ఆయన చేతికి చిక్కి బోల్టులు పువ్వులవుతాయి. జీపు బానెట్ ఆఫీస్ టేబుల్ అవుతుంది. బైక్ చైన్ గిటారుగా మారిపోతుంది. తమ గ్యారెజ్లోని వ్యర్థాలతో అర్థవంతమైన రూపాలను ఆవిష్కరిస్తున్నారు తెలంగాణ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) ఎస్పీ రాజేశ్. పోలీస్‌శాఖలోని వాహనాల బాగోగులు చూసుకోవడం, కండిషన్లో ఉండేలా చూడటం ఆయన వృత్తిధర్మం. పాడైపోయిన వాహన విడిభాగాలతో కళాకృతులు, వివిధ వస్తువులు చేయడం ఆయన అభిరుచి.
హైదరాబాద్‌కు చెందిన రాజేశ్‌కు చిన్నప్పటి నుంచీ స్కూటర్లు, కార్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం ఆసక్తి. ఇంజిన్ల మీద ప్రేమతో ఇంటర్ అయ్యాక ఓ మెకానిక్ షాప్‌లో కొన్నాళ్లు పని నేర్చుకున్నారు. ఓ ఆథరైజ్డ్ షోరూం పెట్టాలని ప్రయత్నించారు. అది సాధ్యపడలేదు. స్కూటర్లోని టూస్ట్రోక్ ఇంజిన్, బైక్‌లోని ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కలగలిపి వేగం, సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను రూపొందించే ప్రయత్నమూ చేశారు. అదీ తక్కువ ఇంధనం ఖర్చుతో. ఆ ప్రాజెక్టు పేపర్‌కే పరిమితమైంది. అయినా నిరుత్సాహపడలేదు రాజేశ్. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ, ఆయనకు తృప్తి కలుగలేదు. ఉద్యోగం మానేసి పోటీ పరీక్షలు రాశారు. అలా 2009లో ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్‌గా కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో డీఎస్పీగా చేరారు. కొన్నాళ్లకు ఎస్పీగా పదోన్నతి పొందారు.
ఆ ఆలోచన వెనుక..
‘మా పోలీస్ పీటీఓలో పనిచేస్తున్న వారి సరాసరి వయసు యాభై నాలుగు. ఈ వయసులోనూ వాళ్లు ఉత్సాహంగా పనిచేయాలంటే ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నా. నా అభిరుచిని జోడించి స్క్రాప్‌ను పునర్వినియోగించేలా ప్రోత్సహించా. మొదట నేను పాత బోల్ట్‌లతో ఒక పువ్వు ఆకృతిని తయారు చేశాను. చాలా మంది అభినందించారు. ఇలా విభిన్నంగా చేస్తే అందరిలో ఉత్సాహం నింపొచ్చని దానిని కొనసాగించాను. మా ‘పీ అండ్ ఎల్’ ఐజీ సంజయ్‌జైన్ సార్ నాకు పెద్ద ప్రేరణగా నిలిచారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో మా పీటీఓలో ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఒక్కరూ పనితోపాటు క్రియేటివ్ వర్క్‌లో ఉండాలనుకున్నాం. ఖాళీ వేళల్లో స్క్రాప్‌తో మా కార్యాలయానికి పనికి వచ్చే వస్తువుల రూపకల్పన మొదలుపెట్టాం. జీపు బానెట్‌తో ఆఫీస్ టేబుల్, పాత ఆయిల్ ట్యాంకర్‌తో సోఫా, పెట్రోల్ బంక్ మెషిన్‌తో రిఫ్రిజిరేటర్, పాత స్కూటర్‌తో టేబుల్, పాడైపోయిన సైలెన్సర్లతో బైక్ ఆకృతి, టూవీలర్ చైన్లతో గిటార్.. ఇలా రకరకాల వస్తువులను తయారుచేశాం’ అని చెప్పుకొచ్చారు ఎస్పీ రాజేశ్. పోలీస్ వాహనాల రిపేర్లు, సర్వీసింగ్ పక్కాగా చేస్తూ ఇంధనం, డబ్బు ఆదా చేస్తున్నారు. సర్వీస్ సెంటర్‌ను కార్పొరేట్ స్థాయిలో నిర్వహిస్తున్నారన్న కితాబును అందుకున్నారు.
… నాగోజు సత్యనారాయణ