మంగళవారం 09 మార్చి 2021
Zindagi - Jan 16, 2021 , 00:06:55

ఒలింపిక్స్‌ పతకానికి ‘వల’!

ఒలింపిక్స్‌ పతకానికి ‘వల’!

ఆమె తండ్రి జాలరి. ఏడుగురు తోబుట్టువులు. రెక్కాడితేగానీ డొక్కాడని పేదరికం. కుటుంబానికి ఆసరాగా నిలబడటానికి చేపలు పట్టడం నేర్చుకుంది. పొట్టకూటి కోసం పూనుకున్న పని, మధ్యప్రదేశ్‌కు చెందిన కావేరీ ధీమర్‌ను ఒలింపిక్స్‌ వరకూ తీసుకెళ్తున్నది.  

కావేరిది మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని ఓ గ్రామం. నలుగురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇందిరా సాగర్‌ డ్యామ్‌ మిగులు జలాల్లో చేపలు పట్టి విక్రయించేవాడు కావేరి తండ్రి రాంఛోడ్‌ ధీమర్‌. తండ్రికి సాయంగా పిల్లలు కూడా చేపలు పట్టేవారు. అలా చేపలు పడుతూ, ఈతలు కొడుతూ పడవను నడపటం నేర్చుకుంది కావేరి. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. డ్యామ్‌లో ప్రారంభమైన పడవ ప్రయాణం మధ్యప్రదేశ్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి చేర్చింది. కావేరిలోని ప్రతిభను గుర్తించిన క్రీడా అధికారి జోసెఫ్‌ బక్సాలా భోపాల్‌లోని స్పోర్ట్స్‌ అకాడమీకి తీసుకొచ్చారు. అరుదైన వాటర్‌ స్పోర్ట్స్‌లో ఒకటైన కానోయింగ్‌లో శిక్షణనిచ్చారు. నాలుగేండ్లలో దేశంలోనే ‘టాప్‌ ఫీమేల్‌ కానోయర్‌'గా నిలిచిందామె. సబ్‌ జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ఇప్పటికే 12 బంగారు పతకాలు సాధించింది పదిహేడేండ్ల కావేరి. ‘మాకు ఆస్తిపాస్తులు లేవు. చేపలు పట్టి అమ్మడం మా నాన్న వృత్తి. ఒలింపిక్స్‌లో ఎలాగైనా మెడల్‌ సాధించి  కుటుంబ పరిస్థితిని మెరుగుపరచాలన్నది నా లక్ష్యం’ అంటున్నది కావేరి. మరో రెండు నెలల్లో జరుగనున్న  ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ టెస్టులో పాల్గొనేందుకు ఇండియన్‌ నేషనల్‌ క్యాంప్‌లో కఠోర సాధన చేస్తున్నది ఈ జలపుత్రిక.

VIDEOS

logo