పసిపిల్లలకు బొమ్మలంటే ఆకర్షణ, ఆటలంటే ఆకర్షణ, చాక్లెట్లూ బిస్కెట్ల పట్ల్ల ఆకర్షణ. కానీ, చిన్నారి ఆకర్షణ మాత్రం సేవాపథం వైపు ఆకర్షితురాలైంది. బొమ్మల పుస్తకాలు చదవాల్సినవయసులో, క్యాన్సర్ దవాఖానలో ఏకంగా ఓ లైబ్రరీ ఏర్పాటుచేసింది. తన సేవా కార్యక్రమాలతో ప్రధాని మోదీని, మంత్రి కేటీఆర్‌ను కూడా మెప్పించింది ఆకర్షణ.
ఆకర్షణ.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నది. తండ్రి సతీశ్ వైద్యపరికరాల సరఫరా కంపెనీలో పనిచేస్తున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి తమ కంపెనీ నుంచి ఎన్నో పరికరాలు సరఫరా చేశారు. ఆ అనుబంధం కొద్దీ లాక్డౌన్ సమయంలో క్యాన్సర్ ఆసుపత్రి రోగులకు తమ అపార్ట్మెంట్ తరఫున భోజనాలు అందించారు. ఆకర్షణ కూడా తండ్రి వెంట వెళ్లి సాయం చేసేది. ఆ ఉత్సాహాన్ని చూసి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డా.ఎన్ జయలత కూడా ఆ చిన్నారిని ప్రోత్సహించారు. ఆకర్షణ తరచూ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న చిన్నారులతో మాట్లాడేది. ఓదార్చేది. ధైర్యం చెప్పేది. డ్రాయింగ్ బుక్స్, కలర్స్, స్టోరీ బుక్స్ ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుందని ఆ పిల్లలు మాటల సందర్భంలో ఆకర్షణతో చెప్పారు. ఆ మాట వినగానే తనకో ఆలోచన వచ్చింది. స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కలవారు.. ఇలా అందరి దగ్గరనుంచీ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పుస్తకాలు సేకరించింది. మొత్తం 1036 పుస్తకాలతో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ స్వాతిలక్రా ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ‘నేనిచ్చిన పుస్తకాలను చదివి, వాళ్లంతా థ్యాంక్స్ చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది’ అని సంబురంగా చెబుతుంది ఆకర్షణ.
ప్రధాని లేఖ..
ఏడేండ్ల ప్రాయం నుంచీ ఏదో ఓ సేవా కార్యక్రమం చేపట్టడం ఆకర్షణకు అలవాటే. తన పుట్టిన రోజున అనాథాశ్రమంలో పేదలకు అన్నదానం చేస్తుంది. ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న డబ్బంతా బాధితులకు పంపుతుంది. ఆ మధ్య హైదరాబాద్‌లో వరదలు బీభత్సం సృష్టించినప్పుడు తన సేవింగ్స్లోంచి రెండువేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపింది. చిన్నారి ఆకర్షణలోని స్పందించే గుణాన్ని మంత్రి కేటీఆర్ కూడా అభినందించారు. కేరళ, అసోం వరదల సమయంలోనూ స్వచ్ఛందంగా విరాళాలు పంపింది ఆకర్షణ. ‘గత ఏడాది నా బర్త్‌డే రోజున సెలబ్రేషన్స్ వద్దని చెప్పాను. ఆ డబ్బుతో వంద ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు కొని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సార్‌కు ఇచ్చాను. ఎందుకంటే, పోలీసులు ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా మనకెంతో సేవ చేస్తున్నారు. మనం కూడా ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనిపించింది’ అని చెబుతుంది ఆకర్షణ. తమిళనాడు పోలీసులకు సైతం మాస్క్‌లు, శానిటైజర్లు పంపింది. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఆకర్షణను స్వయంగా తన ఆఫీస్‌కు పిలిపించుకుని అభినందించారు కూడా.
హైదరాబాద్ వరదల సమయంలో ఆకర్షణ అందించిన సాయానికి సంతోషించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్వయంగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ‘రెడ్‌క్రాస్ వలంటీర్‌గా పనిచేయాలని ఉంది’అని ఆకర్షణ చెప్పడంతో, ‘నీ ఆలోచన ఎంతో గొప్పది. నువ్వు ఎనిమిదో తరగతికి వచ్చాక, జూనియర్ రెడ్‌క్రాస్ వలంటీర్‌గా నేనే చేర్చుకుంటాను. ఇలాగే సమాజ సేవ కొనసాగించు’ అని ఉత్సాహం నింపారు గవర్నర్. హైదరాబాద్‌లో నిర్వహించిన అబ్దుల్‌కలాం స్మారకోపన్యాసంలో ఆకర్షణ మాట్లాడిన తీరుకు మెచ్చి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ‘నేను గత ఏడాది చేసిన సోషల్ సర్వీసెస్ బాగున్నాయంటూ ప్రధాని మోదీగారు నాకు లెటర్ రాశారు. స్పేస్ సైంటిస్ట్ కావాలన్నది నా లక్ష్యం’ అంటున్నది అకర్షణ. ఇప్పటికే, అంతరిక్షం కంటే ఓ మెట్టు పైనున్న ఉన్న సేవా ప్రపంచపు పౌరసత్వాన్ని సంపాదించుకుంది చిన్నారి ఆకర్షణ!
కలాం పెట్టిన పేరు
ఆకర్షణ తండ్రి సతీశ్ లీడ్ ఇండియా- 2020 ప్రాజెక్టులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో పనిచేశారు. వాస్తవానికి ఆకర్షణకు ‘నిషా’ అని పేరు పెట్టాలనుకున్నారు సతీష్ దంపతులు. కానీ, ఆసుపత్రిలో ఉన్న పసిపాపను చూసేందుకు వచ్చిన అబ్దుల్‌కలాం ‘ఈ చిన్నారి అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆకర్షణ అని పేరు పెడుతున్నా’ అని చెప్పారు. దీంతో ఆ పేరే ఖరారు అయ్యింది. ఆత్మీయతతో కూడిన పలకరింపుతో, ముత్యాల్లాంటి చేతిరాతతో తాను రాసే ఉత్తరాలకు ప్రధాన మంత్రి మోదీ మొదలు పలువురు సీఎంలు, మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు జవాబులు ఇస్తున్నారు. ఆకర్షణ సేవాభావం పట్ల సంతోషాన్ని ప్రకటిస్తున్నారు.
-నాగోజు సత్యనారాయణ
-జి.భాస్కర్