నర్మద శపథం

ఊరికిచ్చిన మాట పొలిమేర దాటగానే మర్చిపోతున్న రోజులివి. ఎన్నికల హామీలు పోలింగ్ పూర్తవ్వగానే గాలిలో కలిసిపోతున్న కాలమిది. కానీ, ఆ యువతి ఇచ్చిన మాటకు కట్టుబడి అత్తారింటికి దారి తెలిసినా పుట్టింట్లోనే ఉండిపోయింది. ఎన్నికల వేళ ఊరి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి భర్తను ఒప్పించింది. పుట్టింటికి తరలి వచ్చేసింది. తన శపథాన్ని నిలబెట్టుకుంటూనే రెండేండ్ల పాలనలో ఊరి ప్రజల మెప్పు పొందింది. మరో మూడేండ్ల వరకు ఊళ్లోనే ఉంటానని చెబుతున్నది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు సర్పంచ్ సిరిపురం నర్మద.
2019 సర్పంచ్ ఎన్నికలు.. అమ్మనబోలులో పోటీ హోరాహోరీగా సాగుతున్నది. ఆ ఎన్నికల్లో నర్మద సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. అప్పుడు ఆమె వయసు 21 ఏండ్లు. ప్రత్యర్థులకు ఓ అస్త్రం దొరికింది. ‘ఆమెకు ఓటేసి గెలిపిస్తే! ఆడపిల్ల ఏం చేయగలదు? రేపు పెండ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే పరిస్థితి ఏమిటి?’ ఇలా ప్రచారం మొదలుపెట్టారు. ప్రత్యర్థుల సవాలుకు సిసలైన జవాబు ఇచ్చింది నర్మద. తనకు పెండ్లయినా, సర్పంచ్‌గా తన పదవీ కాలం ముగిసే వరకు ఊళ్లోనే ఉంటానని శపథం చేసింది. ఆమె మాటల్లో పట్టుదల, కండ్లలో విశ్వాసం అమ్మనబోలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. మంచి మెజార్టీతో నర్మదను సర్పంచ్‌గా గెలిపించుకున్నారు.
భర్తను ఒప్పించి..
సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి ఊరి సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నది నర్మద. రెండేండ్ల పాలనలో రూ.50 లక్షలు విలువ చేసే అభివృద్ధి పనులను చేపట్టి ఊరందరి చేతా ‘శభాష్!’ అనిపించుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గత డిసెంబర్ 10న నర్మద పెండ్లయింది. అమ్మనబోలు సమీపంలోని చందపల్లి గ్రామానికి చెందిన రమేష్‌తో ఆమె వివాహమైంది. పెండ్లికి ముందే ఊరికిచ్చిన మాట గురించి అత్తగారికి, కాబోయే భర్తకు చెప్పింది నర్మద. అదే మాటకు కట్టుబడి మూడేండ్ల తర్వాతే కాపురానికి చందపల్లికి వస్తానంది. వారు కూడా ఒప్పుకోవడంతో.. ఘనంగా పెండ్లి జరిగింది. ఆ తర్వాత కూడా నర్మద అమ్మనబోలులోనే ఉంటున్నది. ‘ప్రజలు విశ్వాసంతో ఊరిని నాకు అప్పగించారు.. మరో మూడేండ్లు ఇక్కడే ఉండి నా బాధ్యతలు నిర్వర్తిస్తాన’ని చెబుతున్నది నర్మద.
ఉత్తమ సేవలు
బీఎస్సీ చదివిన నర్మద 2017లో హైదరాబాద్‌లో ఈ కామర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరింది. ఆమె తండ్రి సిరిపురం భాస్కర్ స్థానిక నేత. 2019 పంచాయతీ ఎన్నికల్లో అమ్మనబోలు జనరల్‌కు రిజర్వ్ అయింది. భాస్కర్ బరిలో నిలువాలనుకున్నా.. సంతానం ముగ్గురు కావడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. గ్రామస్తులు సూచించడంతో కూతురు నర్మదను అభ్యర్థిగా నిలబెట్టారు భాస్కర్. ఎన్నికల్లో 316 ఓట్ల మెజార్టీ సాధించి సర్పంచ్‌గా ఎన్నికైంది నర్మద. రెండేండ్ల పాలనతో తనేంటో నిరూపించుకుంది. పంచాయతీ విధులు, నిధులు, ప్రభుత్వ పథకాల గురించి సమగ్రంగా తెలుసుకొని వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని గ్రామంలో విజయవంతంగా చేపట్టింది. పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులు మొదలుకొని పింఛన్ల పంపిణీ వరకు ప్రతి పనినీ పర్యవేక్షిస్తుంటుంది. ఊళ్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణం స్పందించి పరిష్కరిస్తున్నది. నర్మద పనితీరుతో పార్టీలకతీతంగా ఆమెకు సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. యువతను సంఘటితం చేస్తూ పల్లె ప్రగతిలో అందరినీ భాగస్వాములను చేస్తున్నది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీ అవార్డును కూడా అందుకుంది నర్మద.
రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా
చిన్న వయసులోనే ఇంతటి బాధ్యతను నిర్వర్తించే అదృష్టం అందరికీ రాదు. మొదట్లో సర్పంచ్‌గా పోటీకి భయపడ్డా. అయితే ప్రజలంతా అండగా నిలువడంతో ముందడుగు వేశా. ఊరి జనం నన్ను నమ్మి సర్పంచ్‌గా అవకాశం ఇచ్చారు. అందరి సహకారంతో మా గ్రామాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తా.
సిరిపురం నర్మద, సర్పంచ్
...గంజి ప్రదీప్‌కుమార్, యాదాద్రి భువనగిరి
తాజావార్తలు
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!
- యంగ్ హీరోకు అల్లు అర్జున్ సపోర్ట్.. !
- లక్షా 90 వేల కోట్ల డాలర్ల కోవిడ్ ప్యాకేజీకి ఆమోదం