e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిందగీ ‘సృజన’ పదం!

‘సృజన’ పదం!

‘సృజన’ పదం!

జానపదం తన ఆస్తి. జానపదం తన సంపాదన. జానపదం తన సర్వస్వం. అమ్మానాన్నల తర్వాత అంతగా జానపదాన్నేఇష్టపడింది. వారసత్వంగా వస్తున్న పాటకు పట్టాభిషేకం చేసి, ఆణిముత్యాల్లాంటి పల్లెపదాలతో అలరిస్తున్నది మరిమడ్ల మాణిక్యం.. మాట్ల సృజన.

సృజన పుట్టంగనే కోయిల పుట్టిందన్నారంతా. వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నరోగానీ, ఆ అమ్మాయి మాత్రం నిజంగా కోయిలై కూస్తున్నది. కోనరావుపేట మోడల్‌ స్కూల్‌నుంచి మొదలైన సృజన పాటల ప్రస్థానం తెలంగాణ అంతటా తేనెలొలికిస్తున్నది. మరిమడ్లలో వికసించిన మట్టిపాటల పరిమళాలు పల్లెపల్లెకూ విస్తరిస్తున్న ఫోక్‌స్టార్‌ మాట్ల సృజనతో పాట ముచ్చట.

- Advertisement -

మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం. నాకు ఆరో తరగతి నుంచే జానపదాలంటే ఇష్టం. మా ఇంట్ల అందరూ జానపద కళాకారులే. నాన్న సుభాష్‌ చంద్రబోస్‌ మంచి పాటకాడు. అమ్మ మమత కూడా పాడుతుంది. నాన్న ఒకప్పుడు ఊరూవాడ తిరిగి పాడినోడే. పాటల పూదోటలో వికసించిన ఎన్నో ఆణిముత్యాలను అందిస్తున్నరు బాబాయిలు. వీళ్లందర్నీ చూస్తూ పెరిగిన కాబట్టి, నాకూ చిన్నతనంలోనే జానపదంపై ఆసక్తి ఏర్పడింది. అమ్మానాన్న తర్వాత జానపదాన్నే ఎక్కువగా ఇష్టపడిన. నా దృష్టిలో జానపదం ఒక కళ మాత్రమే కాదు, పరిరక్షించుకోవాల్సిన ఆస్తి. పెంచుకోవాల్సిన సంపద. మా ఇల్లంతా కళా ధ్యాసే.

చదువుపై మొదటి పాట
నేను ఆరో తరగతినుంచి ఇంటర్‌వరకు కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో చదివిన. రెగ్యులర్‌ సబ్జెక్టులతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులమ్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యమున్న పాఠశాల అది. ఆట, పాట నేర్చుకునే అవకాశం ఉంటుండె. అక్కడికి వెళ్లాకనే నాలో పల్లెపదాలపై ఆసక్తి పెరిగింది. ఒకరోజు ఏదో కల్చరల్‌ ఈవెంట్‌ జరుగుతున్నది. చాలామంది అమ్మాయిలు స్పీచ్‌ ఇచ్చిండ్రు. నావంతు వచ్చింది. ‘పల్లె పల్లెల్లో అక్షర దీపాలు.. అందరి బతుకుల్లో చక్కని వెలుగులు’ పాట పాడిన. ఒకటే చప్పట్ల మోత. ఆరో తరగతి అమ్మాయి సమాజానికి అవగాహన కలిగించే పాట పాడిందని అందరూ మెచ్చుకుండ్రు. చదువు లేని అక్కాచెల్లెండ్లు, అన్నాదమ్ముండ్లు పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దుకోవాలని చెప్పే పాట ఇది. ఈ పాటను మా అక్కలు బాబాయిల దగ్గర నేర్చుకుంటే, నేను అక్కల దగ్గర నేర్చుకున్నా.

అంబేద్కర్‌ పాటలు
ఆరో తరగతిలోనే ఇంత పరిణతి ఉన్న పాట పాడటం వల్ల అందరూ ఫిదా అయిండ్రు. అప్పటివరకు నేను పాడతానని ఎవరికీ తెలియదు. ఇక ఎప్పుడు ఏ ప్రోగ్రామ్‌ జరిగినా నన్నొక అఫీషియల్‌ సింగర్‌ లెక్క చూస్తుండే వాళ్లు. టీచర్ల ప్రోత్సాహంతో నాలో పాడాలనే ధ్యాస రెట్టింపయింది. పదో తరగతివరకు స్కూల్లో ప్రతీ కార్యక్రమంలో పాడుతూ వచ్చినా. అమ్మానాన్న అయితే నన్ను చాలా ప్రోత్సహించిండ్రు. స్వతహాగా నాన్న కళాకారుడు కావడం వల్ల నా అభిరుచిని అర్థం చేసుకున్నడు. ‘మంచి పాటలు పాడాలె. మంచిపేరు తేవాలె’ అంటుండె. పదో తరగతి తర్వాత కుమార్‌ బాపుతో కలిసి ప్రోగ్రామ్స్‌కి వెళ్లడం మొదలు పెట్టిన. మొదాలు అంబేద్కర్‌ ప్రోగ్రామ్స్‌ చేస్తుంటిమి. అంబేద్కర్‌పై తీరొక్క పాటలు పాడుతుండే దాన్ని.

అవకాశాల కోసం..
చానా చిన్న వయసులో పాటలు పాడితే, ఏదో కాలయాపన కోసం అనుకున్నారంతా. నా కలే అది అని తెలుసుకొని ఆశ్చర్యపోయిండ్రు. నిజానికి ఆ వయసులో అచ్చమైన జానపదాలను ఎంపిక జేసుకొని పాడటమంటే మామూలు విషయం కాదు. అప్పటికే యూట్యూబ్‌లో జానపదాలు ఒక ఊపు ఊపుతున్నయి. ‘నీ గొంతు బాగుంటది. సిచ్యుయేషన్‌కు తగ్గట్టు గొంతును మాడ్యులేట్‌ చేసి పాడుతుంటవ్‌. యూట్యూబ్‌లో పాడితే ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది’ అని చాలామంది అంటుండె. అవకాశాల కోసం ఎదురు చూసిన. తెలిసిన వాళ్లకు పాడి వినిపించిన. ప్రోగ్రామ్స్‌తోపాటు రికార్డింగ్‌లోనూ పాడాలని ఉండేది. ఎవరూ అవకాశం ఇవ్వక పోవడంతో బాధనిపించింది. కానీ, ఎప్పటికైనా మంచిపాటతో యూట్యూబ్‌ వేదికగా నా పాటను వినిపించి తీరుతాననే నమ్మకం ఉండేది.

యూట్యూబ్‌లో తొలిసారి
ఒకసారి కోనరావుపేటలో ప్రోగ్రామ్‌ ఉంటే వెళ్లిన. కుమార్‌ బాపు, నేను పాడుతున్నం. నక్క శ్రీకాంతన్న అప్పటికే యూట్యూబ్‌లో మంచి మంచి పాటలతో అలరిస్తున్నడు. శ్రీకాంతన్నకూడా ఆ ప్రోగ్రామ్‌కి వచ్చిండు. ‘అరే చెల్లె. మంచిగ పాడుతున్నవ్‌రా. నీది అరుదైన గొంతు. మంచి ఫ్యూచర్‌ ఉంది. మనదే, ఎన్నెస్‌ మ్యూజిక్‌ చానెల్‌ ఉంది. ఓ పాట అనుకుంటున్నం. నీకు కచ్చితంగా అవకాశం ఇస్తరా’ అని చెప్పిండు. నాకైతే మస్తు సంబురమయ్యింది. ఎందుకంటే, ఎంత ప్రోగ్రామ్స్‌లో పాడినా, యూట్యూబ్‌ ద్వారా పాట బయటికి వెళ్తేనే ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది. అందుకే, ‘సరే అన్నా’ అని చెప్పినా. ‘కల్వరేక కాంతులోడు.. కత్తెర సూపులోడు’ పాటతో శ్రీకాంతన్న అవకాశం ఇచ్చిండు. ఆ పాట మామూలుగా వెళ్లలేదు. తక్కువ సమయంలోనే కోట్లాదిమంది ఆదరణ పొందింది.

పాటతోనే ఉండిపోతా
‘సింతకింద సింతయేసే బావయో నా బావయా’ నా రెండో పాట. ఇదికూడా మంచిపేరు తెచ్చింది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో 40 పాటలదాకా పాడిన. ‘అందమైన సిన్నిదాన్ని ఐదడుగుల వన్నెదాన్ని’ అనే పాట బాగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ మధ్య జనాలకు రీచ్‌ అయిన పాట ‘నీలా నీలము చీరలో’. ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగుతున్నది. మున్ముందు ఇలాంటి పాటలు పాడి పల్లెపదాల గొప్పదనం చాటడమే నా లక్ష్యం. జానపద టీచర్‌గా జీవితాంతం పాటతోపాటే ఉండాలని అనిపిస్తుంది. ‘నీలా నీలము చీరలో’ పాట చూసిన చాలామంది ‘సినిమా లెవల్లో ఉంది’ అంటున్నారు. అవకాశం వస్తే సినిమాల్లో కూడా పాడతా.

నా పాటల ప్రయాణంలో వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నది నా కుటుంబం. నాన్నయితే ఎక్కడ ప్రోగ్రామ్‌ ఉన్నా తోడుగా వస్తాడు. మంచిపాటల ద్వారా గుర్తింపు పొంది, పేరు నిలబెట్టడమే నేను వారికిచ్చే బహుమతి. తమ్ముండ్లు ఇద్దరూ నన్ను ఫాలో అవుతూ, ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ చేస్తుండ్రు. నేను సిరిసిల్ల మహతీ కాలేజీలో బీకాం ఫస్టియర్‌ చదువుతున్నా. పాడటమే కాదు, రాయడం పైనా దృష్టి పెడుతున్నా. మంచి మంచి పల్లె పదాలు సేకరిస్తున్నా. అన్నీ సిద్ధం చేసుకొని భవిష్యత్‌లో నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్‌ ఏర్పరచుకోవాలని అనుకుంటున్నా.

… దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘సృజన’ పదం!
‘సృజన’ పదం!
‘సృజన’ పదం!

ట్రెండింగ్‌

Advertisement