
భద్ర...ఒక వన్యప్రాణుల సంరక్షణాలయం. దీనినే భద్ర వైల్డ్‌లైఫ్ శాంక్చువరీ అని కూడా అంటారు. ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రదేశాన్ని పులుల సంరక్షణాలయంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ శాంక్చువరీని 1958లో స్ధాపించారు. అప్పటినుండి ఎంతో అభివృధ్ధి సాధించి నేటికి అది అధిక విస్తీర్ణంతో భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా పేరొందింది. దీని విస్తీర్ణం సుమారు 492 చ.కి.మీ.లు. చిక్కమగళూరు పట్టణానికి ఇది 38 కి.మీ. బెంగళూరు నగరానికి 282 కి. మీ. దూరంలో ఉంది. ఈ అటవీ ప్రాంతంలో వివిధ జాతుల మొక్కలు, జంతువులు కూడా ఉన్నాయి. మొక్కల జాతులు సుమారు 120 రకాల వరకు ఉంటాయి. వాటిలో టేకు, రోజ్‌వుడ్, బ్యాంబూ, జాక్ ఫ్రూట్ అంటే పనస వంటివి ప్రధానంగా కనపడతాయి. జింకలు, సాంబర్, మచ్చల జింకలు, చిరుతలు, లేళ్ళు, దుప్పులు, మలబార్ ఉడుతలు, ఏనుగులు కూడా ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. మొక్కలను తిని జీవించే జంతువులే కాక, మాంసాహారం తినే పులులు, అడవి కుక్కలు వంటివి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి.
నక్కలు, ఎలుగుబంట్లు, ముంగీసలు, చిరుత పిల్లులు కూడా ఉన్నాయి. భద్ర ప్రాంతం టైగర్ ప్రాజెక్ట్ ఒక భాగంగా 1998 లో ప్రకటించారు. 250 పక్షి జాతులతో పక్షుల ప్రియులకు స్వర్గంగా ఉంటుంది. ఎన్నో చిలుకలు, పావురాలు, వడ్రంగి పిట్టలు, మైనాలు, వివిధ రకాల అటవీ పక్షులు కనపడతాయి. ఎన్నో రకాల పాములు, మొసళ్ళు, నాగుపాములు, వైపర్లు, సాధారణ పాములు, ర్యాట్ స్నేక్స్, పిట్ వైపర్లు, వంటివి కూడా చూడవచ్చు. రంగు రంగుల సీతాకోక చిలుకలు కూడా ఆహ్లాదాన్నిస్తాయి. అటవీ శాఖ పర్యాటకులకు ట్రెక్కింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్, బర్డ్ వాచింగ్, బోటింగ్ సౌకర్యాలు ఏర్పరిచింది.