e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home జిందగీ పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద..

పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద..

పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద..

ఏ జానపదమైనా మన గురించి పాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం, అందులో స్వచ్ఛత, ప్రేమ, సంతోషం, మానవ సంబంధాలు, కల్మషం లేని జీవితాలు కనిపిస్తయి. అందుకే జానపదం ‘స్ట్రెస్‌ బస్టర్‌’ అవుతున్నది. అలాంటి పాటలను అందిస్తున్న యువ గాయని సోనీ యాదర్ల.

కళను అర్థవంతంగా ప్రదర్శించినప్పుడే ఫలితం బాగుంటది. ఆ ఫలితాన్ని జీవితాంతం ఆస్వాదించవచ్చు. ఆ తొవ్వలోనే నడుస్తున్నది సోని. మంచి జానపదాలను ఒడిసి పట్టుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతున్నది. ‘పూతపూత మావిళ్లు.. పూతామావిళ్లకింద మరిసిపోని కానుకిచ్చినావు.. నిన్నెట్లా మరిసిపోదు మావో నేనెట్లా..’ అంటూ పల్లె పాటల పాయసం వండుతున్న సోనీ యాదర్ల పాట ముచ్చట.

- Advertisement -

నాయినమ్మ వింటుంటే..
ఏదైనా పనిచేస్తే అమ్మ, నాయిన మెచ్చాలె. ఊరూవాడ నచ్చాలె. అప్పుడే మన పనికి సక్కదనం అనిపిస్తది. నేను చిన్న వయసులోనే పాడటం షురువు జేసిన. అమ్మానాయిన ‘మనకెందుకు బిడ్డా’ అనలేదు. ‘మంచిగ పాడి పేరు తెచ్చుకో’ అన్నరు. మాది హైద్రాబాద్‌లోని మల్లాపూర్‌. జెడ్పీహెచ్‌ఎస్‌ మల్లాపూర్‌లో చదువుకున్నా. ‘చదువు మాత్రమే బాగా చదివితే, క్లాస్‌లో మన గురించి యాది చేసుకుంటరు. అదే, చదువుతోపాటు ఏదైనా కళ ఉంటే స్కూల్‌ అంతా గుర్తు చేసుకుంటరు’ అని పాడటం మొదలు వెట్టిన. మా నాయినమ్మ బాగా పాడేది. క్యాసెట్‌ వేసుకొని ఒగ్గుకథలు వినేది. ‘సీరియల్లో, సినిమాలో చూడక గివ్వెందుకు వింటవే’ అని అడిగితే, ‘గివ్విట్ల ఆపతి ఉంటది, సోపతి ఉంటది బిడ్డా’ అనేది. ‘లశ్మమ్మవ్వా ఓ బతుకమ్మ పాట పాడే’ అని వాళ్లూ వీళ్లూ అడిగేటోళ్లు. నేనూ తనతో కలిసి వినడం, పాడటం మొదలువెట్టిన.

పట్టరాని సంతోషం
ఇంట్ల నేర్చుకున్న ప్రతీ పాటను స్కూల్లో పాడేదాన్ని. టీచర్లు మెచ్చుకుందురు. తోటి విద్యార్థులు బాగుందని అనేటోళ్లు. చిన్న వయసు. ఏదైనా ప్రశంస లభిస్తే ఇంకా ఉత్సాహంతో పని చేయాలని అనిపించేది. నా పాటకు పదును పెట్టిన. నేను ఎంచుకున్న పాటను, పాడే తీరును చూసి పుష్పలత టీచర్‌, ఇంద్రసేన సార్‌ ప్రోత్సహించిండ్రు. నేనప్పుడు ఆరో తరగతి. స్కూల్లో పెద్ద ప్రోగ్రామ్‌ జరుగుతున్నది. బయట నుంచి వచ్చిన అతిథులకే పాడే అవకాశం ఉంటదన్నరు. ‘చూద్దాం ఎవరొస్తరో, ఎట్లనన్న ఒక పాట పాడే చాన్స్‌ సంపాదించాలె’ అనుకుంట అతిథులకోసం ఎదురుచూస్తున్నం. ఇంతలో ప్రోగ్రామ్‌ స్టార్టయింది. అతిథిగా వచ్చిన సింగర్‌ను నేను రోజూ టీవీలో చూసేదాన్ని.. జానపద, ఉద్యమ గాయని స్వర్ణక్క. అక్క పాటలంటే నాకు ఇష్టం. మొత్తానికి స్వర్ణక్కను కలిసి జానపదాలపట్ల నా ఆసక్తిని తెలిపిన. సంతోషించింది. తనతో పాడే అవకాశం ఇచ్చింది. ‘బాయిల్ల బచ్చాలీకూరా అంజయ్య’ పాట పాడితే చప్పట్లతో స్కూలంతా దద్దరిల్లింది.

పెద్దవాళ్లతో కలిసి..
స్వర్ణక్కతో తరచూ ఫోన్లో మాట్లాడేదాన్ని. ‘మంచిగ పాడుతున్నవ్‌. బాగా ప్రాక్టీస్‌ చెయ్‌’ అంటుండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో నన్నూ వెంట తీసుకెళ్లింది. వేదికమీద రసమయి బాలకిషన్‌ గారు ఆడిపాడుతుంటే అట్లనే చూస్తుండేదాన్ని. ఆయనతో కలిసి పాడుతున్నందుకు సంతోషంగా అనిపించేది. ధూమ్‌ధామ్‌లలో పాల్గొంటూనే చదువుకునేదాన్ని. రోజూ బడికెళ్లడం కుదరకపోయేది. టీచర్లు నా కోసం ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవాళ్లు. కెరీర్‌ పరంగా మానుకోట
ప్రసాదన్న, సాయిచందన్న, మద్దెల సందీపన్న ప్రోత్సహించారు. నాన్న నరేందర్‌, అమ్మ జగదాంబకూడా నన్ను బాగా అర్థం చేసుకున్నరు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా నాన్నే నన్ను తీసుకెళ్లేవాడు. ఒక్కోసారి అర్ధరాత్రి దాటేది. అయినా ఓపిగ్గా నాతోనే ఉండి ఇంటికి తీసుకొచ్చేవాడు. ‘మీకు ఇబ్బంది అవుతున్నట్టుంది కదా నాన్నా. మరి మానేయాలా?’ అని ఎన్నోసార్లు అన్నా.
‘ఒకరికి ఇబ్బంది అవుతుందని నీ లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తవా చెప్పు’ అంటుండె నాన్న. వాళ్ల సపోర్ట్‌ ఉంది కాబట్టే, ఇక్కడిదాకా రాగలిగిన.

పూతపూత మావిళ్ల పాట
తెలంగాణకోసం కొట్లాడిన ఫలితం లభించింది. రాష్ట్రమొచ్చినంక సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆట-పాట ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యాను. ఏదో ఆసక్తికొద్ది పాడటం ప్రారంభించిన నేను తర్వాత ఉద్యమంలోకి వెళ్లడం, జీవితం అంటే ఏంటో తెలుసుకోవడం, ఇప్పుడు ఉద్యోగం చేయడం.. ఇదంతా పాటతోనే సాధ్యమైంది. ఇంకేదో చేయాలని అనుకుంటున్న క్రమంలో యూట్యూబ్‌ సరైన వేదిక అనిపించింది. మంచి మంచి జానపదాలను ఒడిసి పట్టి యూట్యూబ్‌ద్వారా ప్రజలకు పరిచయం చేయాలని అనుకున్నా. మానుకోట ప్రసాదన్న తన చానెల్‌లో అవకాశం కల్పించిండు. ‘పూత పూత మావిళ్లా పూతా మావిళ్ల కింద మరిసిపోని కానుకిచ్చినావూ నిన్నెట్లా మరిసిపోదు మావో’ అనే పాట అది. మంచి హిట్‌ అయింది. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చింది. భవిష్యత్‌లో ఫోక్‌కు వెస్టర్న్‌ జోడించి ఒక కొత్త టేస్ట్‌ను ప్రజలకు పరిచయం చేయాలని అనుకుంటున్నా.

… దాయి శ్రీశైలం

జనం మెచ్చిన పాటలు

‘ఏడంత్రాల మాతవే మాతా మావురాల ఎల్లు.. ఎంత గొప్ప తల్లివే మాతో మావురాల ఎల్లు’ అనే బోనాల పాట నా కెరీర్‌లో పెద్ద మలుపు. ఎక్కడ బోనాలు జరిగినా మార్మోగుతున్నది. మా వాడకట్టులో ఈ పాటకు అందరూ స్టెప్పులేస్తుంటే కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ‘ఓ బావా కొనిపెడితవా గాజులు’, ‘ఇంటెనకా ఈతవనం రాజన్నా.. ఎట్లవోతవ్‌ వన్నెకాడవ్‌ రాజన్నా’, ‘సింతాకు చీరె నేను కట్టుకుందునా’ వంటి పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చినయి. నాయినమ్మ నాకో వరం ఇచ్చి వెళ్లింది. అదే ఒగ్గుకథలు వినడం. మనసు పెట్టాలేగానీ ప్రతి ఒగ్గుకథలోనూ జానపదాలు దొరకబట్టొచ్చు. వీటిలో గొప్ప జీవితం కనిపిస్తుంది. జానపదాలు సేకరించే క్రమంలో నేను ఒగ్గుకథల్నే ఆశ్రయిస్తాను. దానికితోడు అమ్మమ్మలు, నాయినమ్మల నుంచి నాటి అచ్చమైన జానపదాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద..
పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద..
పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద..

ట్రెండింగ్‌

Advertisement