8 యేండ్లకే కోటీశ్వరుడు


Sun,December 30, 2018 12:39 AM

మీరు నెలకు ఎంత సంపాదిస్తారు? మహా అయితే రూ.30 నుంచి 50వేలు వస్తే చాలా గ్రేట్. అప్పటికే ఏ పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగో అనుకుంటాం. ఆ రూ.50 వేలు కూడా రావాలంటే 40-50 ఏళ్లు కష్టపడాలి. అయితే యూఎస్‌కు చెందిన ఈ బుడతడు మాత్రం కేవలం ఎనిమిదేండ్లకే ఏడాదికి రూ.158.84 కోట్లు సంపాదిస్తున్నాడు. స్కూలుకు వెళ్తూనే కోట్లు కొల్లగొడుతూ.. ఈ ఏడాది యూట్యూబ్ స్టార్‌గా ఎదిగాడు.
ryanutube
ఈ చిన్నారి సంపాదన గురించి వింటే.. ద్యావుడా!! అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఈ బుడతడి ఏడాది సంపాదన అక్షరాలా 158.84 కోట్ల రూపాయలు మరి. అదికూడా ఎనిమిదేండ్ల వయసులోనే. కేవలం ఆరేండ్లకే ర్యాన్ అనే ఈ చిన్నారి ఏడాదికి 11 మిలియన్ డాలర్లు సంపాదించి ఫోర్బ్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. మన కరెన్సీలో దాదాపు రూ.71 కోట్ల రూపాయలు. ఇంతకీ ఏడాదిలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ర్యాన్.. ఏ ఉద్యోగం చేస్తున్నాడనే కదా మీ డౌటు. ఉద్యోగం కూడా ఏం లేదండీ.. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ కేవలం బొమ్మలతో ఆడుకోవడమే అతని ఉద్యోగం. ఏంటీ!! బొమ్మలతో ఆడుకుంటే అన్ని డబ్బులు ఎలా వస్తున్నాయని మళ్లీ సందేహించకండి. ర్యాన్‌కు చిన్నప్పటి నుంచి బొమ్మలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం. వాళ్ల అమ్మానాన్నలు మార్కెట్‌లోకి వచ్చిన కొత్త బొమ్మలను కొనుక్కొచ్చి ర్యాన్‌కు ఇస్తుండేవారు. వాటిని పూర్తిగా పరిశీలించి.. వాటి గురించి తల్లిదండ్రులకు బుజ్జి బుజ్జి మాటలతో చెప్పేవాడు. అలా చెప్పేటప్పుడు ర్యాన్ హావభావాలు ముద్దుగా ఉండడంతో వాళ్ల నాన్నకు ఓ ఐడియా వచ్చింది.

ర్యాన్ బొమ్మల గురించి వివరించి చెప్పేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. అలా ర్యాన్ పేరుమీద ర్యాన్ టాయ్స్ రివ్యూ అనే యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. అందులో ర్యాన్ బొమ్మల గురించి చెబుతున్న వీడియోలు అప్‌లోడ్ చేస్తుండడంతో కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎందుకంటే, వాటిని చూసేవారి సంఖ్య కోట్లలో ఉండడంతో యూట్యూబ్, బొమ్మల కంపెనీలు ర్యాన్ తల్లిదండ్రులకు పెద్దమొత్తంలో డబ్బులు ముట్టచెపుతున్నాయి. దీంతో కేవలం నాలుగేండ్ల నుంచే మిలియనీర్ అయ్యాడు ర్యాన్. ఇప్పుడు ఏడాదికి రూ.158.84 కోట్లు సంపాదించి యూట్యూబ్ స్టార్ అయ్యాడు. అంతేకాదు ర్యాన్ వీడియోలు చూసి చాలామంది చిన్నారులు బొమ్మలు కొంటుండడంతో బొమ్మల కంపెనీలు కూడా ర్యాన్ ఇంటిముందు క్యూ కడుతున్నాయట. గత ఏడాదికిగా రూ.71 కోట్ల రూపాయలు సంపాదించి యూట్యూబ్ స్టార్‌లిస్ట్‌లో 8వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఏకంగా రూ.158 కోట్లకు పైగా సంపాదించి టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ర్యాన్ యూట్యూబ్ చానెల్‌కు 17.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ర్యాన్ యూట్యూబ్ చానెల్ 26 బిలియన్ల వీక్షకులను సొంతం చేసుకున్నది.
ryanutube1
ర్యాన్ టాయ్స్ రివ్యూ నుంచి ఏ వీడియో పోస్ట్ చేసినా.. 26 బిలియన్ల మంది వీక్షించడం విశేషం. ప్రస్తుతం టాప్-10 యూట్యూబ్ స్టార్స్ జాబితాలో ఉన్న వారంతా పెద్దవాళ్లు కాగా.. ర్యాన్ మాత్రమే పిన్న వయస్కుడు. ర్యాన్ చేసిన మొదటి టాయ్ రివ్యూ లెగో ట్రైన్. అక్కడి నుంచి ర్యాన్ సంపాదన ట్రైన్‌లా దూసుకుపోతున్నది. ర్యాన్ తల్లి హైస్కూల్‌లో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తుంది. స్కూల్‌కి వెళ్లి చానల్‌ని చూసుకోవడానికి సమయం సరిపోయేది కాదు. దీంతో టీచర్ ఉద్యోగానికి స్వస్తి పలికింది. కొత్తరకం టాయ్స్, ఆహార ఉత్పత్తుల మీద వీడియోలు తీస్తున్నాడు. అయితే కొత్తగా ర్యాన్ బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు. వీటిని వాల్మార్ట్ వెబ్‌సైట్‌లో అమ్మేందుకు ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. ర్యాన్ బొమ్మలు అమెరికాలో దాదాపు 2,500 దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైటెక్ టాయ్స్‌తో కాకుండా.. సహజంగా తయారు చేసిన బొమ్మలతోనే ఆడుకోవాలని సూచిస్తున్నాడు ర్యాన్. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందని చెబుతున్నాడు.

వనజ వనిపెంట

659
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles