రుణభారం.. తగ్గే విధానం


Sat,January 19, 2019 01:22 AM

క్విక్‌పే విధానంలో ఉన్న అతిపెద్ద సవాల్.. ఆరంభం నుంచి నెలసరి వాయిదాలు అధికంగా కట్టాల్సి రావడమే. ఇదే గనక అడ్డంకి కాకపోతే, రుణాన్ని త్వరగా చెల్లించాలని భావించేవారికి.. ఇదో మంచి ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు.
home-lone
గృహరుణం అనగానే ముందుగా మనలో చాలామంది లెక్కించేది నెలసరి వాయిదాల్నే. మనం తీసుకునే రుణమెంత? అందుకోసం ప్రతినెలా ఎంత మొత్తం కట్టాలనే విషయం చుట్టూ మన ఆలోచనలు తిరుగుతుంటాయి. అందుకే, యాక్సిస్ బ్యాంక్ కాస్త భిన్నమైన గృహరుణ పథకానికి శ్రీకారం చుట్టింది. అదే.. క్విక్ పే హోమ్ లోన్. ఈ పథకం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ఇది సాధారణ గృహరుణ పథకానికెంతో భిన్నమైనది. రుణగ్రహీతలు ప్రతినెల గృహరుణాన్ని స్థిరంగా కట్టాల్సిన అవసరముండదు. కాకపోతే, ఈ పథకాన్ని ఎంచుకుంటే, తొలుత కట్టే రుణమొత్తం అధికంగా ఉంటుంది. మనం చెల్లించే రుణంలో అసలు (ప్రిన్సిపల్) స్థిరంగానే ఉంటుంది. వడ్డీ మాత్రం మారుతుంది. రుణాన్ని కాస్త త్వరగా చెల్లించాలనుకునేవారు వడ్డీని అధికంగా చెల్లించేందుకు బ్యాంకు ఈ పథకంలో అంగీకరిస్తుంది. రుణగ్రహీతలు చేసే చెల్లింపుల్ని బట్టి ఈ మొత్తం తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు, సాధారణ గృహరుణం విధానంలో రూ.50 లక్షలు తీసుకుంటే, 9 శాతం వడ్డీ చొప్పున ఇరవై ఏండ్ల వ్యవధిని ఎంచుకుంటే.. మొదటి వాయిదా రూ.44,986 కట్టాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ రూపంలో దాదాపు రూ.37,500 చెల్లించాల్సి వస్తుంది. అంటే, కేవలం రూ.7,486 మాత్రమే అసలుగా బ్యాంకు లెక్కిస్తుంది. ఇక, రెండో వాయిదాను, మొదటి ఈఎంఐ కట్టిన తర్వాత తగ్గే మొత్తంపై లెక్కిస్తుంది. అదే, క్విక్‌పే లోన్ విషయానికొస్తే.. ముందే చెప్పుకున్నట్లు, నెలసరి వాయిదా మొత్తాలన్నీ ఒకేలా ఉండవు. రూ. 50 లక్షల రుణంపై మొదటి ఈఎంఐ రూ.58,333 చెల్లించాల్సి వస్తుంది.

ఇందులో వడ్డీ రూ.37,500 కాగా, అసలు రూ.20,833గా లెక్కిస్తారు. సాధారణ గృహరుణంపై అసలు కట్టింది రూ.7,486 మాత్రమేనని గుర్తుంచుకోండి. సాధారణ గృహరుణంలో ఇరవై ఏండ్లు చెల్లించేసరికి చివరికి రూ.1.08 కోట్లుగా లెక్కతేలుతుంది. అంటే, వడ్డీయే కేవలం రూ.58 లక్షలు అవుతుంది. అదే క్విక్‌పే విధానంలో అయితే చివరికి చెల్లించేది రూ.95.2 లక్షలే. వడ్డీ రూ.45.2 లక్షలే అవుతుంది. కాకపోతే, క్విక్‌పేలో వడ్డీ 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటుందని గుర్తుంచుకోండి. కొందరు కేవలం తొమ్మిది నుంచి పదేండ్లలో గృహరుణాన్ని చెల్లించడానికి ప్రయత్నిస్తుంటారు. ఏడాదికి రూ.3 లక్షలు చొప్పున ప్రీ పేమెంట్‌ను చేస్తే.. చివరికి రూ.86 లక్షలు అవుతుంది. అదే ఐదో ఏట నుంచి నాలుగు లక్షలు చొప్పున చెల్లిస్తే.. చివరికీ రూ. 83 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ముందస్తు చెల్లింపులపై రుసుము కట్టక్కర్లేదని గుర్తుంచుకోండి.

667
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles