మార్కెట్లో రెడీమేడ్ డ్రెస్సులు హల్చల్ చేస్తున్నాయి. కాకపోతే, మాల్ నుంచి ఇంటికొచ్చాక మళ్లీ వాటిని టైలర్ దగ్గరకు తీసుకెళ్లాల్సిందే. మార్పులు చేర్పులు చేయించాల్సిందే. అందుకే, చాలామంది టైలర్ దగ్గరే కుట్టించుకుంటారు. కానీ, ఇక్కడో సమస్య ఉంది. సమయానికి డ్రెస్ చేతికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. పదిసార్లు టైలర్ షాపు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. ఇలాంటి తలనొప్పులనే చాలాసార్లు భరించారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు దోస్తులు. ఆ అనుభవంలో నుంచే టైలర్స్ఇన్.కామ్ ప్రాణం పోసుకుంది. ఆ కథంతాసహ-వ్యవస్థాపకులు ఆస్తా మహేశ్వరి మాటల్లో..
“ప్రొఫెషనల్‌గా నేను డిజిటల్ కంటెంట్ రైటర్ని. నా వ్యాపార భాగస్వామి నయీమ్ భాను, నేను కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు టైలరింగ్ గురించి చర్చ వచ్చింది. మాకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నాం. చెప్పిన సమయానికి ఇవ్వకపోవడం, నాలుగుసార్లు తిప్పించుకోవడం.. మొదలైనవన్నీ ప్రస్తావనకు వచ్చాయి. అప్పుడే మాకు, ఇ-టైలరింగ్ ఆలోచన వచ్చింది” అంటూ ఐడియా ఎలా మెరిసిందో చెప్పారు ఆస్తా మహేశ్వరి.
ఆన్లైన్లో ఆర్డర్లు..
వెబ్ పేజీ లేదా వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తారు ఈ ఆన్లైన్ టైలర్లు. మరుక్షణమే కంపెనీ నుంచి కస్టమర్‌కు ఫోన్‌కాల్ వెళ్తుంది. మిగతా వివరాలన్నీ తెలుసుకుని, కొలతల కోసం మనిషిని పంపుతారు. తర్వాత, ఫ్యాషన్ డిజైనర్లతో వీడియో కాల్స్ చేయించి నచ్చిన డిజైన్లను ఎంచుకొనే అవకాశం ఇస్తారు. కుట్టుపని పూర్తికాగానే డెలివరీ చేస్తారు. డ్రెస్సును బట్టి మొత్తం ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుంది. నచ్చితే, ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు.
“కరోనా మొదలైనప్పటి నుంచీ మా బిజినెస్ మరింత బాగా నడుస్తున్నది. కస్టమర్లు ఆన్లైన్ ఆర్డర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మా టైలర్లు మంచి నేర్పరులు. కస్టమర్లు కోరిన డిజైన్లతో తక్కువ సమయంలోనే పక్కాగా కుట్టి ఇస్తారు. అందుకే మేం సమయానికి డెలివరీ చేయగలుగుతున్నాం. అలాగే, ఓ బంపర్ ఆఫర్ కూడా పెట్టాం. ప్రతిరోజూ మొదటి 15 ఆర్డర్లను 24 గంటల్లో డెలివరీ ఇస్తున్నాం. బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడంతోపాటు మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, డైయింగ్ కూడా చేస్తున్నాం” అని వివరించారు ఆస్తా.