సోమవారం 01 మార్చి 2021
Zindagi - Jan 24, 2021 , 00:36:23

హారర్‌ సినిమాలంటే భయం

హారర్‌ సినిమాలంటే భయం

 స్వీయ ప్రతిభతోనే చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందంటున్నది అమ్రిన్‌ ఖురేషి. నటనపై మక్కువతో, వెండితెర కలల్ని సాకారం చేసుకునేందుకు బాలీవుడ్‌కు ప్రయాణమైంది ఈ హైదరాబాదీ.  అభినయ పటిమతో రాజ్‌కుమార్‌ సంతోషి, టోనీ డిసౌజా లాంటి అగ్ర దర్శకుల మెప్పు పొంది.. వారి సినిమాల్లో కథానాయికగా అవకాశం దక్కించుకున్నది. తన కుటుంబం, వ్యక్తిగత జీవితం గురించి అమ్రిన్‌  చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..

హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. శివశివాని పబ్లిక్‌స్కూల్‌లో చదువుకున్నా. ముంబయిలోని అనుపమ్‌ఖేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నా. ప్రస్తుతం హిందీలో ‘బ్యాడ్‌ బాయ్‌'తో పాటు ‘జులాయి’ రీమేక్‌లో నటిస్తున్నా. ‘బ్యాడ్‌ బాయ్‌' చిత్రానికి రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన ‘సినిమా చూపిస్త మావ’ ఆధారంగా ఇది తెరకెక్కుతున్నది. చిత్రీకరణ తుదిదశకు వచ్చేసింది. ‘జులాయి’ రీమేక్‌కు టోనీ డిసౌజా డైరెక్టర్‌. ఈ నెలలోనే షూటింగ్‌ మొదలవుతున్నది. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నాడు. 

నేనెవరో చెప్పలేదు..

నాది సినీ నేపథ్యమున్న కుటుంబమే అయినా, నేనెవరో చెప్పకుండానే ‘బ్యాడ్‌ బాయ్‌' ఆడిషన్స్‌కు హాజరయ్యా. దాదాపు ఐదు రౌండ్ల వడపోత తర్వాత.. దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి  నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆడిషన్స్‌కు నాన్న సాజిద్‌ ఖురేషి సలహాతోనే వెళ్లాను. మంచి సినిమా, కథానాయికగా గుర్తింపును తెచ్చిపెడుతుందని డాడీ చెప్పడంతో.. నా వివరాల్ని చిత్ర బృందానికి పంపాను. ఆడిషన్‌ సమయంలో పెద్దపెద్ద్ద సంభాషణల్ని నాతో చెప్పించారు దర్శకుడు. ఎమోషనల్‌ సన్నివేశాలిచ్చి నటించి చూపమన్నారు. నా పెర్ఫార్మెన్స్‌ నచ్చి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు.

ప్రతిభే ముఖ్యం: నాన్న సాజిద్‌ ఖురేషి, తాతయ్య ఎమ్‌.ఐ ఖురేషిలకు సినీ పరిశ్రమతో సుదీర్ఘకాలంగా అనుబంధమున్నది. బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో పంపిణీదారులుగా, నిర్మాతలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించారు. బ్యాక్‌గ్రౌండ్‌తో కాకుండా నా సొంత ప్రతిభతో సినిమాల్లో నిలదొక్కుకోవాలన్నదే నా అభిలాష. నా నటన గురించి అందరూ మాట్లాడుకునే రోజు రావాలి. ఓ సినిమా రూపకల్పన వెనుక ఎంతోమంది కృషి, శ్రమ, సమయం దాగి ఉంటాయి. వారందరి కలనూ సాకారం చేసే బాధ్యత  నటీనటులపైనే ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి క్షణం దృష్టిలో పెట్టుకొని సెట్స్‌లో కష్టపడుతుంటా. నా దృష్టిలో కుటుంబ నేపథ్యం మొదటి సినిమా వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత రాణించాలంటే, ఎవరైనా సరే ప్రతిభను చాటుకోవాల్సిందే. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలనేది నా కల. తొలి సినిమాతోనే అది నెరవేరుతున్నది. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. 

ఎట్టకేలకు ఒప్పుకొన్నారు: బీబీఏ చదువుకునే సమయంలో భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనే సంశయాలతో చాలా రోజులు సంఘర్షణకు లోనయ్యాను. చిన్నతనం నుంచీ నటనపై ఉన్న ఆసక్తి కారణంగా సినిమాల్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నా. మా కుటుంబం సినిమాల్లోనే ఉన్నా, ఇండస్ట్రీ పట్ల బయట ప్రపంచంలో ఉన్న అపోహల కారణంగా, తొలుత అమ్మానాన్నలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ముందు చదువు పూర్తిచేయి. తర్వాత ఆలోచిద్దాం’ అన్నారు. కుటుంబసభ్యులను ఒప్పించడం చాలా కష్టమైంది. నటనపై నాకున్న అభిరుచిని అర్థంచేసుకుని, చివరకు అంగీకరించారు. జీవితంలో నేను వేసే ప్రతి అడుగులోనూ వారి ప్రోద్బలం ఉన్నది. ప్రతి పనిలో తప్పొప్పుల్ని కుటుంబ సభ్యుల నుంచే తెలుసుకుంటాను. మా ఇంట్లోనే నాకు పెద్ద విమర్శకులు ఉన్నారు. వారితో పోలిస్తే బయటి నుంచి వచ్చే విమర్శలు నన్ను పెద్దగా భయపెట్టవని అనుకుంటున్నా. తనకున్న అనుభవంతో నాన్న చాలా సలహాలు ఇస్తుంటారు. తన కెరీర్‌లో ఎత్తుపల్లాల్ని వివరిస్తూ ఎలా ముందడుగు వేయాలో చెబుతుంటారు. 

తొలిక్షణాల్ని మర్చిపోలేను: తొలిరోజు కెమెరా ముందుకొచ్చిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. మేకప్‌ పూర్తిచేసుకొని తొలి షాట్‌ కోసం వ్యానిటీ వ్యాన్‌లో ఎదురుచూస్తున్నాను. మాంటేజ్‌ షాట్‌ను నాపై చిత్రీకరించారు. చేయగలనో లేదో అనుకున్నా. భయంతోనే షాట్‌ పూరి చేశాను. ఎమోషన్స్‌ పండించడానికి తొలినాళ్లలో చాలా టేక్స్‌ తీసుకునేదాన్ని. ఇప్పుడు సింగిల్‌ టేక్‌లో చేస్తున్నా. 

సాయిపల్లవిలా పేరు తెచ్చుకోవాలి: తెలుగులో సాయిపల్లవి, సమంతలను అభిమానిస్తాను. ఆ ఇద్దరూ కథలను ఎంచుకొనే తీరు, స్క్రీన్‌పై కనిపించే విధానం నచ్చుతాయి. నటన, డ్యాన్స్‌లో సహజత్వం కనబరుస్తుంటారు. వారిలా పేరుతెచ్చుకోవాలన్నదే నా కోరిక. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే భేదాలు నాకు లేవు. భాష పట్టింపులు లేకుండా కథాబలమున్న మంచి సినిమాలు చేయాలన్నదే నా అభిమతం. తెలుగులో కొత్త కథలు వింటున్నా. విభిన్నమైన సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నా.  

రొమాంటిక్‌ కామెడీ ఇష్టం

చిన్నతనం నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. చిరంజీవి, నాగార్జునతో పాటు అందరి సినిమాలూ  చూసేదాన్ని. తెలుగులో అందరు హీరోలూ, దర్శకులతో పనిచేయాలనుంది. సినిమాలు, పాత్రల పరంగా ఉన్న హద్దులన్నీ తొలగిపోతున్నాయి. వినూత్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు అద్భుత విజయం అందుకుంటున్నాయి. కథ నచ్చితే చిన్న సినిమాల్లో నటించడానికీ సిద్ధంగా ఉన్నా. వ్యక్తిగతంగా రొమాంటిక్‌ కామెడీ సినిమాలంటే ఇష్టం. హారర్‌ చిత్రాలంటే భయం. సినిమా చూసిన రోజు ఒంటరిగా నిద్ర పోవాలంటే వణికిపోతాను. 

తాతయ్య కల..

సిల్వర్‌ స్క్రీన్‌పై నన్ను నేను చూసుకోవాలనే కల చిన్నతనంలోనే మొదలైంది. నేను సినిమాల్లో నటించాలనే కోరిక మా నాయనమ్మకూ, తాతయ్యకూ ఉండేది. ఎప్పుడూ నాతో అదే మాట చెబుతుండేవారు. అలా తెలియకుండానే సినిమాల పట్ల ఇష్టం మొదలైంది. ఎప్పుడూ ఆ విషయాన్ని సీరి

యస్‌గా తీసుకోలేదు. కానీ నటనలో ఉండే ఆనందం, గొప్పతనం ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.

VIDEOS

logo