బుధవారం 20 జనవరి 2021
Zindagi - Nov 24, 2020 , 00:13:12

అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా..

అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా..

అక్షరాలు నేర్చిన అమ్మ ఉంటే... ఆ ఇంట్లో విజ్ఞానపు వెలుగులు ప్రసరిస్తాయి.ఆ అమ్మలంతా చేరి అక్షర యజ్ఞం చేస్తే.. సమాజం చైతన్యవంతం అవుతుంది.ఇదే లక్ష్యంతో రూపుదిద్దుకున్నది.. అక్షరయాన్‌.40 మంది సభ్యుల తెలుగు రచయిత్రుల సమూహం ఏడాదిన్నర తిరిగేసరికి 500 కలాలతో పరిమళిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోని తెలుగు రచయిత్రులకూ వేదికగా నిలుస్తున్నది. అక్షరయాన్‌ అమ్మలంతా.. అందమైన సమాజ నిర్మాణానికి తమ రచనలతో పునాదులు వేస్తున్నారు.

సమాజం బాధను  బలవంతంగా తమలో ఇముడ్చుకోలేదు వీళ్లంతా. గుండెల్లోని ఆవేదనను సమాజంపై రుద్దాలనీ అనుకోలేదు. వెర్రితలలు వేస్తున్న నాగరికతకు కాయకల్ప చికిత్స చేయాలనుకున్నారు. అక్షరాన్నే ఆయుధంగా ఎంచుకున్నారు. పదునైన వాక్యాలతో ప్రశ్నిస్తున్నారు. తమదైన శైలిలో నిలదీస్తున్నారు. అత్యాచార వార్తలు లేని దినపత్రిక చూడాలని..మహిళలు ఆకాశమంత విస్తరించాలని.. అంటూ సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను ఎత్తిచూపుతున్నారు. కనిపించని దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తూ.. కనిపెంచిన అమ్మానాన్నలను వృద్ధాశ్రమాలకు తరలించే కొడుకుల దౌర్భాగ్యాన్ని .. తూర్పారబడుతున్నారు. చెబుతూ పోతే.. ఎన్నో ప్రశ్నలూ, ఆవేదనలూ, అంతర్మథనాలూ! సమాజంలోని దురాగతాలు, కుటుంబ బంధాలు, జీవన చిత్రాలు.. ఇవే వీరి కవితా వస్తువులు. జనచైతన్యమే అక్షరయాన్‌ లక్ష్యం. 2019లో తెలుగు మహిళా రచయిత్రుల ఫోరం ఏర్పాటైంది. ప్రముఖ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి నేతృత్వంలో ఈ సంఘం ప్రారంభమైంది. అనతికాలంలోనే వినూత్న సాహితీ, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. ఏడాదిన్నరలో ఫోరం సభ్యుల సంఖ్య 500కు చేరింది. సమాజంలో మార్పు సాధించాలనే సంకల్పంతో ఈ కలాలన్నీ ఒక్కచోట చేరాయి.  ఓవైపు సాహితీ సేవ చేస్తూనే, ఆడవారికి అండగా నిలిచేలా అనేక సామాజిక కార్యక్రమాలనూ చేపడుతున్నారు.

షీ టీమ్స్‌ గొప్పదనాన్ని... 

మహిళలు, బాలికలపై అకృత్యాలను అరికట్టేందుకు షీ టీమ్స్‌.. అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. అతివలకు రక్షణ కవచంగా నిలుస్తున్న షీటీమ్స్‌ గొప్పదనాన్ని చాటుతూ 76 మంది రచయిత్రులు రాసిన కవితలను తెలంగాణ పోలీస్‌ మహిళా సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో  హితై‘షి’ పేరుతో ముద్రించారు. అందులోని  ఉత్తమ రచనలకు బహమతులు ప్రదానం చేశారు. అమ్మలా అలెర్ట్‌ చేస్తుంది.. సోదరిలా వార్నింగ్‌ ఇస్తుంది.. గురువులా కౌన్సెలింగ్‌ చేస్తుంది.. పెద్దలా కుటుంబానికి నివేదిస్తుంది..  ప్రవర్తనలో పరివర్తనకు తెరలు తీస్తుంది.. అంటూ షీ టీమ్స్‌ పనితీరుకు అద్దం పట్టిన రచనలు అందులో అనేకం. అంతేకాదు, దేశంలో ఎక్కడాలేని  విధంగా.. తెలంగాణ వ్యవసాయ శాఖ రచయిత్రులకు చక్కని అవకాశం ఇచ్చింది. విత్తనంపై సాహితీ సదస్సు నిర్వహించింది. విత్తనోత్పత్తి,  ధ్రువీకరణ సంస్థ సహకారంతో  చేపట్టిన ఈ సాహితీ సదస్సులో వెల్లువెత్తిన కవితలను, కథలను ‘బీజ స్వరాలు’ పేరిట పుస్తక రూపంలో వెలువరించారు. “నేను విత్తనాన్ని..  మెత్తని మట్టిలో తేమను గ్రహిస్తూ.. సూర్యుని వెచ్చదనంతో.. రెక్కలు విచ్చుకున్న లేలేత అంకురాన్ని.. మానవత్వపు తడిని పీల్చుకుని... భవిష్యత్తుగా మారేందుకు.. బయటి ప్రపంచంలోకి ఏతెంచిన మొలకని...” అంటూ లోతైన భావాలను పలికించారు. 

సమాజహితమే లక్ష్యంగా..

అక్షరయాన్‌ ప్రారంభ సమావేశం రవీంద్రభారతిలో జరిగింది. 2019 జూలై 14న మొయినాబాద్‌లో 40 మంది రచయిత్రులతో తొలి సాహితీ సదస్సు జరుపుకొన్నది. తమ రచనల పట్ల ఎటువంటి నిబద్ధత చూపించాలి; వస్తువు, శిల్ప నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తదితర విషయాల మీద సమష్టి ప్రణాళికను రూపొందించుకున్నారు. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఓ కార్యక్రమం చేపట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే, ‘పసి మొగ్గలు’ పేరిట 20 మంది రచయిత్రులతో ఆకాశవాణి రేడియో ద్వారా కవి సమ్మేళనం నిర్వహించారు. 

విమర్శలు పట్టించుకోకుండా..!

అక్షరయాన్‌ వేదికను ప్రారంభించిన సందర్భంలో ‘నలుగురు ఆడవాళ్లు ఒక్క చోట కలిసి ఉండలేరు, ఇది ఆడవాళ్ల మేళం, పట్టు చీరల బ్యాచ్‌, వృద్ధ నారీమణుల బృందం..’ ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇవేవీ పట్టించుకోలేదు వాళ్లు. రేపటి సమాజం కోసం తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలనుకున్నారు. సామాజిక మార్పు దిశగా ఈ ఏడాదిన్నరగా అనేక సాహితీ సదస్సులు నిర్వహించారు.  అనేక రచనలు చేశారు. చక్కని కవితలు అల్లారు. 2019 అక్టోబరు 17న హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ విమెన్‌ వింగ్‌ కార్యాలయంలో ‘భరోసా’ ద్వారా అక్షరయాన్‌ రచయిత్రులు అత్యాచార బాధితులతో సమావేశమై  వేదనలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి పరిస్థితికి చలించిన అమ్మలంతా అక్కడికక్కడే బాధిత మహిళలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. సొంత డబ్బుతో కుట్టుమిషిన్లు ఇప్పించారు. కుట్టుపనిలో వారికి తర్ఫీదునిప్పించే ఏర్పాట్లూ చేశారు. కరోనా వ్యాప్తి సమయంలో ప్రజలను జాగృతం చేసేందుకు జూమ్‌ ద్వారా సాహితీ సదస్సులు చేపట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ రచనలను సాహితీ ప్రియులకు చేరవేసేందుకూ  కృషి చేశారు. ఇలా సందర్భోచితంగా స్పందిస్తూ సాహితీ క్షేత్రంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది అక్షరయాన్‌ .

భద్రమైనసమాజంకోసం


పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా అక్షరయాన్‌ ఏర్పాటు చేశాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో జిల్లాల వారీగా కమిటీలు.. ఇతర రాష్ర్టాలు, విదేశాలకు సంబంధించి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశాం.  ఎంతోమంది ఆసక్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మా విధానాలు నచ్చి స్వచ్ఛందంగా  చేరుతున్నారు. మహిళలు అభద్రతకు లోనుకాని సమాజాన్ని తీర్చిదిద్దాలన్నదే అక్షరయాన్‌ లక్ష్యం.

 అయినంపూడి శ్రీలక్ష్మి, అక్షరయాన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు

అక్షర సైనికులు..


మహిళల రచనా వ్యాసంగాన్ని సుసంపన్నం చేసే లక్ష్యంతో అక్షరయాన్‌ ఏర్పాటైంది. అనేక సామాజిక సమస్యలపై తమ కలాలను సంధిస్తూ, గళాలను వినిపిస్తున్నారు. అక్షరయాన్‌ సైనికులు ముఖ్యంగా బాలికలు, మహిళల తరఫున పోరాటం చేస్తున్నారు. సభ్యుల రచనలతో అనేక పుస్తకాలు వెలువరించాం.

వాణి దేవులపల్లి, అక్షరయాన్‌ ఉపాధ్యక్షురాలు 

ప్రపంచ వ్యాప్తంగా..


మాది మానవతా వాదం. పెన్ను పట్టి రాయడమే కాదు.. వినూత్న ఆలోచనలతో మన చుట్టూ ఉన్నవారికి సంతోషం కలిగించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. రెండు రాష్ర్టాలతోపాటు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు రచయిత్రులను ఒకే వేదిక మీదకు తెచ్చి, వారి  వివరాలతో ఒక డైరీ రూపొందించాలని భావిస్తున్నాం. ఆడవారిలో ధైరాన్ని పెంచి.. ‘జీవితం ఎంతో ఉంది.. తాత్కాలిక సమస్యలను ధైర్యంగా అధిగమించాలి’ అన్న సందేశంతో.. అక్షరయాన్‌ను నిర్వహిస్తున్నాం. 

 రవీనా చవాన్‌ (పుణె), అక్షరయాన్‌ ఉపకార్యదర్శి 

... వరకవుల దుర్వాసరాజు


logo