సోమవారం 01 మార్చి 2021
Zindagi - Feb 12, 2021 , 02:27:01

ఒంపుసొంపుల వంకీలు

ఒంపుసొంపుల వంకీలు

ఆభరణాల్లో మెలితిరిగినవి రెండున్నాయి. ఒకటి, పెండ్లినాడు ధరించే ప్రధానపు ఉంగరం. రెండోది, జబ్బను హత్తుకునే అరవంకీ. రూపు వంకరైనా చూపు తిప్పుకోనివ్వని సొగసు వంకీ సొంతం. ప్రధానపు ఉంగరం పెండ్లయిన వారికైతే.. అరవంకీ అందరిదీ! పట్టుకోక చుట్టిన పడతైనా, లంగావోణీలో తళుక్కుమనే యువతైనా అరవంకీ తొడిగితే చాలు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అతివలకు అరవంకీ తెచ్చే అందం, ఆకర్షణ అలాంటిది మరి!  దక్షిణ భారత వివాహ సంప్రదాయాల్లో వధువు తప్పకుండా ధరించే ఆభరణాల్లో ఒకటైన ఒంపుసొంపుల వంకీల సొగసులేంటో చూద్దాం..


భారతీయ సంప్రదాయ ఆభరణాల్లో వంకీల వైభవం ప్రత్యేకం. వంకర్లు తిరిగిన ఈ మేలిమి బంగారు ఆభరణం మహా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చేతికి ధరించే నగల్లో ఇది వైవిధ్యమైంది. ధరించినవారి దృఢ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ప్రాచీన కాలం నుంచీ నాగుపాములను ఆరాధించే సంప్రదాయం మనది. సర్పాల ప్రేరణతోనే  వంకీల రూపకల్పన చేశారేమో అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అరవంకీలను ‘బాజుబంద్‌' అంటారు. ఇంగ్లిష్‌లో ‘ఆర్మ్‌లైట్‌' అంటారు. ఒకప్పుడు గ్రామాల్లో ఆడామగా తేడా లేకుండా బంగారు, వెండి, రాగితో చేసిన కడ్డీల వంటి ఆభరణాలను వంకీలుగా ధరించేవారు. వీటిని ‘దండ కడియాలు’ అని పిలిచేవారు. మొదట్లో సాదాసీదా వంకీలు ధరించేవారు. కాలక్రమంలో రకరకాల డిజైన్లు సంతరించుకున్నాయి. నవరత్న ఖచిత వంకీలు, కట్‌ జ్యువెలరీ డిజైన్లలోనూ లభిస్తున్నాయి. ముంజేతి నుంచి తొడిగేవే కాకుండా, సులువుగా అలంకరించుకోవడానికి వీలుగా చెయిన్‌ బేస్డ్‌ వంకీలు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే, దేని అందం దానిదే!

ఒత్తిడి చిత్తు


సంప్రదాయ ఆభరణాల్లో ఏదో ఒక ఆరోగ్యసూత్రం ఇమిడి ఉంటుంది. వంకీలను ధరించడం వెనుకా ఒక నమ్మకం ఉంది. మోచేతిపైన కాస్త ఒత్తిడిని కలిగించేలా,  లోహ ఆభరణాన్ని ధరించడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందట. వంకీలను రెండు చేతులకు అలంకరించుకొనే సంప్రదాయమూ ఉంది. అయితే, చాలామంది కుడిచేతికి మాత్రమే ధరిస్తుంటారు. పూజాది క్రతువుల్లో దక్షిణ హస్తానికి ఉండే ప్రాధాన్యం తెలిసిందే! ఈ మేరకు, కుడిచేతికి మాత్రమే వంకీలు ధరిస్తుంటారు కొందరు.

రకరకాల రూపాల్లో..

రంగురంగుల రాళ్లు పొదిగిన రకరకాల వంకీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, మగువలు మాత్రం మంగళప్రదమైన లక్ష్మీదేవి రూపం, నెమళ్లు, మందగజాలు, మీనాలు, లతల అల్లికలతో కూడిన డిజైన్లనే ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా హస్తకళా డిజైన్లతో పెటాస్టోన్‌తో తయారైన వంటే మరీ ఇష్టపడతారు.  

ట్రైబల్‌ ట్రెండ్స్‌

వంకీలు ఇప్పుడు అన్ని రకాల లోహాలతో తయారవుతున్నాయి. ఖర్చుకు వెనుకాడని వాళ్లు బంగారంతో చేసినవాటికి, వజ్రాలు పొదిగిన వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ స్థాయిలో వెచ్చించలేనివారు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ వంకీలను ఎంచుకొంటున్నారు. మెటల్‌, సిల్వర్‌, కాపర్‌ వంకీల్లోనూ రకరకాల డిజైన్లున్నాయి. గవ్వలు, లెదర్‌తోనూ  తయారు చేస్తున్నారు. ట్రైబల్‌ పూసలు, రాళ్లతో తయారైన వంకీలూ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటికి కూడా మంచి ఆదరణ  ఉంది. 

 చైన్‌ ఆర్మ్‌లైట్‌

చైన్‌లతో తయారుచేసే వంకీలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని చోకర్‌లా మెడకు ధరించే వీలుంటుంది. చేతికి, మెడకు కూడా సింగారించుకునేలా తయారు చేస్తారు. డిజైన్‌తో కూడిన పట్టీల్లాంటి ఆభరణానికి రెండువైపులా చైన్‌ను జత చేయడం వల్ల సులువుగా అలంకరించుకోవచ్చు. చేతికి, మెడకు సరిపోయేలా సైజులు మార్చుకునే వీలుంటుంది. ఈ వెసులుబాటువల్లే,  వీటిపట్ల మొగ్గు చూపుతున్నారు నేటి మహిళలు.  

 ఎంబ్రాయిడరీ సొగసుతో..

ఫ్యాషన్‌ ప్రపంచంలో రోజుకో డిజైన్‌ పుట్టుకొస్తున్నది. ఈ తరం వస్త్ర శ్రేణికి తగ్గట్టుగా వంకీలూ సరి కొత్తగా తయారవుతున్నాయి. ఈ కోవలోకే వస్తాయి ఎంబ్రాయిడరీ వంకీలు. ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు, వేసుకున్న దుస్తులకు నప్పేలా రకరకాల రంగులు, డిజైన్లలో వీటిని ఎంచుకునే వీలుంది. చేతి పట్టీల రూపంలో హుందాగా, ట్రెండీగా కనిపిస్తాయి. స్టోన్స్‌తో చేసిన ఈ చేతిపట్టీలు ఫ్యాషన్‌ జ్యువెలరీలో భాగమైపోయాయి. అందుకే, ఈతరం మహిళలు ఆహార్యానికి తగ్గట్టుగా చేతి పట్టీల రూపంలోని  వంకీలను ఎంచుకుంటున్నారు.  

ఏ వయసు వారికైనా

ఒకప్పుడు వడ్డాణం, వంకీలు పెండ్లికూతురు ఆభరణాల్లో ముఖ్యమైనవిగా ఉండేవి. కానీ, ఇప్పుడు సంప్రదాయ సంబురాల్లో అందరూ ధరిస్తున్నారు. అరవంకీ అలంకరించుకోవడానికి వయసు అడ్డం కాదు. బుడిబుడి అడుగులేసే బుజ్జాయి నుంచి అమ్మమ్మల వరకు అన్ని వయసుల వారూ ధరించవచ్చు. వయసుకు తగ్గ డిజైన్లతో వీటిని తయారు చేస్తున్నారు.  ముఖ్యంగా పెండ్లీడు పడచులు ధరిస్తే చూడచక్కగా ఉంటుంది. వంకీలవల్ల వారికీ, వారివల్ల వంకీలకూ అదనపు అందం చేకూరుతుంది.

VIDEOS

logo