పన్ను ఆదాకు ఈఎల్‌ఎస్‌ఎస్


Sat,January 19, 2019 01:39 AM

How-To-Grow
జనవరి వచ్చేసింది. పన్నులపై దృష్టి పెట్టాల్సిన సమయమూ ఆసన్నమైంది. పన్నుల ఆదా, మినహాయింపులకున్న అత్యుత్తమ మార్గాలు ఏంటా? అని మదుపరులు, పన్ను చెల్లింపుదారులు అన్వేషిస్తూ ఉంటారు. ఇప్పట్నుంచి ఆరా తీస్తేగానీ పకడ్బంది ప్రణాళికలు తయారు కావుమరి. అందుకే జనవరి-మార్చి త్రైమాసికంలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్) కోసం ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. వీటి ద్వారా పన్నుల నుంచి మినహాయింపు పొందే అవకాశాలుండటమే ఇందుకు ప్రధాన కారణం. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కోసం సాధారణంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌లనే చాలామంది ఎంచుకుంటారు. ఫలితంగా వీటికి ఆదరణ అమాంతం పెరిగిపోయింది.


ఈఎల్‌ఎస్‌ఎస్ అనేవి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పథకాలు. ఓ ఇండివిడ్యువల్ లేదా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కోసం ఉద్దేశించబడిన ఐటీ చట్టంలోని సెక్షన్ 80(సీ) కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదాకు ఈ పథకాలు అర్హనీయమైనవి. పెట్టుబడులు మొదలైన దగ్గర్నుంచి మూడేండ్ల కాలపరిమితి వరకు పన్ను ప్రోత్సాహకాలను అందుకోవచ్చు. ఇకపోతే జీవిత బీమా ప్రీమియం, ప్రావిడెంట్ ఫండ్ విరాళాలు (ఈపీఎఫ్/పీపీఎఫ్ రెండూ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ బాండ్లు), కిసాన్ వికాస్ పాత్ర వంటి చిన్నతరహా పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) కూడా పన్ను మినహాయింపులకు అర్హత ఉన్నవే. ఐదేండ్ల కాలపరిమితితో ఇవి ఉండాలి.


ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్/ఈపీఎఫ్) మినహా అన్ని ఇతర పెట్టుబడుల్లో వచ్చే లాభాలపై మెచ్చ్యూరిటీ లేదా ఉపసంహరణ సమయానికి పన్నులుంటాయి. అయినా.. ఈఎల్‌ఎస్‌ఎస్ అన్నింటిలోకెల్లా చక్కనిదని చెప్పవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడులు ఆకర్షణీయమైన ప్రతిఫలాల్ని అందిస్తాయి. స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులు కావడంతో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలుంటాయి. అయినప్పటికీ మిక్కిలి మదుపరులు వీటిని ఎంచుకుంటుండటాన్నిబట్టి ఇవి అందిస్తున్న లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడినా.. స్థూలంగా లాభాలనే పొందుతాయి. ఒకటి, రెండేండ్లు నష్టపోయినా దీర్ఘకాలంలో లాభిస్తాయి.


ఈఎల్‌ఎస్‌ఎస్‌లో భారతీయ మదుపరుల పెట్టుబడుల సరళని ఒక్కసారి పరిశీలిస్తే.. విచిత్ర ధోరణే కనిపిస్తుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తాయి. అంటే జనవరి-మార్చి వ్యవధిలో ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడులకు భారీ డిమాండ్ ఉంటుందన్నమాట. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుండటంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్-డిసెంబర్ వరకు ఆదాయాన్ని లెక్కించుకుని చివరి మూడు నెలల్లో పెట్టుబడులకు దిగుతారు. దాంతో ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడులకు జనవరి-మార్చిలో విపరీతమైన డిమాండ్ ఉంటున్నది.


భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఏఎంఎఫ్‌ఐ) వివరాల ప్రకారం ఏడాది మొత్తంగా 50 శాతానికిపైగా పెట్టుబడులు ఈఎల్‌ఎస్‌ఎస్‌లోకి వస్తుండగా, మార్చి నెల వాటానే 25 శాతంగా ఉంటున్నట్లు తేలింది. అయితే ఈ జోరు కొన్ని తప్పిదాలకూ దారితీస్తున్నది. పన్నుల నుంచి తప్పించుకోవాలనే ఆరాటంతో పెట్టుబడులకు సంబంధించి కనీస జాగ్రత్తల్నీ తీసుకోవడం లేదు. కనిపించిన షేర్లను కొనేస్తున్నారు. తోచిన విధంగా పెట్టుబడులకు వెళ్తున్నారు. దీనివల్ల లాభాలు ప్రభావితమవుతున్నాయి. మదుపరులు నష్టాలనూ చవిచూస్తున్నారు. ఫలితంగా మొత్తం ఆర్థిక లక్ష్యాలే దెబ్బతినే వీలుంటున్నది. ఇది ఎంతమాత్రం క్షేమదాయకం కాదు.


పన్ను మినహాయింపులను పొందడం ఎంతైతే అవసరమో.. పెట్టుబడుల ఎంపిక కూడా అంతే ప్రధానం. కాబట్టి మన కష్టార్జితాన్ని మదుపు చేసే సమయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి. సంపద సృష్టిలో ఇది ఎంతో ముఖ్యం కూడా. పెట్టుబడుల్లో తెలివైన నిర్ణయాలే అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. కనుక వ్యవస్థీకృత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్‌ఐపీ)ను అవలంభించడం అత్యుత్తమ మార్గం. మొత్తానికి ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడులు మదుపరులకు లాభదాయకమని చెప్పవచ్చు. అయితే మార్కెట్ ఆధారిత ఇబ్బందులుంటాయి కాబట్టి ఆందోళన చెందకుండా వివేకంతో వ్యవహరిస్తే చక్కని లాభాలు ఖాయం.
K-NARESH-KUMAR
కే నరేశ్ కుమార్
సహ వ్యవస్థాపకులు,వెలాసిటీ, వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
[email protected]

453
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles