మంగళవారం 02 మార్చి 2021
Zindagi - Jan 24, 2021 , 00:36:23

స్వర్గరథం..మమత సారధ్యం!

స్వర్గరథం..మమత సారధ్యం!

మనిషి జీవించడూ, మరణించడూ. ఈ భూమి మీదికి ఓ అతిథిగా వచ్చి  కొంతకాలం ఉండి వెళ్తాడంతే. ఆ చుట్టాన్ని సగౌరవంగా సాగనంపడం మన బాధ్యత. పరకాల పరిసర ప్రాంతాలలో ఆ కర్తవ్యాన్ని ‘స్వర్గరథం’ మమత స్వీకరించింది. 

ఆమె పేరు మండల మమత. ఊరు వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని శాయంపేట మండల కేంద్రం. ఇదే జిల్లా పరకాల పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది. రాత్రి వేళ రోగులకు సేవలందిస్తూనే, పగలు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. మమత నడుపుతున్న వాహనం కారో, ఆటోరిక్షానో కాదు.. స్వర్గరథం! అంతిమయాత్రల బండి. ఆ బాధ్యత తీసుకోవడానికి పురుషులే వెనుకాడుతున్న సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చింది. ధైర్యంగా స్టీరింగ్‌ పట్టింది. ఒక్క ఫోన్‌ కాల్‌ చాలు. మృతదేహాలను స్వర్గరథంపై శివముక్తి ధామానికి (శ్మశానవాటిక) తీసుకెళ్తుంది. 

లయన్స్‌ క్లబ్‌ చొరవ

పరకాల ప్రాంత ప్రజల కోసం స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఇక్కడ శివముక్తిధామాన్ని నిర్మించింది. డాక్టర్‌ పింగిళి విజయపాల్‌రెడ్డి దీని నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. రెండు వాహనాలను కూడా సమకూర్చారు. అంతిమయాత్రకు అనువుగా వాటిని తీర్చిదిద్దారు. ‘స్వర్గరథం’ పేరుతో ఇవి సేవలు అందిస్తున్నాయి. పరకాల ప్రాంతంలోని ఆరేడు మండలాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఇంట్లో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు పరకాలలోని డాక్టర్‌ విజయపాల్‌రెడ్డి హాస్పిటల్‌ను సంప్రదిస్తారు. పేరు, ఇతర వివరాలు అందించి కొంత ఫీజు చెల్లిస్తారు. దీంతో, సీరియల్‌ ప్రకారం శివముక్తిధామంలో ఏర్పాట్లు జరుగుతాయి. 

నర్సు కూడా..

పరకాలలోని డాక్టర్‌ విజయపాల్‌రెడ్డి హాస్పిటల్‌లో పనిచేస్తున్న మమత రెండేండ్లుగా నర్స్‌గా, డ్రైవర్‌గా రెండు విధులూ నిర్వర్తిస్తున్నది. స్వర్గరథం నడిపేందుకు మిగతా సహచరులు నిరాసక్తత చూపడంతో, తానున్నానంటూ స్టీరింగ్‌ పట్టింది. స్వర్గరథం మమతగా పరకాల ప్రజలకు సుపరిచితురాలైంది. స్వర్గరథం రావడం ఆలస్యమైతే జనం నేరుగా మమతకే కాల్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఆమె హాస్పిటల్‌ అంబులెన్స్‌ను కూడా నడుపుతుంది. అర్ధరాత్రి సైతం మారుమూల గ్రామాలకు వెళ్లి పేషెంట్లను తీసుకొస్తుంది. ‘ఒకరోజు డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడం వల్ల స్వర్గరథం ఆగిపోయింది. విజయపాల్‌రెడ్డి సారు పిలిచి ఆ బాధ్యత అప్పగించారు. ఆ రోజు నుంచీ స్వర్గరథం నడుపుతున్నా. రెండేండ్లవుతున్నది. కరోనా సమయంలోనూ  నేను బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి నాకు వాహనం సమకూర్చితే, తక్కువ ఖర్చుతో ప్రజలకు స్వర్గరథం సేవలందించాలనేది నా లక్ష్యం’ అంటారు మమత. 


...వేముల రాజేశ్వర్‌రావు

నమస్తే తెలంగాణ, వరంగల్‌ రూరల్‌

VIDEOS

logo