బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 23:53:24

నా అనుభవమే దారి చూపింది..

నా అనుభవమే దారి చూపింది..

‘ఈ లోడు కరీంనగర్‌ల దించాలి.. ఎంత..’ ‘ఇంత అయితది సారూ!’ ‘మరీ అంతా..! ఇంకో మాట చెప్పు’ ‘మీకు తెల్వదా సారు.. రిటర్న్‌ ఎంప్టీ రావాలె గదా..’ఇప్పుడీ బేరాలు ఉండవిక. ఓ యువకుడి ఆలోచన గూడ్స్‌ రవాణాలో కొత్త శకానికి నాంది పలకబోతోంది. లోడ్‌తో వెళ్లి... అంతే లోడ్‌తో తిరిగొచ్చే మార్గం చూపుతోంది. ఫలితంగా విక్రయదారులకు రవాణా భారం తగ్గనుంది. వాహన యజమానులకు మరింత ఆదాయం లభించనుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట వాసి భూసవేని బాలరాజు. చదివింది ఎంబీఏ. కంప్యూటర్‌ పరిజ్ఞానమూ ఉంది. గంభీరావుపేట ఐకేపీ కేంద్రంలో సీసీగా పనిచేస్తున్నాడు. టీహబ్‌ ప్రారంభోత్సవ సమయంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం బాలరాజులో కొత్త  ఉత్సాహాన్ని నింపింది. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అన్న మంత్రి మాటలు బాలరాజు మస్తిష్కాన్ని తొలిచేశాయి. తాను కూడా ఓ మంచి ఆలోచనతో ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావించాడు. అప్పుడు గూడ్స్‌ వాహనాలపై దృష్టి పెట్టాడు. గూడ్స్‌ వాహనాల రవాణా ఛార్జీలు తగ్గేలా ‘ఆదా ట్రిప్‌' యాప్‌ను రూపొందించాడు. తన ఆలోచనకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల సహకారంతో తుది రూపునిచ్చాడు.

ఎలా పనిచేస్తుంది? 

ఈ యాప్‌ సాయంతో ఒకే వాహనంలో ఒకరి వస్తువులు ఎగుమతి, మరొకరి వస్తువులు దిగుమతి చేసుకోవచ్చు. ఉదాహరణకు కరీంనగర్‌ నుంచి ఏవైనా వస్తువులను తీసుకొని గూడ్స్‌ వాహనం హైదరాబాద్‌కు వెళ్తోందనుకోండి.. వాహనం ఎప్పుడు హైదరాబాద్‌కు చేరుతుంది, తిరిగి ఎప్పుడు బయల్దేరుతుంది, వాహన సామర్థ్యం వివరాలన్నీ యాప్‌లో ఉంటాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు, కరీంనగర్‌, తదితర ప్రాంతాలకు గూడ్స్‌ వాహనం కావాలనుకున్న వినియోగదారులు ఆదా ట్రిప్‌ యాప్‌ సహకారంతో ఆ వాహనాన్ని బుక్‌ చేసుకునే వీలుంది. పైగా వాహనాల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఇంధనం వృధానూ అరికట్టవచ్చు. గూడ్స్‌ వాహనాలు రహదారులపై ఖాళీగా తిరగకూడదనేదే తన సంకల్పం అంటాడు బాలరాజు. త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా యాప్‌ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.

నా అనుభవమే దారి చూపింది..

మా గ్రామానికి 50 కి.మీ దూరంలో ఉన్న పట్టణంలో టీవీ, కూలర్‌, కంప్యూటర్‌ టేబుల్‌ వివిధ వస్తువులు కొనుగోలు చేశాను. వాటిని మా ఇంటికి తీసుకపోవడానికి గూడ్స్‌ వాహనాన్ని అడిగితే ఎక్కువ కిరాయి చెప్పినట్టు అనిపించింది. మా ఊరు 50 కిలోమీటర్లు ఉంటే.. 100 కిలోమీటర్ల లెక్క అడిగాడు వాహనదారుడు. ఎందుకిలా అనడిగితే..  తిరిగి వచ్చేప్పుడు ఖాళీగా రావాలి కదా అన్నాడు. ఇంతలో మా ఊరి వైపు ఖాళీగా వెళ్తున్న వాహనం కనిపించింది. యజమానితో మాట్లాడి సగం కిరాయికే ఈ వస్తువులు ఇంటికి చేర్చగలిగాను. ఈ అనుభవమే ఆదా ట్రిప్‌ రూపకల్పనకు దారితీసింది. భూసవేని బాలరాజు. యాప్‌ రూపకర్త


logo