ఆదివారం 07 మార్చి 2021
Zindagi - Feb 04, 2021 , 00:38:25

మోసకారి నాయకుడు

మోసకారి నాయకుడు

ఒక అడవిలోని చెట్టుపై చాలా పావురాలు ఉండేవి.  ఒకదానితో ఒకటి గొడవపడుతుండేవి. ఐకమత్యంగా ఉండాలన్న ధ్యాసే ఉండేది కాదు. అదే అడవిలో ఒక గద్ద ఉండేది. అది తరచూ పావురాలను పట్టి తినేది. రోజురోజుకూ తగ్గిపోతున్న పావురాల సంఖ్య వాటిలో కలవరాన్ని తీసుకొచ్చింది.  అన్నీ ఒకరోజు సమావేశమయ్యాయి. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి. ఈలోపు ఒక పావురం ‘మనం ఒక్కొక్కరం వేరుగా ఎగరడం వల్లనే గద్ద మన మీద దాడి చేస్తున్నది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి  కలిసి కట్టుగా ఉందాం’ అన్నది. ఆ మరుసటి రోజు నుంచి పావురాలన్నీ గుంపులుగా ఎగురసాగాయి. దాంతో గద్దకు దాడి చేసే అవకాశం లేకపోయింది. ఆహారం దొరకడం కూడా కష్టమైంది. గద్ద ఒక ఉపాయం పన్ని పావురాల దగ్గరకు వెళ్లి ‘నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికి వచ్చాను’ అని నమ్మబలికింది. పావురాలు ముందు నమ్మకపోయినా.. రెండు రోజులు గద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి నమ్మాయి. మూడవరోజు ఆ గద్ద పావురాల దగ్గరకు వచ్చి ‘మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ మీకో నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత ధైర్యంగా ఉండవచ్చు’ అంది.  ఎవరు నాయకుడుగా ఉండాలో అవి తేల్చుకోలేక పోయాయి. తమలో తాము గొడవపడ్డాయి. దాంతో గద్ద ‘మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను’ అంది. ‘అలాగే’ అన్నాయి పావురాలు. 

‘అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. రోజుకో పావురం ఆహారంగా రావాలి’ అంది. దాని దుర్బుద్ధి అర్థమైన పావురాలు కూడబలుక్కొని గద్దను తరిమేశాయి.  కలిసి మెలిసి జీవించాయి.


VIDEOS

logo