కరోనా కుబేరురాలు!

కరోనాతో మూలన పడిన పరిశ్రమలు ఉన్నాయి, దివాలా తీసిన వ్యాపారవేత్తలూ ఉన్నారు. జీతాల కోతలకు గురైన ఉద్యోగులు అనేకమంది. కానీ, ఓ మహిళా శాస్త్రవేత్తను మాత్రం కరోనా సంపన్నురాలిని చేస్తున్నది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, ఎట్టకేలకు వ్యాక్సిన్ వచ్చేసింది. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు, ఆస్ట్రాజెనికా సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తయారుచేసిన వ్యాక్సిన్‌ను యూకేలో కొన్నిరోజుల క్రితమే ఆమోదించారు. ఈ ఆవిష్కరణలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ కృషి అపారం.
సారాకు చిన్నప్పటినుంచీ వైద్య పరమైన ఆవిష్కరణలంటే ఇష్టం. బయాలజీలో గ్రాడ్యుయేషన్ చేసినప్పటి నుంచీ మందులు కనిపెట్టే రంగంలో పనిచేయాలనుకుంది. ఆక్స్‌ఫర్డ్‌లో కొలువూ సంపాదించుకుంది. ఇన్ఫ్లుయాంజా వ్యాక్సిన్ తయారీలో చురుకైన పాత్ర పోషించింది. ఆ అనుభవం ఇప్పుడు ఎంతో పనికొచ్చింది. చైనా కొవిడ్-19 పూర్తి జన్యుశ్రేణిని విడుదల చేసిన వెంటనే గిల్బర్ట్.. తన పరిశోధక బృందంతో కలిసి వ్యాక్సిన్‌పై పనిచేయడం ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే అనుకున్నది సాధించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా కరోనాను అంతమొందిస్తే మాత్రం.. కొన్ని వందల కోట్ల రూపాయలు సారా అకౌంట్లో పడటం ఖాయం. వ్యాక్సిన్ అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో ఆరు శాతం ఆమెకే చెందేట్టు ఓ ఒప్పందం కూడా ఉంది. అయితే, ‘నేను వ్యాక్సిన్‌ను కనుగొన్నది డబ్బు కోసం కాదు. ప్రపంచాన్ని ఈ మహమ్మారి బారి నుంచి కాపాడాలనే సంకల్పంతోనే’ అంటారామె.