గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 29, 2021 , 02:27:23

అంతెత్తున అన్విత!

అంతెత్తున అన్విత!

జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చాలామందికి ఉంటుంది. అన్వితారెడ్డి మాత్రం అసలు సిసలు శిఖరాన్నే అధిరోహించాలని కలలు కన్నది. అదంతా చూసి, ‘ఆడపిల్లలకు ఇలాంటి కోరికలేమిటి?’ అని ఎత్తి పొడిచిన వాళ్లూ ఉన్నారు. అయితే చాలామందిలా, ఆమె తల్లిదండ్రులు కూతురి ఇష్టానికి అడ్డు చెప్పలేదు. ‘బిడ్డా, అడుగు ముందుకెయ్‌!’ అంటూ వెన్నుతట్టారు. ఉత్సాహానికి ప్రోత్సాహం తోడై ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా చేసింది. కొవిడ్‌ తర్వాత కిలిమంజారోను అధిరోహించిన మొదటి భారతీయురాలు తనే!

భువనగిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని యెర్రంబెల్లి అన్వితారెడ్డి స్వగ్రామం. అమ్మానాన్నలు.. పడమటి మధుసూదన్‌ రెడ్డి, చంద్రకళ అన్వితను చిన్నప్పటి నుంచీ అబ్బాయిలానే పెంచారు. పిల్లల చదువుల కోసమే వీరి కుటుంబం భువనగిరిలో స్థిరపడింది. ఇద్దరూ అమ్మాయిలే కావడంతో, మూడో తరగతి వరకూ అన్వితకు ప్యాంటూ చొక్కాలే వేసేవారు. స్కూల్‌ యూనిఫామ్‌ తప్పనిసరి అయిన తర్వాతే అమ్మాయిల డ్రస్సు అలవాటు చేశారు. చెల్లె అన్విత ఇచ్చిన ధైర్యంతోనే అక్క మన్వితారెడ్డిని పెద్ద చదువుల కోసం ఆస్ట్రేలియాకు పంపారు. అన్విత కొడుకంత కూతురు!  స్కూటీ మీద అమ్మను  అంగన్‌వాడీ కేంద్రం దగ్గర దింపేది. ట్రాక్టర్‌ తోలుతూ తండ్రికి  వ్యవసాయంలో సాయపడేది. 

ఓనమాలు అక్కడే

మలావత్‌ పూర్ణ, ఆనంద్‌లు పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ తీసుకున్న భువనగిరి రాక్‌ ైక్లెంబింగ్‌ స్కూల్‌లోనే అన్వితారెడ్డి కూడా ఆరోహణలో అక్షరాభ్యాసం చేసింది. ముందు నుంచీ తనకు ఎత్తులను అధిరోహించడమంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే రాక్‌ ైక్లెంబింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. తర్వాత, డార్జిలింగ్‌లోని హిమాలయ ఇన్‌స్టిట్యూట్‌లో కఠోర సాధన చేసింది. హిమాలయాల్లో ఒకటైన రీనాక్‌ (17వేల అడుగుల ఎత్తు) పర్వతం అంచులు చూసింది. ఆ తర్వాత, అడ్వాన్స్‌డ్‌ మానిటరింగ్‌ కోర్సు చేస్తున్న సమయంలో సిక్కింలోని పద్దెనిమిది వేల అడుగుల బీసీ రాయ్‌ మంచు పర్వతాన్ని అవలీలగా ఎక్కింది. అలా అని, సాధారణ చదువులకు దూరంగా ఏం లేదు. దూరవిద్యలో ఎంబీఏ చేసి, భువనగిరి రాక్‌ ైక్లెంబింగ్‌ స్కూల్‌లో శిక్షకురాలిగా చేరింది. ఉత్సాహవంతులకు పాఠాలు బోధిస్తూనే కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమైంది అనిత.

ఇదీ నా యాత్ర

భువనగిరి నుంచి జనవరి 15న హైదరాబాద్‌కు వచ్చాను. ఇక్కడి నుంచి ముంబైకి, అటు నుంచి విమానంలో టాంజానియా వెళ్లాం. ఆపైన 3 గంటలపాటు ప్రయాణించి జనవరి 17న.. ఉదయం 8 గంటలకు కిలిమంజారో హిల్‌స్టేషన్‌కు చేరుకున్నాం. తొలిరోజున 2,700 మీటర్లు పర్వతారోహణ చేసి మంథర్‌ హర్ట్‌కు చేరుకున్నాం. 18న 3,720మీటర్ల ఎత్తులో ఉన్న హారంభో హర్ట్‌కు చేరాం. 19, 20 తేదీలలో ఏకంగా 4,700మీటర్లు అధిరోహించి కీభోహర్ట్‌ను అందుకున్నాం. 20వ తేదీ రాత్రి 11 గంటల నుంచి అవిశ్రాంతంగా ట్రెక్కింగ్‌ చేసి, ఐదు రోజుల వ్యవధిలో 5,895 మీటర్లు (19,341 అడుగులు) ఎత్తున ఉన్న కిలిమంజారో శిఖరాన్ని అందుకున్నాం. ఆ సమయంలో నా అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఆరు రోజుల యాత్ర 

పర్వతారోహణ అంటేనే ప్రతికూల వాతావరణంలో సాగే సాహస యాత్ర. కనుచూపు మేర మంచు పర్వతాలు, లోతైన లోయలు, 130 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు,  మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రత, ఏ సమయంలోనైనా తుపాను చుట్టుముట్టవచ్చు, భూకంపం రావచ్చు. ఎవరికి తెలుసు? పక్క మలుపు దగ్గరే  ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఇలాంటి అనూహ్య వాతావరణంలో 10 కేజీల బరువును వీపున మోస్తూ శిఖరం వైపునకు అడుగులేసింది అన్వితారెడ్డి. అదీ, మొరాంగో మార్గంలోని అత్యంత కఠినమైన దారిని ఎంచుకున్నది. హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ తరుణ్‌జోషితో కలిసి సాగించిన ఈ సాహసయాత్రలో ఎన్నో అవరోధాలను అధిగమించి కిలిమంజారో శిఖరాన్ని ముద్దాడింది. సాధారణంగా, గమ్యానికి చేరుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతుంది. ఆ దారిమీద పట్టు ఉన్నవారికైనా ఆరు రోజులు తప్పదు. అన్విత మాత్రం ఐదు రోజుల్లోనే లక్ష్యాన్ని చేరుకొంది. ఆరు రోజుల వ్యవధిలోనే  మొత్తం యాత్రను పూర్తి చేసింది. “శిఖరాగ్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రభుత్వం ప్రోత్సహిస్తే పర్వతారోహకులంతా కలగనే లక్ష్యం..‘సెవెన్‌ సమ్మిట్స్‌'ను పూర్తి చేయాలన్నదే నా కల” అంటున్నది అన్వితారెడ్డి.

- గంజి ప్రదీప్‌ కుమార్‌ , నమస్తే తెలంగాణ, యాదాద్రి భువనగిరి

VIDEOS

logo