శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 16, 2021 , 00:06:49

పెద్దలకు..పెద్ద దిక్కు!

పెద్దలకు..పెద్ద దిక్కు!

తనను పెంచి పెద్ద చేసిన మేనత్తకు చరమాంకంలో సేవ చేయలేకపోయానన్న ఆవేదన ఆమె జీవితాన్నే మార్చేసింది. పండుటాకులకు సేవ చేయడమే కాదు.. వారు మరణిస్తే కన్న బిడ్డలా అంత్యక్రియలు కూడా తానే జరిపిస్తూ, మానవత్వం బతికే ఉందని చాటుతున్నారు నాగచంద్రికా దేవి. 

ఎన్ని కోట్లు సంపాదించినా.. ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా... చరమాంకంలో పిల్లల ఆదరణకు నోచుకోలేకపోవడం, అంత్యక్రియలు జరిపేందుకు కూడా కొందరు బిడ్డలు నిరాకరించడం నాగచంద్రికను ఎంతగానో బాధించింది. తన వంతుగా ఏదైనా చేయాలనే బాధ్యతతో, హైదరాబాద్‌లో కిన్నెర వెల్ఫేర్‌ సొసైటీని స్థాపించారు. ఎంతోమంది వయోధికుల చివరి రోజులు ఆమె ఒడిలోనే గడిచిపోయాయి. 

ఎన్నో జ్ఞాపకాలు

‘మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లాను. ఆయన ఎక్కువసేపు బతకడని అర్థమైంది. కనీస బాధ్యతగా స్నానం చేయించాను. మంచినీళ్లు తాగించాను. నా చేతిలోనే తృప్తిగా మరణించాడు. ఆ వెంటనే అంత్యక్రియలు జరిపించి ఇంటికి వచ్చాను. ఓ రోజు గాంధీ దవాఖాన నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయనొక ప్రొఫెసర్‌. తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉన్నా.. పట్టించుకోవడం లేదు. వెంటనే మా కేంద్రానికి తీసుకువచ్చాను’ అంటూ సమాజంలోని పరిస్థితులను ఉద్వేగంతో వివరిస్తారామె. తన కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, తల్లిదండ్రులకు పెద్ద కొడుకులా తానే తలకొరివి పెట్టాల్సి వచ్చిన సందర్భాన్ని తడి కండ్లతో గుర్తు చేసుకుంటారు నాగచంద్రికా దేవి. 


నిండు మనసులు

తొంభై దాటినవారు కూడా తనను నోరారా అమ్మా అని పిలవడం, తాను కనిపించకపోతే కంగారు పడిపోవడం .. ప్రేమ గొప్పదనానికి సాక్ష్యాలని అంటారామె. తాము పంచే బ్రెడ్‌లూ, పండ్లూ భద్రంగా దాచుకుని ఏ వారాంతాల్లోనో చూడటానికి వచ్చే తమ పిల్లలకు ఇచ్చే కన్నవాళ్లను చూసిన ప్రతిసారీ ఆమె గుండె కదిలిపోతుంది. ఆ అనురాగమే ఆమెతో ఇప్పటి వరకూ ఆరువందల పద్దెనిమిది అనాథ మృతదేహాలకు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించేలా చేసింది. పెద్దలకోసం ఓ సంరక్షణ కేంద్రాన్ని స్థాపించమంటూ ప్రోత్సహించింది. ఈ మహత్కార్యం కోసం విద్యుత్‌శాఖలో ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా భావించే ధైర్యాన్నీ ఇచ్చింది. 

- వి.డి.ఎస్‌.రాజు 

VIDEOS

logo