రాజకీయ పరిస్థితుల కారణంగా సురక్షిత సాధనంగా బంగారాన్ని ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా, ఇండియా దేశాల నుంచి వచ్చే డిమాండే బంగారం ధరలను నిర్దేశించనున్నది. ఏడాది ఔన్స్ బంగారం ధర 1,450 డాలర్లను అధిగమించవచ్చునని అంచనా వేస్తున్నారు. పది గ్రామల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 36,000 వరకూ చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. కనీసం ప్రతి ఒక్కరు 5 నుంచి 10 శాతం వరకు బంగారానికి కేటాయించడం ఈ ఏడాది ఉత్తమ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం అనిపించుకుంటుంది.మ్యూచువల్ ఫండ్లు చవగ్గా

2018 మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అనేక మార్పులకు గురైంది. మ్యూచువల్ ఫండ్ స్కీములు ఇన్వెస్టర్లు మరింత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వ్యయాలను తగ్గించేందుకు సెబీ అనేక చర్యలను చేపట్టింది. మొత్తం వ్యయాలకు సంబంధించి సెబీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈక్విటీ ఫండ్లు వ్యయాల కింద 2.25 శాతం ఇతర ఫండ్లు 2 శాతం మేర వ్యయాలను చార్జి చేయవచ్చు. దీంతో మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్టర్లు మరింత చవకగా లభించే అవకాశం ఏర్పడింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్లను చెలించడాన్ని కూడా సెబీ నిషేధించింది.
సుస్థిర ప్రభుత్వమే కీలకం

2019 తొలి ఆరునెలల కాలంలో స్టాక్ మార్కెట్‌కు తీవ్ర ఒడిదుడుకులు ఎదురుకావచ్చునని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ కార్వీ పేర్కొంది. 2019 సంవత్సరానికి ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం నివేదికను కార్వీ స్టాక్ బ్రోకింగ్ సీఈవో రాజీవ్ సింగ్ శుక్రవారం విడుదల చేశారు. సాధారణ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌లో హెచ్చుతగ్గులు గణనీయంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందరూ అనుకుంటున్నట్టుగా ఈసారి అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం అమెరికా నుంచి కాకుండా చైనా నుంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అయితే 2020 ద్వితీయార్థం వరకూ ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు లేవని అన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి 2020 ద్వితీయార్థం వరకు స్టాక్ మార్కెట్ మంచి ర్యాలీ వచ్చే అవకాశం వుందని చెప్పారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల ఇండియాకు స్వల్పకాలంలో లబ్ది చేకూరిన దీర్ఘకాలంలో గ్లోబల్ మాంద్య ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇండియా, బ్రెజిల్ దేశాల్లో యువ జనభా అధిక సంఖ్యలో ఉన్న కారణంగా వర్దమాన దేశాలన్నింటికన్నా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని అన్నారు.

ఈ ఏడాది కార్పొరేట్ రాబడుల్లో వృద్ధి పుంజుకుంటుందని ఆయన అంచనావేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఎస్‌ఐపీల ద్వారా మదుపు చేయడం శ్రేయస్కరమని అన్నారు. కేంద్రంలో సాధారణ ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే నిఫ్టీ 14,000 స్థాయికి చేరుకుంటుందని, అదే అస్థిర సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 9,000 స్థాయికి కూడా పతనం అయ్యే ప్రమాదం ఉందని రాజీవ్ సింగ్ అన్నారు. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ రంగాలపై తాము బుల్లిష్‌గా ఉన్నట్టు తెలిపారు. పోర్టుఫోలియో నిర్మాణంలో 70 శాతం నిధులను లార్జ్ క్యాప్ షేర్లకు కేటాయించాలని ఆయన సూచించారు. ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం నివేదికలో భాగంగా వెల్త్ మాగ్జిమైజర్, వ్యాల్యూ ఇన్వెస్ట్, డివిడెండ్ మాగ్జిమైజర్ అనే మూడు విభాగాల్లో పదేసి షేర్ల చొప్పున కార్వీ సిఫార్సు చేసింది. వెల్త్ మ్యాగ్జిమైజర్ విభాగంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, టాటామోటార్స్, యూపీఎల్, యెస్ బ్యాంక్ షేర్లను సిఫార్సు చేసింది. కాగా, వ్యాల్యూ ఇన్వెస్ట్‌లో భాగంగా బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫినోలెక్స్ కేబుల్స్, మినాన్‌బేరింగ్స్, విశాక ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఉన్నాయి.
rajiv-singh
రాజీవ్ సింగ్, సీఈవో, కార్వీ స్టాక్ బ్రోకింగ్

665
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles