బుధవారం 27 జనవరి 2021
Zindagi - Dec 04, 2020 , 00:21:39

శిఖరమంత లక్ష్యం!

శిఖరమంత లక్ష్యం!

సాధించాలి అనే కసి పెరిగినప్పుడు డబ్బుపై దృష్టి తగ్గించాలి. ఎందుకంటే కరెన్సీ.. కొత్త మార్గాలను చూడనీయదు. లక్ష్యాన్ని చేరుకుంటే డబ్బు దానంతట అదే వస్తుంది. భీమరి బస్వరాజ్‌ది అలాంటి ప్రయాణమే. చిన్నప్పుడే లక్ష్యం ఏర్పరచుకున్నా.. బాధ్యతలకు బందీ అయిపోయాడు తను. పూర్ణ, ఆనంద్‌ల స్ఫూర్తితో మళ్లీ లక్ష్యంవైపు కదిలాడు. శిఖర సమానంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

కొలంబస్‌.. అన్వేషణకు బయల్దేరేటప్పుడు ఒక్కడే. తర్వాత ప్రపంచాన్నే తన దారిలో నడిపించాడు. కొలంబస్‌లా కొత్తగా ఆలోచించేవాళ్లను కొందరు పిచ్చోళ్లతో పోలుస్తారు. కానీ అలాంటివాళ్లే చరిత్రను తిరగరాస్తారు. బస్వరాజ్‌ది మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం తుర్కల మందాపూర్‌ గ్రామం. చిన్నప్పటి నుంచే చెట్టూ గుట్టలతో సహవాసం. క్రమంగా అడ్వెంచర్‌పై దృష్టి పెట్టాడు. 

పూర్ణ-ఆనంద్‌లను చూసి..  

బస్వరాజ్‌ది పేద కుటుంబం. నాన్న లేడు. తల్లి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించింది. పిల్లలను పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహించింది. ఆ తల్లి అండతో బస్వరాజ్‌ పీజీ వరకు చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కుటుంబ భారం మీద పడటంతో రామాయంపేట సాంఘిక సంక్షేమ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్‌గా పనిచేస్తున్నాడు. బాధ్యతల పరుగులో పడి అడ్వెంచర్‌ గురించి ఆలోచించేంత సమయం లేకుండా పోయింది. చిన్నతనంలోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సృష్టించిన పూర్ణ, ఆనంద్‌లను చూసి స్ఫూర్తి పొందాడు. వారి సాహసం తన లక్ష్యాన్ని గుర్తుచేసింది. డబ్బు కావాలి కానీ.. అస్తమానం దాని ధ్యాసే ఉంటే కొత్తగా ఆలోచించలేం.. లక్ష్యాన్ని చేరుకోలేం.. అనుకున్నాడు. అంతే, పర్వతారోహణవైపు అడుగులు వేశాడు. 

కిలిమంజారో అధిరోహణ  

నీటిని చూసి భయపడితే ఈత ఎప్పటికీ రాదు. ఒకటికి రెండుసార్లు నీళ్లలోకి దూకితేనే లోతులు చూడగలం. బస్వరాజ్‌ ఇదే సూత్రాన్ని నమ్మాడు. వైఫల్యాలను దాటుకుంటూ నిరాశ.. నిస్పృహలను అధిగమిస్తూ దూసుకెళ్లాడు. ఒక కాలు కోల్పోయినా, ఆత్మ విశ్వాసంతో ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన అరుణిమ లాంటి వాళ్ల జీవితం నుంచి స్ఫూర్తి పొందాడు. మల్లి మస్తాన్‌రావు వంటి దిగ్గజ పర్వతారోహకుల గురించి అధ్యయనం చేసి లక్ష్యంపై మరింత స్పష్టతను ఏర్పరచుకున్నాడు. మొదటగా సిక్కింలోని బీసీరాయ్‌ మంచుపర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించాడు. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. తర్వాత మళ్లీ ప్రయత్నించి గెలుపు జెండా ఎగిరేశాడు.  తర్వాత, ఇండియాలోని ఎత్తయిన పర్వతాల్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ సాహస యాత్రలో కొన్ని విజయాలు ఉన్నాయి. కొన్ని వైఫల్యాలూ ఉన్నాయి.  వాటన్నిటినీ విజయానికి సోపానాలుగా మలుచుకొని 2017లో కిలిమంజారో పర్వతంపై తెలంగాణ ఖ్యాతిని రెపరెపలాడించాడు బస్వరాజ్‌. 

ఫ్రెండ్‌షిప్‌ పీక్‌పై జయకేతనం 

కిలిమంజారోను అధిరోహించిన బస్వరాజ్‌ ఇక పర్వతారోహణలో వెనుదిరగకుండా సాధన చేస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వతాలన్నీ ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒక్కొక్కటి అధిగమిస్తూ  లక్ష్యానికి చేరువలో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నా ఆత్మవిశ్వాసంతో పర్వతాలను అధిరోహించి రికార్డులు సాధిస్తున్నాడు. 2019లో ఉత్తరాఖండ్‌లోని 6512 మీటర్ల ఎత్తయిన మౌంట్‌ భగీరథ సాహసయాత్రను పూర్తి చేసిన బస్వరాజ్‌.. తాజాగా అక్టోబర్‌ 20న హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫ్రెండ్‌షిప్‌ పీక్‌ పర్వతాన్నీ పాదాక్రాంతం చేసుకున్నాడు. 

సాహసంతోపాటు సందేశం

ఎవరెస్ట్‌ మీది నుంచి జాతీయ జెండాను.. తెలంగాణ తెగువను రెపరెపలాడించాలనేది అతడి లక్ష్యం. గొప్ప వ్యక్తుల అడుగుజాడల్లో నడిస్తే అనుకున్న లక్ష్యం ఎప్పటికైనా గొపగానే ఉంటుందనేది తన ఆలోచన. అందుకే నిద్ర లేచింది మొదలు.. పడుకునేదాకా మౌంటెనీరింగ్‌ గురించి తప్పితే వేరే ఏ విషయాలు మాట్లాడడు. శోధన.. సాధన.. ఆచరణతోనే బస్వరాజ్‌ దినచర్య పూర్తవుతుంది. పర్వతాలను అధిరోహించడమే కాదు.. వాటి ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. పర్యావరణం, రోడ్‌ సేఫ్టీలపై అవగాహన కల్పిస్తూ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గొంతుకను వినిపిస్తున్నాడు. అంతెత్తు పైనుంచీ అబ్దుల్‌ కలామ్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వంటి మహనీయులకు నివాళులు అర్పిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, రాష్ర్టావిర్భావ వేడుకలు కూడా పర్వతారోహణలోనే జరుపుకొని దేశభక్తిని చాటాడు... తెలంగాణ మట్టి రుణం తీర్చుకుంటున్నాడు.. బస్వరాజ్‌!

త్వరలో ఎవరెస్ట్‌కు..

2021లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నా. కరోనా వల్ల ఈ సంవత్సరం కుదరలేదు. ఎవరెస్ట్‌ అంటే మాటలు కాదు. ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాలి. అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా లక్ష్యాన్ని చేరుకుంటా. దీనికి పేదరికం అడ్డురాదని నిరూపిస్తా. విజయం సాధిస్తా. భీమరి బస్వరాజ్‌


logo