శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 01, 2021 , 02:54:51

వేయి శుభములు.. కలుగు నీకు! 2021

వేయి శుభములు.. కలుగు నీకు! 2021

నీకు నువ్వే వికాస గురువు. నీకు నువ్వే విజయ మంత్రం. నీకు నువ్వే నేస్తం. నీకు నువ్వే సమస్తం. ఆగిపోతే వీగిపోతావు. అనుభవాల పాఠాలు నే ర్చుకుంటూ ఏటికేడాది రాటుదేలాల్సిందే! పురుషాధిక్య సమాజాన్ని  ప్రశ్నించడానికి.. నీకున్న బలం సరిపోదు. మరింత సత్తువ కూడగట్టుకోవాలి, వివక్షను నిలదీయడానికి నీ పిచ్చుక గొంతుక సరిపోదు. సాధనతో  స్వరాన్ని సానబెట్టుకోవాలి.  నిన్ను నీవు  మార్చుకోవాలి, సమర్థంగా తీర్చుకోవాలి. ఈ ఏడాది నీ చేతిలో ఉన్నది 365 రోజులు కాదు, మూడువందల అరవై అయిదు ఆయుధాలు! 

ఆరోగ్యం

మహిళ ఆరోగ్యం అంటే, కుటుంబ ఆరోగ్యమే. గత ఏడాది నేర్పిన పాఠాలను మరచిపోకండి. వంటకోసం ఆరోగ్యకరమైన దినుసులనే ఎంచుకోండి. ఆరోగ్యకరమైన పద్ధతిలోనే వండండి. ఆరోగ్యకరమైన భోజనమే వడ్డించండి. ఇంటి బాధ్యతల్లో పడిపోయి మీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి.

అభిరుచులు

అటు కుటుంబం, ఇటు ఉద్యోగం.. రెండు బాధ్యతల్నీ సమన్వయం చేసుకోవడం కత్తి మీద సామే. అయినా మీరు నిభాయిస్తున్నారు. కానీ, అక్కడితో ఆగిపోకండి. అభిరుచుల్ని దూరం పెట్టేయకండి. పుస్తకాలు చదవండి. కొత్త భాషలు నేర్చుకోండి. కుట్లూ అల్లికలు మొదలుపెట్టండి. ఆనందాన్నిచ్చే ఏదో ఓ వ్యాపకానికి రోజుకో గంట కేటాయించుకోండి.

వ్యాయామం

వాకింగ్‌ మానేస్తే ఓ గంట కలిసొస్తుంది, యోగా క్లాసుకు డుమ్మా కొడితే బ్రేక్‌ఫాస్ట్‌ వండేయవచ్చు.. అన్న ధోరణి సరికాదు. వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోండి.  పిల్లల మీదే కాదు, మీ శరీరం  మీదా శ్రద్ధ పెట్టండి. 

సోషల్‌ మీడియా

సామాజిక మాధ్యమాలు పచ్చని జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. అనాలోచితంగా పెట్టే పోస్టులు, అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, చేసే కామెంట్లు .. జీవితాల్ని రచ్చకీడుస్తున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. అపరిచితులతో ఇ-స్నేహాలు వద్దు. ఆర్థిక వివరాలు, వ్యక్తిగత ఫొటోలు షేర్‌ చేసుకోవద్దు. 

కెరీర్‌

మీ ఉద్యోగం ఎవరో అయాచితంగా ఇచ్చింది కాదు. మీదైన ప్రతిభతో వంద మందితోనో, వేయి మందితోనో పోటీపడి సాధించుకున్నది. ఎదుగుదల మీ హక్కు. ఆ మార్గంలో ఎన్ని చిక్కులున్నా అధిగమించండి. పెద్ద చదువులు చదవండి. నైపుణ్యాలు పెంచుకోండి. ఏ మాత్రం వివక్ష ఎదురైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి, ఎప్పుడూ సందేహించకండి. 

వైద్య పరీక్షలు

నలభై నిండుతున్నాయంటే.. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఏడాదికి ఒకసారి సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోండి. తరచూ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించండి. శరీరంలో వచ్చే ఏ అసహజమైన మార్పునూ నిర్లక్ష్యం చేయకండి. జీర్ణ వ్యవస్థ మీదా, విసర్జన వ్యవస్థ మీదా కన్నేసి ఉంచండి. తూకం యంత్రం, బీపీ మానిటర్‌ ఇంట్లోనే పెట్టుకోండి.   

లైంగిక జీవితం

ఐదు పదులు దాటాయనో, ఆరు పదులకు చేరువలో ఉన్నామనో లైంగిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మిగతావారితో పోలిస్తే, హుషారైన సెక్స్‌ జీవితాన్ని గడుపుతున్న మహిళలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. లైంగిక ఆనందానికి అవరోధాలు ఉంటే, నిపుణులను సంప్రదించండి. సంకోచించాల్సిన పన్లేదు. 

మనసు

శరీరం గురించి అంతో ఇంతో పట్టించుకునేవారు కూడా, మనసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. దీంతో కుంగుబాటు లాంటి సమస్యలు నిశ్శబ్దంగా దాడి చేస్తాయి. దాంతోపాటే.. నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి. బుర్రను దెయ్యాల కార్ఖానాగా మార్చేస్తాయి. మనసుమీద నియంత్రణకు ధ్యానం, యోగా ఉపకరిస్తాయి. 

భావోద్వేగాలు

మహిళలు భావోద్వేగాల్ని అస్సలు దాచుకోలేరనే అపవాదు ఉంది. దాన్ని నిజం చేయకండి. చిన్న వాదనకే కన్నీళ్లు పెట్టుకోవడం, కొద్దిపాటి అభిప్రాయ భేదానికే ఆగమాగం చేయడం ధీర వనిత లక్షణాలు కాదు. భావోద్వేగాల మీద అదుపు సాధించండి. మీ నవ్వూ, ఏడుపూ మరొకరికి వినోదం కాకూడదు. 

ప్రొఫెషనలిజం

సహోద్యోగులంతా స్నేహితులు కాదు. యాదృచ్ఛికంగా మీ పక్కసీటులో కూర్చుంటారంతే! అంతమాత్రాన, మీ జీవిత కథనంతా సీరియల్‌లా వినిపించాల్సిన పన్లేదు. మీ కుటుంబ వ్యవహారాలన్నీ వాళ్లకు తెలియాల్సిన పన్లేదు. సంబోధనల్లో చుట్టరికాలు వద్దు. ఏకవచనాలూ వద్దు. మీ చుట్టూ  లక్ష్మణ రేఖ గీసుకోండి. అవతలి వ్యక్తి మీ బాస్‌ అయినా సరే, ప్రొఫెషనల్‌గానే ఉండండి.

ఆహార్యం

ఓ వయసుకు రాగానే, చాలామందిలో వస్త్రధారణ మీద ఆసక్తి తగ్గిపోతుంది. చీర.. కట్టుకోవడం మానేస్తారు, చుట్టుకోవడం మొదలుపెడతారు. బట్టల నాణ్యతను, సైజులనూ పట్టించుకోరు. ఇది సరికాదు. వస్త్రధారణ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. అలా అని, స్థోమతకు మించిన దుస్తులు కొనాల్సిన పనిలేదు. హుందాగా ఉండేలా చూసుకుంటే చాలు. త్యాగాలు

మహిళలేం త్యాగాలకు బ్రాండ్‌ అంబాసిడర్లు కాదు. భర్త, పిల్లలు, కొలీగ్స్‌, బంధువులు .. ఎవరి కోసమో తమ ఎదుగుదలను వదులు కోవాల్సిన పన్లేదు. సాయమైనా, సహకారమైనా ఇబ్బంది కలుగనంత వరకే! ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. కాకపోతే, ఆ చెప్పేదేదో సున్నితంగా చెప్పండి. 

లక్ష్యాలు

బాబుకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ రావాలి, పాపకు మెడిసిన్‌లో సీటు దొరకాలి, ఆయన గెజిటెడ్‌ హోదా పొందాలి.. ఇవన్నీ, ప్రత్యక్షంగా మీ జీవిత లక్ష్యాలు కాదు. మీదే అయిన లక్ష్యం ఏమిటి? జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారు? ఆ వైపుగా ప్రయత్నాలు ప్రారంభించారా?  కనీసం ఈ ఏడాది అయినా మీ లక్ష్య ప్రకటన తయారు చేసుకోండి. మీ కోసం మీరు బతకడం ప్రారంభించండి. 

ఆర్థిక  స్వేచ్ఛ

మన సంపాదన మనకు తెలియాలి. మన డెబిట్‌ కార్డు మన బ్యాగులో ఉండాలి. మన ఆదాయపు పన్ను వ్యవహారాలు మనమే చక్కబెట్టుకోవాలి. మన బ్యాంకు బ్యాలెన్స్‌ మనకు తెలిసి తీరాలి. భర్తా, పిల్లలా అన్నది అప్రస్తుతం. ఆర్థిక వ్యవహారాల్లో పరాధీనత వద్దు.  ఆర్థిక స్వేచ్ఛ  పరిపూర్ణ స్వేచ్ఛలో ప్రధాన భాగం.

VIDEOS

logo