శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 22:49:24

అమ్మమ్మ వయసులో..అమ్మాస్‌ అప్పడాలతో..

అమ్మమ్మ వయసులో..అమ్మాస్‌ అప్పడాలతో..

అప్పడాల కరకరలు లేకపోతే.. సాంబారు ఘుమఘుమలన్నీ వృధానే! పెళ్లి విందు నుంచి పండుగ పూట భోజనాల వరకు అప్పడాలు లేని లోటు.. నోటికి చేటే! ఈ కబుర్లన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఓ కారణం లేకపోలేదు.

ముంబైలోని అంధేరిలో ఉండే కృష్ణవేణి మీనన్‌ ఓ సాధారణ గృహిణి. చిన్నప్పటి నుంచి తనకి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఉండేది. కానీ అనుకోని అవాంతరాలు! దాంతో తన ఆశ తీరనేలేదు. చూస్తుండగానే 60 వసంతాలు, గ్రీష్మాలు ఆమె జీవితాన్ని దాటేశాయి. అలాంటి సమయంలో ఓ ఆలోచన వచ్చింది. తను పాతికేళ్లుగా, బియ్యంతో అప్పడాలు చేస్తోంది. తన కుటుంబానికి అవంటే చాలా ఇష్టం. మార్కెట్లో ఎన్ని కంపెనీలు వచ్చినా... తన అప్పడాలంత రుచిగా ఉండవని ఆమె నమ్మకం.  పైగా వాటిలో రకరకాల కెమికల్స్‌ వాడుతారనే అపోహ.  అందుకే తానే స్వయంగా ఓ అప్పడాల కంపెనీ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించింది 

కృష్ణవేణి.  తన 60వ పుట్టినరోజు నాడు.. అమ్మాస్‌ పాపడ్‌ అంటూ ఓ బ్రాండ్‌ను ప్రారంభించింది. ‘నా వ్యాపారం కేవలం లాభాల కోసం కాదు, ఇలాంటి ఆహారం ఇప్పుడు పల్లెల్లో కూడా దొరకడం లేదు. మరుగున పడిపోతున్న ఓ మంచి సంప్రదాయ వంటకాన్ని మళ్లీ పరిచయం చేస్తున్నాననే తృప్తి చాలు’ అంటారు కృష్ణవేణి.

ఆమె సంకల్పం గొప్పది. ఆమె చెయ్యి అమృతహస్తం. అమ్మాస్‌ అప్పడాలు రుచి చూసిన వారంతా.. ఆహా! ఏమి రుచి అంటున్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారు. అప్పడాల గొప్పదనం గురించి నలుగురితో పంచుకుంటూ ఉచిత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ముంబైలో పుట్టిన అప్పడాలు గుజరాత్‌కు, రాజస్థాన్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయి. త్వరలోనే మనమూ వాటి రుచి చూస్తామేమో!


logo