e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జిందగీ పోచారం పోరుపాట!

పోచారం పోరుపాట!

పోచారం పోరుపాట!

ఇంట్లో అందరూ పాటగాళ్లే. కానీ, వాళ్లెవరూ పాటను కెరీర్‌గా మలుచుకోలేకపోయారు. ఆ పని సంధ్య చేసింది. పాటనే అభిరుచిగా మార్చుకున్నది. పాటనే అస్త్రంగా ఎంచుకున్నది. ఆకలైనా పాటే, దూపైనా పాటే. సంతోషం కలిగినా పాటే, సమస్య అనిపించినా పాటే. జానపదం జాడను దొరకబట్టి అచ్చమైన ఆణిముత్యాలను మనకందిస్తూ, పాటతోపాటే ప్రయాణిస్తున్నది కొయ్యడ సంధ్య.

జానపద కళలకు పునరుజ్జీవనం.. తెలంగాణ ఉద్యమం. ఆ సమయంలో జరిగినన్ని కళా ప్రదర్శనలు, ధూమ్‌ధామ్‌లు ఎప్పుడూ జరగలేదు. గల్లీనుంచి ఢిల్లీదాకా వేదికలెక్కి ‘జై తెలంగాణ..’ పాటలు వినిపించారు కళాకారులు. వారిలో ఒకరు కొయ్యడ సంధ్య. సరదాగా మొదలైన ఆమె పాటల ప్రయాణం ఉద్యమం వైపు మలుపు తిరిగింది. తర్వాత పాటనే కెరీర్‌గా మార్చుకొని, జానపద జల్లులో తానూ ఒక చినుకై పరవశింపజేస్తున్న కొయ్యడ సంధ్య పాట ముచ్చట..

- Advertisement -

క్యాసెట్లు వింటూ..
మాది వరంగల్‌ జిల్లా పరకాల మండలం పోచారం. నాలుగో తరగతిలో ఉన్నప్పుడే పాడేదాన్ని. మా ఇంట్లో నాన్న పాడేవారు. నాన్నను చూసి అన్న, అక్క, నేను నేర్చుకున్నాం. అమ్మ ఆగమ్మ, నాన్న సారయ్య. స్కూల్లో ప్రతీ ప్రోగ్రామ్‌లో నేనే ఫస్ట్‌. ఏడో తరగతిలో మండలస్థాయి పాటల పోటీలకు ఎంపికయిన. బహుమతికూడా సాధించిన. అన్న, అక్క క్యాసెట్లు వేసి పాటలు వింటుండేవాళ్లు. నేనూ వినేదాన్ని. వినడమే కాకుండా ప్రాక్టీస్‌ చేస్తుండేదాన్ని. స్కూల్‌లో నేను మొదటగా ‘గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం’ పాట పాడిన. నాకు జేసుదాస్‌ పాటలంటే ఇష్టం. ఆయన ప్రతీ పాటను సాధన చేసేదాన్ని. ఏదైనా కొత్త పాట వస్తే, నేర్చుకున్నదాక వదలకపోయేదాన్ని. నా అభిరుచిని గ్రహించి ఇంట్లోవాళ్లు నా కోసం సినిమా పాటల పుస్తకాలు తెప్పించేవాళ్లు. క్యాసెట్లు వింటూ, పుస్తకాల్లో చదువుతూ నేర్చుకునేదాన్ని. ఆ శ్రద్ధ చూసి అమ్మనాన్న సంబరపడేవాళ్లు.

మొదటి సంపాదన
స్కూల్‌ వేదికమీద పాడుతూనే, కాంపిటీషన్స్‌కు వెళ్లేదాన్ని. నేను పాడిన తొలి కాంపిటీషన్‌ పాటే నాకు ప్రశంసలు తీసుకొచ్చింది. ‘మంచు కొండల్లోన.. కాశ్మీరు లోయల్లో అయ్యిందిరా పెద్ద గాయం’ అనే దేశభక్తి గీతమది. ‘సుట్టు సముద్రాలు పొంగిపొర్లంగా.. ఎత్తయిన హిమగిరులు నాట్యమాడంగా’ అని గొంతెత్తేసరికి వేదిక పైనున్నవాళ్లు, కిందున్నవాళ్లు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ‘పాటకు ఇంత పవర్‌ ఉంటుందా?’ అని అప్పుడనిపించింది. ఎన్ని అవరోధాలు వచ్చినా పాటను మాత్రం విడిచేది లేదని, బడికెళ్లే రోజుల్లోనే నిర్ణయించుకున్నా. ఎనిమిదో తరగతిలో నేను పాడిన ‘కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో’ గీతానికి ‘మారి ఫౌండేషన్‌’ వాళ్లు రూ.1500 నగదు ప్రోత్సాహకం అందజేశారు. అదే నా జీవితంలో తొలి సంపాదన.

రోజుకో చోట
ఇంటర్‌కి వచ్చాక కూడా ఏ అవకాశాన్నీ చేజార్చుకోకుండా పాడేదాన్ని. తర్వాత, శ్రావణి అనే ఫ్రెండ్‌తో బయట ఈవెంట్స్‌కి వెళ్లేదాన్ని. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2009నుంచి 2014వరకు వందల ప్రోగ్రామ్స్‌ చేసిన. ఒకరోజు వరంగల్‌లో, ఇంకోరోజు కరీంనగర్‌లో, రెండూ కాకపోతే హైదరాబాద్‌లో కార్యక్రమాలు ఉండేవి. వరంగల్‌ శ్రీనన్న, గిద్దె రాంనర్సన్నలతో కలిసి ఉద్యమ వేదికలు పంచుకున్నాం. వారి సలహాలు, సూచనలు పాటిస్తూ పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. శ్రీనన్న బృందంలో నేను ఉన్నట్లు వాస్తవానికి అన్నకు తెలియదు. వరుస కార్యక్రమాలు విజయవంతం కావడంతో.. వాటిలో నా పాట హైలైట్‌ కావడంతో.. నా గురించి తెలుసుకున్నారట. ‘చక్కగా పాడుతున్నావ్‌రా చెల్లె! మంచి భవిష్యత్‌ ఉంటుంది
నీకు. బాగా ప్రాక్టీస్‌ చెయ్యి. తెలంగాణ ఉద్యమ గొంతుకను చాటిచెప్పే పాటల యజ్ఞంలో పాల్గొనడం నీ అదృష్టం’ అన్నారు.

నా పాటకు డప్పు ..
ఇంట్లో అమ్మానాన్న బాగా ఎంకరేజ్‌ చేసేవాళ్లు. పాడతా అన్నా, ఈవెంట్‌కి వెళతా అన్నా, కాలికి గజ్జె కట్టి తెలంగాణ ఉద్యమానికి ఉరుకుతా అన్నా.. ఏనాడూ వద్దనలేదు. పైగా ‘మా సంధ్య పాడుతుంది’ అని పదిమందికి చెప్పారు. నేను పాటతో ఇలా ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో సరదాగా పాడేదాన్ని. నా పాటను వింటూ అన్న డప్పు కొట్టేవాడు. అలాంటిది, తర్వాత పాటే నా కెరీర్‌ అయ్యింది.

అచ్చమైన జానపదం కోసం
నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ చూపించింది.. మిత్రుడు రమేశ్‌. ఒక మంచిపాటతో నేను యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో నాకోసం ప్రత్యేకంగా ఆర్కే అన్నయ్యతో పాట రాయించాడు. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 70కి పైనే పాటలు పాడాను. ఇప్పుడు లైఫ్‌ చాలా బాగుంది. ఒకప్పుడు ఎన్నో కష్టాలు. ఉద్యమ సమయంలో అయితే తిండితినని రోజులూ ఉన్నాయి. మా కష్టం ఫలించి ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’లో ఉద్యోగం వచ్చింది.
‘ఎస్‌కే ఆడియోస్‌ అండ్‌ వీడియోస్‌’ అనే యూట్యూబ్‌ చానెల్‌ పెట్టాను. ఆ వేదిక మీద మంచి జానపదాలను తీసుకొస్తున్నాను. చరిత్రలో నిలిచిపోయే అచ్చమైన తెలంగాణ జానపదాల్ని అందివ్వాలన్నదే నా భవిష్యత్‌ లక్ష్యం. ఆ ప్రయత్నంలో మీ ఆశీస్సులు కావాలి.

… దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోచారం పోరుపాట!
పోచారం పోరుపాట!
పోచారం పోరుపాట!

ట్రెండింగ్‌

Advertisement