ధర్మశాస్ర్తాలే మార్గదర్శకాలు!


Fri,January 11, 2019 01:21 AM

నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి తన ప్రవచనామృత ధారతో భక్తులకు తిరుప్పావై వ్రతంలో గోదాదేవి వెల్లడించిన పాశురాల సారాంశాన్ని అత్యంత అర్థవంతంగా, సవివరంగా అందిస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారంతో 26వ రోజుకు చేరుకున్నాయి. ఈనాటి కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు, ఆయన సతీమణి శ్రీకుమారి, వారి కుటుంబసభ్యులతోపాటు పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. కాగా,14వ తేదీన ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
SWAMY
వేదాల్లో మానవ జీవితానికి కావలసిన ఎన్నో విషయాలు చెప్పినట్లుగానే ఆండాళ్ తల్లి సర్వ ఉపనిషత్‌ల సారాన్ని మనకు పాశురాల ద్వారా అందించింది. సకల జీవులతోపాటు మానవజాతికి అవసరమైన విలువైన జ్ఞానాన్ని ప్రాచీనకాలం నాటి మహాఋషులు అందించారు. మానవులందరికీ మేలు చేయాలని తలచిన వారిలో ఋషులతోపాటు ఆళ్వారులు, ఆచార్యులు వంటి వారెందరోఉన్నారని చిన జీయర్ స్వామి తెలిపారు. అయితే, నాటి వేదాలనే వారు శాస్ర్తాలుగా పిలిచారని, వాటిలోని అంశాలన్నీ మనకు మేలు చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఈ శాస్ర్తాల్లో వారు ఆదేశించిన పలు అంశాలను మానవులు ఎవరైనా పాటించకపోతే ఆ మేరకు దండన కూడా ఉంటుందని స్వామి వారు గుర్తు చేశారు.


మానవ ధర్మంలో భాగంగా జీవితంలో మనుషులు ఎలా ప్రవర్తించాలి? ఏమి చేయాలి? అని చెబుతూనే అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కూడా శాస్ర్తాలు మనకు తెలిపాయని చిన జీయర్ స్వామి అన్నారు. ఐతే, వేదాంగాలు ఆరున్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుప్తం, జ్యోతిషం, కల్పం వంటి ఆరు రకాల అంగాలు వేదాలకు రక్షణ కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. వేదాల మూలాల్లో ఉన్న అంశాలను అందరికీ సమన్వయం చేసి తెలిపే గ్రంథాలను ఉప భ్రూహ్మణములు అంటారని, ఇవి మనకు వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని మరింత విపులంగా చెప్పాయని ఆయన తెలిపారు.

వేదాల్లో మనకు తెలియని అంశాలను మరింత వివరంగా చెప్పిన గ్రంథాలే ధర్మశాస్ర్తాలు. ఇలాంటివి చాలా వచ్చాయి. పరాశర స్మృతి, వ్యాసస్మృతి, దక్షస్మృతి ఇలా ఎవరెవరు చెప్పారో వారి పేర్లతో పలు గ్రంథాలు వచ్చాయని, ఇవే ధర్మశాస్ర్తాలని స్వామి వారు తెలిపారు. మానవులు అనుసరించదగిన అంశాలనే ఈ ధర్మశాస్ర్తాల ద్వారా మన పూర్వీకులు స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. ధర్మం అంటే ఆచరణ విధానం. ఆచరణను నియంత్రించేదే ధర్మం అని చిన జీయర్ స్వామి అన్నారు. ఈ ధర్మశాస్ర్తాలు మన ఆచరణా విధానాన్ని చెప్పడమే కాకుండా, ఎలా ఉండకూడదో కూడా తెలిపాయని స్వామివారు పేర్కొన్నారు.

అయితే, మానవజాతి చరిత్రను ఆనాటి మహర్షులు చరిత్రగానే మనకు అందించారు. ఆ గ్రంథాలనే ఇతిహాసాలు అని అంటున్నామని ఆయన అన్నారు. ఇతిహాసం అంటే గతంలో ఇలా జరిగిందని అర్థం. జరిగిన దానిని జరిగినట్లుగా, వరుస క్రమంలోనే ఋషులు మనకు అందించారని చిన జీయర్ స్వామి వెల్లడించారు. కొన్నింటికి ఆధారాలు లేకపోయినా, వాటిని వాస్తవాలుగా గుర్తించడానికి వీలవుతుందని కూడా అన్నారు. ఈ ఇతిహాసాలు కూడా ఇదే కోవకు చెందినవని, నేటి తరానికి అవి ఎన్నో జీవిత సత్యాలను వెల్లడించాయని స్వామి వారు వివరించారు. ఇతిహాసాలలో ఒకటి మనకు అత్యంత దగ్గరగా ఉండేది రామాయణం. కాగా, మరొకటి అత్యంత దూరమైంది, అదే భారతం. ఈ రెండింటినీ మన పూర్వీకులు నిష్పాక్షిక పంథాలోనే గ్రంథాల రూపంలో అందించారు. తమకు అనుకూలంగా గానీ, లేని వాటిని పెంచి చెప్పే ప్రయత్నం కానీ వాళ్లు చేయలేదని, ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా అందించారని చిన జీయర్ స్వామివారు చెప్పారు. ఇటువంటి చరిత్ర గ్రంథాలే రామాయణం, భారతం అని స్వామి వెల్లడించారు. రామాయణ, భారత కాలాలలో తప్పు, ఒప్పులకు తావు లేకుండా చరిత్రను అందించారని అన్నారు. వాల్మీకి ఇక్ష్వాకు వంశానికి చెందిన చరిత్రను రామాయణంలో, వ్యాసుడు కురువంశ చరిత్రను భారతంలో పొందుపరిచారని, జరిగింది జరిగినట్లుగానే వాటిని మానవాళికి అందించారని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.

ఆచరణతో ఎంతో మేలు!

SWAMY1
ధనుర్మాస మహోత్సవంలో ఇప్పటి వరకూ 25 పాశురాలను పూర్తి చేసుకుని 26వ పాశురాన్ని ప్రారంభించారు. ఆండాళ్ తల్లి రెండు ప్రబంధాలను రాసింది. వాటిలో ముప్పై పాశురాలు కలిగిన తిరుప్పావై ఒకటి, నాచ్చియార్ తిరుమోజీ రెండవది. రెండవ ప్రబంధంలో 143 పాశురాలు ఉన్నాయి. తిరుమల కొండపై వేంచేసిన వేంకటేశ్వరస్వామిని, సుందరబాహు పెరుమాళ్ శ్రీకృష్ణుని గురించి గోదాదేవి తన పాశురాల్లో సంబోధించింది. ఇప్పటి వరకూ 25 పాశురాల ద్వారా ఆండాళ్ తల్లి భగవంతుని దగ్గరకు వెళ్లడానికి ఏమేం చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలను తెలిపింది. చివరి ఐదు పాశురాల్లో భగవంతుని వద్ద ఏం మాట్లాడాలనే విషయాలను గోదాదేవి చెప్పింది. కూడారై పాశురంలో కూడారై అంటే పడని వాళ్లు అని, కూడని వాళ్లు అని కూడా అర్థం. కూడారై పాశురంలో గోదాదేవి అనేక విశేషాలను తెలిపింది. వాటిని మనందరం ఆచరించగలిగితే ఎంతో మేలు జరుగుతుందని చిన జీయర్ స్వామి వారు చెప్పారు.

-పసుపులేటి వెంకటేశ్వరరావు
-ఎం. విద్యాసాగర్

843
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles