ఆదివారం 24 జనవరి 2021
Zindagi - Dec 03, 2020 , 00:04:37

వ్యాపకమే వ్యాపారంగా..

వ్యాపకమే వ్యాపారంగా..

ఎంతోమంది కుట్లు అల్లికలను ఓ వ్యాపకంగానే భావిస్తారు.  కొందరు మాత్రమే  వ్యాపారంలా మలుచుకుంటారు. ఢిల్లీకి చెందిన ఆశా పురి రెండో కోవకు చెందినవారు. 75 ఏండ్ల ఈ బామ్మఅల్లికలతోనే ఆదాయం పొందుతున్నారు. 

ఉలెన్‌తో స్వెట్టర్లు, మఫ్లర్లు, స్కార్ఫ్‌లను అల్లడాన్ని ఓ అలవాటుగా చేసుకున్నారు ఆశాపురి. 50 ఏండ్లుగా తన కుటుంబసభ్యుల కోసం అనేక రకాల ఉన్ని దుస్తులను అల్లేవారు. ముఖ్యంగా తన మనవరాలు కృతిక కోసం ప్రత్యేక స్వెట్టర్లను రూపొందించేవారు. అయితే, తన వ్యాపకమే ఓ వ్యాపారంగా మారుతుందని ఆ సమయంలో ఆమె ఊహించలేకపోయారు. చిన్నప్పటి నుంచీ తన కోసం బామ్మ తయారుచేసే స్వెట్టర్లను కృతిక ఎంతో ఇష్టపడేది. ఈ క్రమంలోనే బామ్మ తో స్వెట్టర్ల వ్యాపారం చేయించాలని నిర్ణయించింది. మూడేండ్ల క్రితం ‘విత్‌ లవ్‌ ఫ్రమ్‌ గ్రానీ’ పేరుతో బిజినెస్‌ ప్రారంభించింది. ఆన్‌లైన్‌ద్వారా స్వెట్టర్ల అమ్మకాలు చేపట్టింది. మొదట్లో అమ్మకాలు తక్కువగానే ఉన్నా, క్రమంగా వీరి ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో తమకు సహాయంగా 16 మంది మహిళలను కూడా నియమించుకున్నారు. వారికి అల్లికల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి మార్గం చూపించారు. ఢిల్లీలోని నిరుపేద చేతివృత్తులవారి ఉత్పత్తులకూ తమ వెబ్‌సైట్‌ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 


logo