శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 16, 2021 , 00:06:49

కాలానికి మొలకలు!

కాలానికి మొలకలు!

కొత్త సంవత్సరం వచ్చేసింది. అందరి ఇండ్లలోకి కొత్త క్యాలెండర్లు కూడా వచ్చేశాయి. ఒక్కో నెల మారుతున్నకొద్దీ ఒక్కో కాగితాన్ని నిర్దాక్షిణ్యంగా చించేస్తాం. ‘అవును మరి, పాత నెల కాగితాన్ని పడేయకుంటే ఏం చేయాలి’ అంటారా? మనసుంటే మార్గమూ ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. క్యాలెండర్‌ కాగితంతో మొక్కలనూ మొలకెత్తించవచ్చు. ఇదే కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది ఆగ్రాకు చెందిన ప్రీతి భట్నాగర్‌. ఢిల్లీలో చదువుకుని ఆగ్రాలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ప్రీతికి ప్రకృతిపట్ల మక్కువ. కళలపై ప్రేమ. వాటర్‌ కలర్స్‌తో పెయింటింగ్స్‌ వేయడం చాలా ఇష్టం. సీడ్‌ పేపర్‌తో క్యాలెండర్లు తయారు చేయాలన్న ఆమె కోరికే.. ప్రకృతిపై తన ప్రేమను చాటి చెబుతున్నది.

ఈ మమకారంతోనే ‘ప్లాంటబుల్స్‌' అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ‘ఫేసెస్‌ అండ్‌ ప్లేసెస్‌' పేరుతో 2021 క్యాలెండర్లను సీడ్‌ పేపర్లతో తయారు చేసింది. ఒక్కో నెలకు సంబంధించిన కాగితంపైనా ఒక్కో చిత్రాన్ని వాటర్‌ కలర్స్‌తో అందంగా పెయింట్‌ చేసింది. అందులో రాజస్థానీ మహిళ, రిక్షా తొక్కే పేదవాడి నుంచి చారిత్రక కట్టడాల వరకూ అనేకం ఉన్నాయి. నెల పూర్తవగానే ఆ కాగితాన్ని తడిపి మట్టిలో పెట్టాలి. అంతే, కొన్నిరోజులకు అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రీతి తన క్యాలెండర్‌ తయారీలో పూలు, కూరగాయలు, ఔషధ మొక్కల విత్తనాలతో తయారు చేసిన సీడ్‌ పేపర్స్‌ను ఉపయోగించింది.


VIDEOS

logo