శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 26, 2021 , 01:00:58

బామ్మ గెలిచింది!

బామ్మ గెలిచింది!

యాభై రెండేండ్లుగా భర్త ఆస్తి కోసం న్యాయ పోరాటం చేస్తున్న ఆ వయోధికురాలు, ఎట్టకేలకు గెలిచింది. దాయాదుల మోసాన్ని ఎదిరించి, 73 ఏండ్ల వయస్సులో మొగుడి ఆస్తికి వారసురాలిగా నిలిచింది అహ్మదాబాద్‌ ఖేడా జిల్లాలోని నడియాడ్‌కు చెందిన లీల. 1967లో.. ఇరవై ఏండ్ల ప్రాయంలో అరేరా గ్రామానికి చెందిన సంపత్‌సింగ్‌ను పెండ్లి చేసుకుంది లీల. కానీ ఏడాదికే భర్త మరణించాడు. అత్తింటివాళ్లు వితంతు వివాహానికి పూర్తిగా వ్యతిరేకం. దీంతో పుట్టిల్లు చేరింది. తన భర్త పేరున ఉన్న భూములను అతడి అన్న మహిపాల్‌సింగ్‌ ఫోర్జరీ సంతకాలతో తన పేరున రాయించుకున్నాడని ఆలస్యంగా తెలుసుకుంది. వెంటనే కేసు పెట్టి, మహిపాల్‌ మోసాన్ని బయట పెట్టేందుకు సాక్ష్యాలు సేకరించే పని మొదలుపెట్టింది. అంతేకాదు, ఆ కుటుంబంలో మహిపాల్‌ అన్నదమ్ముల వరుస మరణాలు కూడా ఆమెలో అనేక సందేహాలు కలిగించాయి. అందరి భూములూ మహిపాల్‌ పేరునే రిజిస్టరు కావడమూ గమనించింది. ఆ ఆస్తుల పూర్తి వివరాలను సేకరించి, కోర్టుకు సమర్పించింది. ఫోర్జరీ వ్యవహారాల గుట్టు రట్టు చేసింది. అంతిమంగా కేసూ గెలిచింది. అయితే, ఇదంతా జరగడానికి యాభై రెండేండ్లు పట్టింది. ‘రెండు పదుల వయస్సులో భర్తను కోల్పోయాను. ఆయన జ్ఞాపకమైన పొలాన్ని కూడా కోల్పోతానేమో అని భయపడ్డాను. న్యాయం నా పక్షాన నిలిచింది’ అని సంతోషంగా చెబుతున్నది లీలమ్మ.


VIDEOS

logo