భూతల స్వర్గం


Fri,January 11, 2019 01:17 AM

ప్రకృతి పరంగా ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలు,పముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడుతుంది నేపాల్. నేపాల్... మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. భారత దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది. హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్, భారత్, చైనా, పాకిస్థాన్లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉన్నది ఇక్కడే. మౌంట్‌ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు. పర్యాటకులకు భూతలస్వర్గమనే చెప్పాలి. ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రకృతి అందాల నేపాల్‌ను మనమూ దర్శిద్దాం రండి.
Nepal
ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. అక్కడి ప్రకృతి రమణీయత,హిందు, బౌద్ధ మతాలకు చెందిన సంప్రదాయాలు, ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆకాశానికి తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టుండే లోయలు, నదులు, సెలయేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, బౌద్ధులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఉన్న నేపాల్ పర్యాటకులకు నయనానందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యాటకమే.

ఆకట్టుకునే పోక్రా

నేపాల్‌లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతిచిన్న పట్టణం. కొండకోనల్లో కట్టిన ఇళ్లతో సుందరంగా ఉంటుంది. పట్టణానికి కొంచెం దూరంలో మంచు తో కప్పబడిన హిమాలయ పర్వతాలు కనువిందు చేస్తా యి. వెండి కొండల్లా ప్రకాశిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడడానికి విమాన సౌకర్యం ఉంది. సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత హిమాలయాల అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. అప్పుడు ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసిపోతాయి.
Davis-Falls

దేవి జలపాతం

ఆకట్టుకునే దేవి జలపాతం పోక్రాలోనే ఉంది. సాధారణంగా జలపాతాలను కింద నుండి పైకి చూస్తారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి కిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోకి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కు ఇనుప పట్టీలతో కంచె ఏర్పా టు చేశారు. దాని అంచున నిలబడి బావిలోకి చూడాలి. లోపల బావి దరిలోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాలా లోతున్న బావిలోకి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు.

రాజధాని నగరం ఖాఠ్మండ్

కొండల మధ్యన మైదాన ప్రాంతం లో ఖాఠ్మండ్ ఉంది. ఇది నేపాల్‌లో అతి పెద్ద పట్టణం, దేశ రాజధాని. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి. పాత జీపుల్లాంటి వాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. ఖాఠ్మండులో ఒక ఆకర్షణ అక్కడి జూద గృహాలు. వీటిని కాసినోలు అంటారు. మద్యం సేవిస్తూ, అర్ధనగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు. ఈ జూదం ఆడడానికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు.

రుద్రాక్షలకు నెలవు

ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందువల్ల రుద్రాక్షలు ఎక్కువగా, చాలా చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటారు. వాటిని పగుల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండినట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయలుంటుంది.
bhaktapur-ss-lt

మనోకామని దేవాలయం

పోక్రా నుండి ఖాఠ్మండుకు వెళ్లే దారిలో ఈ మనో కామని ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. నదిఆవల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై ఈ ఆలయం ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్‌వే ఉంది. అందు లో వెళుతుంటే కింద నది, లోయలు, కొండవాలులో పంటలు చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడి అమ్మవారు కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. ఇది చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతువధశాల ఉంది. ఇక్కడ తరచూ దేవి జంతుబలులు ఇస్తుంటారు.

పశుపతి నాథ్ ఆలయం

పశుపతినాథ్ శివాలయం చాల విశాలమైంది. గుడి గర్భాలయం చతురస్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారా లు కలిగి వుంటాయి. మధ్యలో వున్న శివ లింగానికి నాలు గు వైపుల నాలుగు ముఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగురు పండితులు వుండి పూజలు చేయిస్తుంటారు. ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం వుంటుంది. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది ఉంది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం ఉంది. అక్కడ ఎప్పుడూ శవాలు కాలుతూనే వుంటాయి.
big

మహావిష్ణు ఆలయం

శేషశయనునిపై పవళించినట్లున్న మహావిష్ణువు నల్లరాతి భారీ విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలి యాడుతున్నట్లుంటుంది. భక్తులు నీళ్లలోకి దిగి పూజలు చేస్తుంటారు. పురాతనమైన ఈ విగ్రహం చేతులలో శంఖం, చక్రం, గద ఆయుధాలున్నాయి. ఇది స్వయంభువని, బుద్ధుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక.

ముక్తినాథ ఆలయము

హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్యధామాలలో ముక్తినాథ ఆలయం 106 వది. పోక్రా నుండి ముక్తినాథ్ ఆలయానికి వెళ్లడానికి చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. ముక్తి నారాయణుడు స్వయంభువు. పద్మాసనంలో కూర్చున్న మూర్తి. నూట ఎనిమిది ధారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే నూట ఎనిమిది దివ్యధామాలు దర్శించుకున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం.

సూర్యోదయ వీక్షణ

ఖాఠ్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. కొండ ఎత్తుగా వున్నందున సుదూర ప్రాంతం చక్కగా కనబడుతుంది.ఆ సూర్యోదయ దృశ్యం చాలా అద్భుతంగా వుంటుంది.

ఎవరెస్టు శిఖరం

ఈ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైంది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-చైనా సరిహద్దులో ఉంది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరం, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచంలో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలులోనే ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ.

భక్తాపూర్

నేపాల్ దేశంలో భక్తాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ నగరంలో చూడవలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు ఉన్నాయి. పశుపతినాథ్ ఆలయాన్ని పోలిన దేవాలయాలు అనేకం వున్నాయి. కాని అన్నీ శివాలయాలే. రాజ దర్బారు హాలు చాలా గంభీరంగా వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ ఇల్లు లాగ వుంటుంది. ఈ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోపల ఎంతో సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు.
-మధుకర్ వైద్యుల

1692
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles