బుధవారం 20 జనవరి 2021
Zindagi - Dec 03, 2020 , 00:04:39

వీధికుక్కల కోసం..

వీధికుక్కల కోసం..

వీధిలో కుక్కలు కనిపిస్తే కొందరు భయపడిపోతారు. మరికొందరు రాళ్లతో కొట్టడమో, మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్‌ చేయడమే చేస్తారు. కానీ, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి మాత్రం, వీధికుక్కలకు అండగా నిలిచారు. తన సొంత డబ్బుతో వాటి ఆలనాపాలనా చూస్తున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన శైలజ 

ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అందరిలాగే తనుకూడా వీధికుక్కలంటే చాలా భయపడేవారు. కానీ, 2018లో ఒకరోజు తమ కుటుంబసభ్యులు ఓ వీధికుక్కను ఇంటికి తీసుకొచ్చి పెంచారు. అప్పటినుంచీ దానికి తిండిపెడుతూ ఆలనాపాలనా చూసుకునేవారు. క్రమంగా శైలజకు  శునకాలంటే భయం పోయింది. వాటితో అనుబంధం పెంచుకున్నారు. తమ ఇంటికుక్కతోపాటు వీధిలో ఉన్నవాటికీ ఆహారం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం తమ కాలనీలోని 50కిపైగా శునకాల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. తాను పొదుపు చేసుకున్న డబ్బును వీధికుక్కల శ్రేయస్సుకోసం ఉపయోగిస్తున్నారు. వాటికి రోజూ ఆహారం పెట్టడంతోపాటు అవసరమున్న వాటికి వైద్యం కూడా అందిస్తున్నారు. ఎక్కడైనా చిన్నచిన్న పప్పీలు కనిపిస్తే వాటిని ఇంటికి తీసుకెళ్లి సంరక్షిస్తున్నారు. అంతేకాదు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుక్క ప్రాణాన్ని కాపాడేందుకు తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. ప్రస్తుతం డాగ్‌ క్యాచర్లతో కలిసి పనిచేస్తున్నాననీ, భవిష్యత్‌లో వీధికుక్కల సంరక్షణకోసం ఓ ఇంటిని నిర్మించాలనుకుంటున్నాననీ శైలజ చెబుతున్నారు. వీధికుక్కలను కాపాడేందుకు నగరవాసులు కూడా ముందుకు రావాలని కోరుతున్నారు. 


logo